హారతి

(మంగళ హారతి నుండి దారిమార్పు చెందింది)

మంగళ హారతి హిందూ సంప్రదాయ దేవతార్చనలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి దేవత యొక్క పూజ పూర్తయిన తరువాత కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు. సాధారణంగా ఈ హారతి ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవారు ఆయా దేవతల మంగళ హారతి పాటని పాడతారు. కొన్ని సందర్భాలలో మనుషులకు కూడా హారతి ఇస్తారు. పెళ్ళి, పుట్టినరోజు లలో హారతి ఇవ్వడంలో ఉద్దేశం దిష్టి తీయడము.

హరిద్వార్‌లో గంగానదికి సాయంకాల హారతి

కర్పూర హారతిలో ఎక్కువగా పొగ (Smoke) రాదు. అయితే సుమారు ఇటువంటి ప్రక్రియలో నిప్పులో గుగ్గిలం పొడి వేసి ధూపం వేస్తారు. ఇందులో సుగంధ భరితమైన పొగ వస్తుంది.

పూజలో హారతి ఉద్దేశ్యం మార్చు

భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని "హారతి" లేదా "ఆరతి" అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. అనంతరం హారతిని కళ్ళకద్దుకొంటారు. పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నపుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి వెలుగులో కనుల పండువుగా భగవంతుని మూర్తిని దర్శించే భాగ్యం భక్తులకు కలిగేది.[1] ఇది హారతి సంప్రదాయానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఒక కారణం కావచ్చును.

నేతి వత్తులతో హారతి ఇవ్వడంలో అనేక సంప్రదాయాలున్నాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదకొండు, పదహారు, ఇరవై - ఇలా వివిధ సంఖ్యల వత్తులతో హారతులిస్తారు. హారతి తరువాత మంత్రపుష్పం పూజ జరుగుతుంది.

దక్షిణాది, ఉత్తరాది సంప్రదాయాలు మార్చు

ఉత్తర భారతదేశంలో "జయజగదీశ హరే" అనే పాట దాదాపు అన్ని పూజలలోను వాడుతారు. ఈ భజన గేయం వివిధ దేవతల స్తోత్రాలకు అనుగుణంగా పాఠాంతరాలు కలిగి ఉంది కాని అన్నింటికీ ఒకటే బాణీ వాడుతారు. దక్షిణాదిలో హారతి విధానం మరింత వైవిధ్యం కలిగి ఉంటుంది. "మంగళం" అనే పదంతో అంతమయ్యే పాటలు, శ్లోకాలు ఎక్కువగా పాడుతారు.

విశేషాలు మార్చు

  • షిర్డీ సాయిబాబా పూజలో ఉదయం ఇచ్చే మేలుకొలుపు హారతిని "కాకడ హారతి" అంటారు.
  • అయ్యప్పకు పూజానంతరం శయన సమయంలో పాడే "హరివరాసనం" భజన అయ్యప్ప పూజా విధానంలో చాలా ముఖ్యమైనది.
  • తిరుమల ఉత్తర మాడ వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ అనే భక్తురాలి హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందునుండి రథం కదిలేది కాదట. అందుకు ప్రతీకగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
  • హారతి పళ్ళాల తయారీలో కళాకారుల ప్రతిభ కనిపిస్తుంది. అధికంగా ఇత్తడి పళ్ళాలు, అంచెలంచెల హారతి సెమ్మెలు లభిస్తాయి.

హారతి పాటలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "దత్తపీఠం వారి ప్రచురణ" (PDF). Archived from the original (PDF) on 2011-08-26. Retrieved 2008-12-26.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=హారతి&oldid=3226914" నుండి వెలికితీశారు