వానమామలై వరదాచార్యులు
వానమామలై వరదాచార్యులు (ఆగష్టు 16, 1912 - అక్టోబరు 30, 1984) [1][2] తెలంగాణా ప్రాంత రచయిత.
వానమామలై వరదాచార్యులు | |
---|---|
జననం | వానమామలై వరదాచార్యులు 1912 ఆగస్టు 16 మడికొండ గ్రామం, వరంగల్ జిల్లా, తెలంగాణా రాష్ట్రం |
మరణం | 1984 అక్టోబరు 31 |
వృత్తి | ఉపాధ్యాయుడు, శాసనమండలి సభ్యుడు |
ప్రసిద్ధి | అభినవ పోతన, ఆంధ్ర ఉత్ప్రేక్ష చక్రవర్తి, మహాకవి శిరోమణి, అభినవ కాళిదాసు |
మతం | హిందూ (శ్రీవైష్ణవ) |
భార్య / భర్త | వైదేహి |
తండ్రి | బక్కయ్య శాస్త్రి |
తల్లి | సీతమ్మ |
జననం
మార్చుఈయన వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో ఆగష్టు 16, 1912కి సరియైన పరీధావి సంవత్సర 'శ్రావణ బహుళ ఏకాదశి' నాడు జన్మించాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి ఆంధ్ర సంస్కృత భాషలలో ఉద్ధండ పండితుడు. తల్లి పేరు సీతమ్మ. వైష్ణవ మతావలంబి.
విద్యాభ్యాసం - వివాహం
మార్చురైతు కుటుంబములో జన్మించిన వరదాచార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే చదివాడు. అయినప్పటికీ సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నాడు. తన 18వ యేట మేనమామ కొదుమగోళ్ల జగన్నాథాచార్య ఏకైక కూతురు వైదేహితో వివాహం జరిగింది. ఈయన అన్నలైన వానమామలై వేంకటాచార్యులు, వానమామలై లక్ష్మణాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు కూడా సాహిత్యకారులే.
ఇతర వివరాలు
మార్చుఇతని సహజపాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతాకళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించాడు. ఆ తర్వాత ఇతడు ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పుచ్చుకున్నాడు. విశారద పూర్తయ్యాక చెన్నూర్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశాడు. చెన్నూరులో వేదపాఠశాల నెలకొల్పాడు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు ఇతడిని శాసనమండలికి నామినేట్ చేశాడు. 1978 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగాడు.
రచనలు
మార్చుఇతడు తన 13వయేటనే పద్యరచన ప్రారంభించాడు. 64పైగా రచనలు చేశాడు. వాటిలో కొన్ని
- మణిమాల (పద్యగేయకృతి)-1945
- ఆహ్వానము -1958
- శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం
- పోతన చరిత్రము (మహాకావ్యము)-1966
- జయధ్వజం
- విప్రలబ్ధ (గేయ కథా కావ్యం)
- స్తోత్ర రత్నావళి (అనువాద కావ్యం)
- భోగినీ లాస్యం (వ్యాఖ్యానం)
- గీత రామాయణం (అనువాద గేయ కావ్యం)
- వైశాలిని (మహా నాటకం) -1975
- సూక్తి వైజయంతి (సుభాషితాలు)
- శ్రీ స్తవరాజ పంచశతి (శతక సంపుటి)
- అభ్యుదయ నాటికా సంపుటి
- రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి)
- దాగురింతలు (పద్య కావ్యం)
- వ్యాసవాణి (వ్యాసాలు)
- కూలిపోయే కొమ్మ (వచన కథాకావ్యం)
- మానవులంతా మనవాళ్ళే(నవల)
- పాటలు
- అలంకార శాస్త్రం
- శాకీర్ గీతాలు (అనువాదం)
- పోతన (బాలసాహిత్యం)
- శ్రీ హనుమాన్ చాలీసా (అనువాదం)
- రాజ్యశ్రీ
- సత్యమేవజయతే
- నాగార్జున సాగరము
- జానపద భారతము
- గ్రామ సుధార్
- స్వతంత్ర భారతము
- ఆజాద్ గోవా
- సంక్రాంతి
- పగటి దొంగలు
- స్నేహశక్తి
- వయోజన విద్య
- పెద్దల చదువు
- స్వాతంత్ర్యజ్యోతి
- మోహినీభస్మాసుర
- మహిషాసుర మర్దని
- బుద్ధచరిత్రము(బుర్రకథ)
- ప్రజాసేవ(బుర్రకథ)
- ఎవడు రాజు (బుర్రకథ)
- మనదే జయము
- చైనా యుద్ధము
- భీమమానసరక్తి
- తులసీరామాయణము
- మాతృప్రేమ
- శ్రీ మార్కాండేయ సుప్రభాతము
- అలంకార శాస్త్రము
- గీతోపన్యాసములు
- ఏకపాత్రాభినయములు
- ప్రహసనములు
- గేయరామాయణము
- భజ యతిరాజ స్తోత్రము
- నరహరి నరసింహారెడ్డి జీవితచరిత్రము
- గౌరీశున్యాసములు
- దేశభక్తి
- గొల్లసుద్ధులు
- మణిమాల గ్రంథాన్ని ఆంధ్రసారస్వతపరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచారు. చిత్రం ఏమిటంటే వరదాచార్యులు ఈ పరీక్షకు తాను వ్రాసిన గ్రంథాన్నే పాఠంగా చదువుకున్నాడు.
