అల్లు రామలింగయ్య

సినీ నటుడు

అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1, 1922 - జూలై 31, 2004) సినీ నటుడు, నిర్మాత. అతను హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. అతను కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. అతను కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయకుడైన చిరంజీవి అతని అల్లుడు.

అల్లు రామలింగయ్య
అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం విడుదలయిన తపాలాబిళ్ల
జననం
అల్లు రామలింగయ్య

అక్టోబర్ 1, 1922
మరణంజూలై 31, 2004
వృత్తినటుడు, నిర్మాత
జీవిత భాగస్వామికనకరత్నం
పిల్లలుఅల్లు అరవింద్
కొణిదల సురేఖ
తల్లిదండ్రులు
  • వెంకన్న (తండ్రి)
  • సత్తెమ్మ (తల్లి)

బాల్యము

మార్చు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించాడు.[1] అతను తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులు ఉండేవి. అతను దాన గుణం వల్ల అవి కరిగిపోయాయి. అతను కుమారుడు అల్లు వెంకయ్య మరల వ్యవసాయం చేసి మళ్ళీ నిలదొక్కుకున్నాడు. వెంకయ్య సతీమణి సత్తెమ్మ. వీరికి నరసయ్య మూర్తి, నారాయణ మూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం ఏడు మంది సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్యని పేరు పెట్టుకున్నారు.

రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం.

అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.[2]

చలనచిత్ర జీవితం

మార్చు
మాయాబజార్ సినిమాలో అల్లు రామలింగయ్య నటించిన హాస్య సన్నివేశాల్లో ఒకటి

అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి వద్దంటే డబ్బులో అవకాశం వచ్చింది.

పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్యసేవ లందించేవాడు.

ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలద్రొక్కుకున్నాడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తి కట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతను కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్‌లో పాల్గొన్నాడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక అతనుకు తీరలేదు. ఆతను అభినయించిన చాలా పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.

అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్‌ నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు భలే జబ్బు చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ఆమ్యామ్య.. అప్పుం అప్పుం లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.

పురస్కారాలు, సన్మానాలు

మార్చు

యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990లో ' పద్మశ్రీ' అవార్డుతో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.

2001వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత 'రఘుపతి వెంకయ్య' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో అతను విగ్రహం నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '

అల్లు రామలింగయ్య 2004 జూలై 31వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా అతను హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలా బిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.

నటించిన సినిమాలు

మార్చు
సంఖ్య సినిమా పేరు సంవత్సరం
01 ఇంద్ర 2002
02 దేవుళ్ళు 2001
03 మావిచిగురు 1996
04 అల్లుడా మజాకా 1995
05 ముఠామేస్త్రి 1993
06 ఆ ఒక్కటి అడక్కు 1993
07 మెకానిక్ అల్లుడు 1993
08 పరుగో పరుగు 1993
09 ఆపద్భాందవుడు 1992
10 అశ్వమేధం 1992
11 పెద్దరికం 1992
12 రౌడీ అల్లుడు 1991
13 నా పెళ్ళాం నా ఇష్టం 1991
14 గ్యాంగ్ లీడర్ 1991
15 రాజా విక్రమార్క 1990
16 కొదమ సింహం 1990
17 జగదేక వీరుడు అతిలోక సుందరి 1990
18 కొండవీటి దొంగ 1990
19 స్టేట్‌రౌడి 1989
20 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు 1989
21 చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం 1989
22 ఖైదీ నెం. 786 1988
23 యముడికి మొగుడు 1988
24 మంచి దొంగ 1988
25 ఆఖరిపోరాటం 1988
26 దొంగ రాముడు 1988
27 దొంగ మొగుడు 1987
28 చంటబ్బాయ్ 1986
29 మగధీరుడు 1986
30 కిరాతకుడు 1986
31 రావణబ్రహ్మ 1986
32 విజేత 1985
33 అడవిదొంగ 1985
34 ఒక రాధ ఇద్దరు కృష్ణులు 1985
35 జ్వాల 1985
36 దొంగ 1985
37 చట్టంతో పోరాటం 1985
38 ముచ్చటగా ముగ్గురు 1985
39 కంచు కాగడా 1984
40 గూండా 1984
41 ముందడుగు 1983
42 బిల్లా రంగా 1982
43 న్యాయం కావాలి 1981
44 అందగాడు 1981
45 నిరీక్షణ 1981
46 సప్తపది 1981
47 మోసగాడు 1980
48 అండమాన్ అమ్మాయి 1979
49 మా ఊళ్ళో మహాశివుడు 1979
50 చిరంజీవి రాంబాబు 1978
51 అర్ధాంగి 1977
52 ఈనాటి బంధం ఏనాటిదో 1977
53 కల్పన 1977
54 పూర్ణమ్మ కథ 1976
55 సెక్రటరి 1976
56 అందరూ బాగుండాలి 1975
57 జేబు దొంగ 1975
58 యమగోల 1975
59 ఊర్వశి 1974
60 దేవదాసు 1974
61 అల్లూరి సీతారామరాజు 1974
62 విచిత్ర బంధం 1972
63 తాతా మనవడు 1972
64 సంబరాల రాంబాబు 1970
65 మారిన మనిషి 1970
66 పెళ్లి కూతురు 1970
67 నిండు హృదయాలు 1969
68 రణభేరి 1968
69 వింత కాపురం 1968
70 ఆత్మ గౌరవం 1965
71 నర్తనశాల 1963
72 ఇద్దరు మిత్రులు 1961
73 సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి 1960
74 ధర్మమే జయం 1960
75 మా బాబు 1960
76 ఆడ పెత్తనం 1958
77 ఇంటిగుట్టు 1958
78 పరాశక్తి 1957
79 భాగ్యరేఖ 1957
80 వరుడు కావాలి 1957
81 దొంగరాముడు 1955
82 మిస్సమ్మ 1955
83 పల్లెపడుచు 1954

మూలాలు

మార్చు
  1. సి, శ్రీకాంత్ కుమార్ (2010). అల్లు రామలింగయ్య జీవిత చిత్రం. విజయవాడ: ఋషి బుక్ హౌస్. p. 12.
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 98.
  3. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.

బయటి లింకులు

మార్చు