భోగినీ దండకము
భోగినీ దండకము పోతన రాసిన శృంగార ప్రధానమైన లఘుకావ్యం.
కృతికర్త
మార్చుఈ కావ్యంలో చివర ఉండే కింది పద్యాన్ని బట్టి దీనిని సర్వజ్ఞ సింగభూపాలునకు అంకిత మిచ్చినట్లు తెలుస్తున్నది.
పండితకీర్తనీయుఁడగు బమ్మెర పోతనయా సుధాంశుమా
ర్తాండకులాచలాంబు నిధి తారకమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదాన విహర్తకురావుసింగభూ
మండల భర్తకున్ వినుతమానవనాథమాదాప హర్తకున్
కానీ కొంతమంది విమర్శకులు చివరలో ఉండే ఈ పథ్యం మధ్యకాలంలో ఎవరో ప్రక్షిప్తం చేసి ఉండవచ్చుననీ, దాని ఆధారంగా కృతికర్త పోతన అని చెప్పలేమని వాదించారు. చిలుకూరి వీరభద్రరావు పై పద్యంలో పండితకీర్తనీయుఁడ అని కవి తనను ప్రథమ పురుషలో చెప్పడం వలన తన సందేహం వ్యక్తం చేశాడు. కందుకూరి వీరేశలింగం పంతులు మాత్రం నన్నయ, ఎర్రన తదితరులు కూడా ఇలా తమను గురించి తాము ప్రథమపురుషలో చెప్పుకున్నారని కొన్ని సంఘటనలు వివరించి ఇది పోతన కృతమేనని వాదించారు.[1]
చాగంటి శేషయ్య తాను రాసిన కవితరంగిణి లో ఈ కావ్యాన్ని పోతన రాసిఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. మల్లంపల్లి సోమశేఖర శర్మ చాగంటి శేషయ్య అనుమానాలను నివృత్తి చేసి కృతికర్తగా పోతనే అని సమర్ధించాడు. భోగినీ దండకమును 1949లో ప్రచురించిన వావిళ్ళ వారు పోతన ఇది ఒక మహాగ్రంథంగా తలంచక విలాసంగా రచించినట్లు అభిప్రాయపడ్డారు. పోతన చరిత్రను కావ్యంగా రాసిన వానమామలై వరదాచార్యులు కూడా భోగినీ దండకము పోతన కృతి అని అభిప్రాయపడ్డాడు.
కథా సంగ్రహం
మార్చుసర్వజ్ఞ సింగభూపాలుడు గోపాలుని రథోత్సవంలో పాల్గొంటాడు. అతన్ని ఒక వారకాంత కూతురు చూసి మోహిస్తుంది. ఆమె కోరికను తన తల్లికి తెలిపి ప్రభువుకు నచ్చజెప్పమంటుంది. కానీ తల్లి తన కూతురు కోరికను కాదని నచ్చజెపుతుంది. కానీ కూతురు ఆమెను బ్రతిమాలి బలవంతపెడుతుంది. దాంతో ఆమె రాజు దగ్గరికి వెళ్ళి కుమార్తె కోరికను నివేదిస్తుంది. రాజు సుముఖత వ్యక్తం చేసి ఆమెను ఏలుకొన్నాడు. భామినికి భోగిని పట్టం కట్టుట, ఏనుగునెక్కించడం, మొదలగు అంశములు ఇక్కడ వర్ణింపబడ్డాయి.[2]
మూలాలు
మార్చు- ↑ కందుకూరి, వీరేశలింగం. ఆంధ్రకవుల చరిత్ర. pp. 582–83.
- ↑ కొల్లి, బాబూ రాజేంద్రప్రసాద్ (1991). వీరభద్ర విజయము సవిమర్శక పరిశీలనము. p. 28.