అయ్యప్ప

హిందూ దేవుడు, హరి హర పుత్రుడు

అయ్యప్ప స్వామి (ఆంగ్లం: Ayyappa Swamy) హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.

దస్త్రం:SwamiAyyappan.jpg
అయ్యప్ప చిత్రం

ప్రధాన గాథలు

మార్చు
 
అయ్యప్ప పూజా కార్యక్రమం

మహిషి కథనం

మార్చు

మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.

అయ్యప్ప జననం

మార్చు
 
మస్కట్‌లో అయ్యప్ప పూజ - పూజా మంటపం శబరిమలై లోని దేవాలయం నమూనాలో కట్టబడింది.

ఛైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి - సోమవారము నాడు జన్మించారు . జ్యోతి రూపంగా అంర్ధానమయిన రోజు -- మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా ఉంది.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

మహిషి వధ

మార్చు

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను పులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు. పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

శబరిమలైలో నివాసం

మార్చు

రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల నమ్మకము.

దేవాలయాలు

మార్చు

శబరిమలై

మార్చు

శబరిమలై అంటే శబరి యొక్క పర్వతం అని అర్ధం.

దేవాలయ నిర్మాణం:-

అంతట అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ధి చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం, సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాల ధారణ దక్షిణ భారతదేశము లోని తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది.గుడికీ వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఎక్కువగా వస్తారు.

ఇతర ఆలయాలు

మార్చు

ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక పట్టణాల్లో గ్రామాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు.ఆంధ్ర శబరిమలై ద్వారపూడి,శంఖవరంలో నిర్మించారు. గుడి శబరిమలై వలె నిర్మించారు. కరీంనగర్ లోని భగత్ నగర్ లో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం అలాగే పెద్దపల్లి, సుల్తానాబాద్ జమ్మికుంటలో అయ్యప్పస్వామి దేవాలయం ఉన్నాయి హైదరాబాద్ లోని సనత్నగర్ లో అయ్యప్ప గుడికి చాల మంచి పేరు ఉంది. విజయవాడలోని మైలవరం నియోజకవర్గంలో శంషాబాద్ వద్ద శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగింది ఈ దేవాలయం కూడా మన శబరిమలై లాగా ఉంటుంది... నర్సంపేట లో కూడా శ్రీ అయ్యప్ప దేవాలయం నిర్మించడం జరిగింది

పూజా విధానాలు

మార్చు

నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.

దీక్ష, మాల, నియమాలు

మార్చు

భక్తులు కార్తీకమాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య, మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు.అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం (41రోజులు) పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.

దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి (ఆరు సార్లు మాల వేసిన సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.

అయ్యప్ప పూజా విధానం

మార్చు

శ్రీ విఘ్నేశ్వర అదంగ పూజ
శ్రీ విఘ్నేశ్వర అశ్ట్టోతర శతనామావళి
శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి అన్ఘ పూజ
శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి అశ్ట్టోతర శతనామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అన్ఘ పూజ
శ్రీ అయ్యప్ప స్వామి అశ్ట్టోతర శతనమావళి
శ్రీ అయ్యప్ప స్వామి శరను ఘోష [1]

ఇరుముడి

మార్చు

రెండు అరలువున్న మూట. భక్తులు దీనిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు. ఇరుముడిలో1. నేతితో నింపిన కొబ్బరికాయ 2. రెండు కొబ్బరి కాయలు 3. వక్కలు 4. తమలపాకులు 5. నాణాలు 6. పసుపు 7. గంధంపొడి 8. విభూతి 9. పన్నీరు 10. బియ్యం, 11. అటుకులు, 12. మరమరాలు, 13. బెల్లం/అరటిపళ్ళు 14. కలకండ 15. అగరువత్తులు 16. కర్పూరం 17. మిరియాలు (వావర్‌ దర్గాకోసం) 18. తేనె 19. ఎండు ద్రాక్ష 20. తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను 'ఇరుముడి'గా కట్టుకునే ఉత్సవాన్ని'కెట్టునిరా' లేదా 'పల్లికెట్టు' అంటారు.

పడిపూజ

మార్చు

అయ్యప్ప స్వామి

హరివరాసనం

మార్చు

అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.[1]

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం -


హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శబరిమలై యాత్ర

మార్చు
 
శబరిమలైలో దర్శనానికి వేచిఉన్న భక్తులు.

దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

ఎరుమేలి

శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల") . ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర

ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట) . ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి రెండు రాల్లాని తీసుకు వెళతారు. ఆ రాల్లా "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి కరిమలా కొండ చేరుకుంటారు. కరిమలా కొండ ఎక్కడము చాలా కఠినముగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు.కరిమలా కొండ చేరుకునేందుకు ఎంత కష్టముగా ఉంటుందో ఎటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందకు దిగుతుండగా కాలు వణుకుతుంటయాని, ఎక్కడ లోయలో పడిపోతామని కూడా భయపడకుండా "స్వామియే శరణం అయ్యప్పా" అంటూ వేడుకుంటే సాక్షాత్తు జ్యోతిస్వరుపుడు, హరిహరపుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాములా రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకెళ్ళి దర్శనం ఇవ్వడంతోపాటు వారి కోరికలను కూడా తీరుస్తాడని వేదపండితులు అంటారు. పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకుని పంబలో స్నానం చేసిన తరువాత భక్తులు పెద్ద పాదంలో పడిన కష్టాలను మరచిపోవడంతోపాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.

చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి nalugu కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాలి.

సన్నిధానం

భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడి నుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.

సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఒక వేళ 41 రోజులు దీక్ష చేయకుండా "పదునెట్టాంబడి"ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేదపండితులు అంటారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.

ఇతర విశేషాలు

మార్చు

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప కవచం

మార్చు

ఓం నమో భగవతే రుద్రకుమారాయ ఆర్యాయ హరిహరపుత్రాయ మహాశాస్త్రే

హాటకాచలకోటి సుమధురసార మహాహృదయాయ హేమజామ్బూనదరత్న

సింహాసనాధీష్ఠితాయ వైడూర్యమణి మణ్టప క్రీడాగృహాయ

లాక్షాకుంకుమ జపావిద్యుత్ తుల్యప్రభాయ ప్రసన్నవదనాయ

ఉన్మత్త చూడామిళితలోల మాల్యావృత వక్షఃస్తంభ మణిపాదుకమణ్టపాయ

ప్రస్ఫురన్ మణిమణ్డితోపకర్ణాయ పూర్ణాలంకార బన్ధురదన్తి నిరీక్షితాయ

కథా చిత్కోటి వాద్యాది నిరంతరాయ జయశబ్దముఖర నారదాది దేవర్షి

శక్రప్రముఖ లోకపాలకులోత్తమాయ దివ్యాస్త్ర పరిసేవితాయ

గోరోచనాగరు కర్పూర శ్రీగన్ధ ప్రలేపితాయ విశ్వావసు ప్రధాన గన్ధర్వ సేవితాయ

పూర్ణాపుష్కలోభయ పార్శ్వసేవితాయ సత్యసన్ధాయ మహాశాస్త్రే నమః ॥

మాం రక్ష మాం రక్ష, భక్తజనాన్ రక్ష రక్ష,

మమ శత్రూన్ శీఘ్రం మారయ మారయ, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస

యక్షగన్ధర్వ పరప్రేరితాభిచార కృత్యరోగ ప్రతిబన్ధక

సమస్త దుష్టగ్రహాన్ మోచయ మోచయ, ఆయుర్విత్తం దేహిమే స్వాహా ॥

సకల దేవతాన్ ఆకర్షయాకర్షయ ఉచ్చాటయోచ్చాటయ

స్తంభయ స్తంభయ మమ శత్రూన్ మారయ మారయ

సర్వజనమ్మే వశమానయ వశమానయ

సమ్మోహయ సమ్మోహయ

సదా ఆరోగ్యం కురు కురు స్వాహా ॥

ఓం శాంతి శాంతి శాంతి ||

సర్వేజనా సుఖినోభవంతు ||

సమస్త సన్మంగళాని భవంతు

అయంధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు

ఏతత్ సర్వం శ్రీ అయ్యప్పార్పణమస్తు ||

  • మణికంఠుడు అని: తనకు వాహనంగా వున్న వ్యాఘ్రం (పులి) ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం!
  • నల్లని వస్త్రాలు :బాల్యంలోనే మహాజ్ఞానసంపన్నుడై సకలదేవతల అంశలనీ తనలో ఇముడ్చుకున్నాడు. నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి!! తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' భక్తులకు నమ్మకం.

మూలాలు

మార్చు
  1. Harivarasanam Archived 2010-03-09 at the Wayback Machine History and meaning of harivarasanam.

వెలుపలి లంకెలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=అయ్యప్ప&oldid=4086779" నుండి వెలికితీశారు