- విప్రలబ్ధ కావ్యం నుండి వర్షాలు అనే పద్యభాగాన్ని నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు.
- ఆరవ తరగతి తెలుగువాచకంలో ఇతడు వ్రాసిన కుసుమోపదేశము అనే పాఠం చేర్చబడింది.
- పోతన చరిత్రములోని ఒక ఘట్టం భోగినీ లాస్యమును యువభారతి కోసం వ్యాఖ్యాన సహితంగా (తన రచనపై తానే వ్యాఖ్యానించి) అందించాడు.
పురస్కారాలు, సత్కారాలు
మార్చు- 1968లో పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు.
- 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వము.
- 1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి వారిచే గండపెండేరం,స్వర్ణ కంకణం,రాత్నాభిషేకం
- 1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి వారిచే డి.లిట్ వాచస్పతి గౌరవ పట్టా
బిరుదులు
మార్చు- అభినవ కాళిదాసు
- మహాకవి శిరోమణి
- ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి
- అభినవ పోతన
- ఆంధ్ర కవివతంస
- మధురకవి
- కవికోకిల
- కవిశిరోవతంస
డాక్యుమెంటరీ
మార్చుఇతని గురించి ఆసిఫాబాద్ వాసి నాగబాల సురేష్ కుమార్ "మన వానమామలై"[3] అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రం తీశాడు. దీనిని దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌లో 31-10-2010, 31-08-2011తేదీలలో ప్రసారం చేసింది. 2010 సంవత్సర ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డ్ ఈ చిత్రానికి లభించింది.
శతజయంతి
మార్చుఇతని శతజయంతి ఉత్సవాలు 18-8-2011 నుండి 18-8-2012 వరకు జరిగాయి. ఈ సందర్భంగా అనేక సభలు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ లోని జగన్నాథ ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.
రచనల నుండి ఉదాహరణలు
మార్చుకలుపు తీయ రావేమే
కాపోరి పడుచా!... నీ
కంకణాలు గాజుల్లూ
గల్లు గల్లూ మనగా ||కలుపు||
పైట నడుముకు జుట్టి
చేత కొడవలి బట్టి
దుష్టశిక్షణ చేసే
అష్టభుజ కాళికవై ||కలుపు||
మన భూమి యందేమి
పరజాతి యా స్వామి
నఱికి వేసెద నన్న
నారి ఝాన్సీ వగుచు ||కలుపు||
నరుల కన్నము బెట్టు
వరి కఱ్ఱలను జుట్టి
పెరుగనీయని తుంగ
పెఱికెయ్య వలె నింక ||కలుపు||
( ఆహ్వానము గేయసంపుటిలోని రైతురాజు గేయనాటికలోని కొంత భాగము)
కుసుమోపదేశము
పుష్పమా నీదు చరితమ్ము పూర్ణమగును
ఒక్కరెన్నాళ్ళలో నేమి దక్కెనీకు
మంచి వాసనల నెడంద ముంచుకొనియు
చిత్రవర్ణాల పోషోకు జేసికొనియు...
కడుపు నిండార దేనెపాల్గుడుచు చుండి
తీగెటుయ్యలన్ముదముతో నూగుచుంటి
వగ్రిమ స్థానమున క్షణమాగవైతి
కూర్చు తేనెను తుమ్మెదల్ గుడిచిపోయె
అందమెల్లను మట్టిలో నడిగిపోయె
కోమలతనెల్ల యెండలు కుముల జేసె
ఆ సువాసన న్వాయువు లపహరించె
నొక్కరెన్నాళ్ళలో నేమి దక్కె నీకు
రాలిపడి మాతృభూపూజ దేలు మనుటె
ఉన్న రెన్నాళ్ళు నవ్వుచునుండు మనుటె
యునికి కగ్రిమ స్థానమే యొప్పుననుటో
వని సువాసన వలె కీర్తి వైభవములు
వ్యాప్తి గావింపు మనుటొ యీవసుధపైని
విత్తమదియొ మధూకర వృత్తిసేయు
బీదలకె తేనెవలె పంచివేయు మనుటొ
యిట్టిలోక సేవారతిడెవని కేని
పెత్తనము దేవతల తలన్బీఠమిడదె
అందమున సుందరుల తలక్రిందుగాదె
మాయంతరంగాల మాధురిమ సొంపు
మా యెదల నుదయించు మంచి వాసన పెంపు
మీ మనమ్ముల గలదె యో మానవుల్లార
అనుచు మము పరిహాసమాడు గతి నిత్యమ్ము
నవ్వుదువె యో చిన్ని పువ్వు కోమలిరో!
(మణిమాల కావ్యము నుండి)
మరణం
మార్చుఇతడు క్షయవ్యాధి పీడితుడై మైసూరులో 1949 - 1953 ల మధ్య చికిత్సపొందాడు. ఇతని ఊపిరితిత్తులకు పది సార్లు శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తీసివేశారు. ఒక ఊపిరితిత్తితోనే కడదాకా జీవించాడు. 1984, అక్టోబరు 30వ తేదీకి సరియగు రక్తాక్షి నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారం రోజున కన్నుమూశాడు.
బయట లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ http://www.chennur.in/2012/01/varadhaachaaryulu-jan7.html[permanent dead link]
- ↑ అభినవ పోతన వానమామలై వరదాచార్య జీవితం - సాహిత్యం - డా.గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి - విశాలాంధ్ర పబ్లిషింగ హౌస్ ప్రచురణ -2014
- ↑ యూట్యూబ్‌లో డాక్యుమెంటరీ చిత్రం