మంచి మనసుకు మంచి రోజులు
మంచి మనసుకు మంచి రోజులు 1958లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.ఎస్.రావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, రాజసులోచన, జె.వి.రమణమూర్తి, రేలంగి, గిరిజ నటించిన ఈ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం అందించాడు.
మంచి మనసుకు మంచి రోజులు (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, రాజసులోచన, జె.వి.రమణమూర్తి, రేలంగి, గిరిజ |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చురాజు సంస్కారం గల పేద రైతు. అతని చెల్లెలు జానకి అంటే అతనికి ప్రాణం. ఆ ఊరిలో వెంకటప్పయ్యనే ధనవంతుడు, అతని కుమారుడు డాక్టర్ రఘు చాలా బుద్దిమంతుడు. వెంకటప్పయ్య నమ్మినబంటు కేతన్న. చిన్నప్పటినుంచి రఘు మేనత్తకూతురు వకీలు రాణిని ఇచ్చి వివాహము చేయాలనుకుంటారు. కానీ రఘ నిరాకరిస్తాడు. రాణి తండ్రితో ఎలోగైనా రఘుని వివాహము చేసుకుంటానని శపథం చేస్తుంది. రాజుకు, వెంకటప్పయ్యకు ఎద్దులపందెముతో మొదలైన తగవులు పెద్దవవుతాయి. జానకి పెళ్ళి జరిగే సమయంలో అదనుకోసం ఎదురుచుస్తున్న వెంకటప్పయ్య అతని అనుచరుడు కేతన్న సహాయంతో తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేదని గొడవ పెట్టుకుని రాజును జైలుకు పంపిస్తాడు. తండ్రి అఘాయత్యాన్ని తెలుసుకున్న రఘు, జానకికి సహాయం చేసి వివాహము చేసుకుంటాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. జైలు నుంచి విడుదలైన రాజు వెంకటప్పయ్యను చంపడానికి వస్తాడు. అక్కడ తన చెల్లెలు జానకిని చూసి విషయము తెలుసుకుని తాను కూడా బాగా డబ్బు సంపాదించుకు వస్తానని బయలు దేరతాడు. చీకటిలో అన్నాచెల్లెళ్ళ అన్యోన్యతను చూసి వెంకటప్పయ్య దంపతులు జానకిని అనుమానించి, అవమానించి ఇంట్లోనుంచి వెళ్ళగొడతారు. కస్తూరిబాయి ప్రసూతి కేంద్రములో జానకి పండంటి బిడ్డను ప్రసవిస్తుంది. నిస్సహాయ స్థితిలో జానకి, డాక్టరు సలహాననుసరించి పిల్లలు లేని వెంకటప్పయ్యకు తన బిడ్డను అప్పగిస్తుంది. జానకి మీద బెంగతోనున్న రఘును ఎలాగైనా తన వశం చేసుకోవాలని రాణి ప్రయత్నించి అవమానం పాలై కక్ష సాధించాలనుకుంటుంది. నీళ్ళల్లో దూకిన జానకిని రాజు కాపాడి విషయము తెలుసుకుని ఆమె బిడ్డను తీసుకువచ్చి ఆమెకు అప్పగిస్తాడు. వరుడు కావాలి అని రాణి పేపరులో ఇచ్చిన ప్రకటన చూసి తన చెల్లెలు కాపురం కుదుటపడాలంటే రాణి పెళ్ళితో లంకె ఉందని తెలుసుకుని మారువేషములో రాణి దగ్గరకు వెళతాడు. తనను వివాహము చేసుకోవాలంటే రఘును హత్యచేయాలని షరతుపెడుతుంది. రఘును కలుసుకుని విషయము వివరించి అతనిని జానకి దగ్గరకు పంపిస్తాడు. రఘు ఆనవాళ్లు కొన్ని తీసుకువెళ్లి రఘును చంపేశానని రాణిని నమ్మించి ఆమెను రకరకాలుగా ఏడ్పించి వివాహము చేసుకోవడానికి ఒప్పిస్తాడు. వెంకటప్పయ్య తన కొడుకును రాజే చంపేశాడని పోలీసులను తీసుకువస్తాడు. రఘు తన భార్యా బిడ్డను తీసుకుని వచ్చి జరిగింది పోలీసులకు వివరిస్తాడు. వెంకటప్పయ్య దంపతులు తమ తప్పులను క్షమించమని రాజును, జానకిని ప్రాధేయపడతారు. రాణి తన తప్పు తెలుసుకుని రఘుని క్షమించమని అడుగుతుంది. రాజు, రాణి వివాహముతో అందరూ కలిసిపోయి సుఖంగా ఉంటారు.
నటీనటులు
మార్చు- నందమూరి తారక రామారావు (రాజు)
- రాజసులోచన (జానకి)
- రేలంగి వెంకట్రామయ్య (వెంకటప్పయ్య)
- జె. వి. రమణమూర్తి (డా. రఘు)
- గిరిజ (రాణి)
- అల్లు రామలింగయ్య (కేతన)
- సూర్యాకాంతం (కాంతం)
- ఎం. జయశ్రీ
- వసుంధర దేవి
- రాజనాల కాళేశ్వరరావు
- కె.వి.ఎస్. శర్మ
- పేకేటి శివరాం
- ఎ.వి. సుబ్బారావు
- నల్ల రామమూర్తి
- ప్రభల కృష్ణమూర్తి
- జె.వి. రామచంద్రరావు
పాటలు
మార్చు- అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ - ఘంటసాల - రచన: కొసరాజు
- కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా - ఘంటసాల, సుశీల - రచన: కొసరాజు
- ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా - రావు బాలసరస్వతి దేవి
- పొంగారు నడియేటి అలపైన దోనె ఊరించు - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
- భారతనారీ సీతామాత పావన (బుర్రకథ) - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
- రావే నా చెలియా చెలియా నా జీవన నవ మాధురి నీవే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
- వినవమ్మా వినవమ్మా ఒక మాట వినవమ్మా - ఘంటసాల, సుశీల - రచన: సముద్రాల జూనియర్
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)