అంజూరం

(మంచి మేడి నుండి దారిమార్పు చెందింది)

అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా[1]. అంజూర చెట్టు అందమైన, ఆసక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటే విశాలంగా పెరుగుతుంది[2]. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు బొప్పాయి చెట్టు ఆకుల ఆకారంలో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలాన్ని అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది[3]. ఈ పండ్లు పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి. తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే ఇరాన్, మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరాన్ని పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ (Persian) రాజ్యం నుండి వచ్చిన అంజూరాన్ని 5 వేల సంవత్సరాలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడింది.[4]

అంజూర చెట్టు

ఆరోగ్యానికి అంజీర ఫలం మార్చు

కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. కడుపులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడుపులో మంట, అజీర్తి సమస్యతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది. రక్తస్రవరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ పుష్టికి ఉపకరిస్తుంది. అతి ఆకలితో బాధపడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణము ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు.

నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడుపులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉంటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. సూపర్‌ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అంజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడుపులో మంట గలవారు పుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయపడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది.

 
అత్తి చెట్టు, పండు

రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే పదార్థము కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఒంటిమీద గడ్డలు, కురుపులకు ఈ పండు గుజ్జును పూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది. అన్ని మేడిపండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర తరహా మాత్రం కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోవాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాము అనిపిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి.

వంద గ్రాముల పండ్లలో పోషకాలు మార్చు

  • పిండి వదార్థం - 19 గ్రా,
  • వీచు వదార్థాలు - 3 గ్రాములు,
  • చక్కెర - 16 గ్రాములు,
  • కొవ్వు - 0.3 గ్రాములు,
  • ప్రొటీన్లు - 0.8 గ్రా,
  • విటమిన్‌ 'బి6' - 110 గ్రా,
  • శక్తి - 70 కిలో.కె.

వందగ్రాముల ఎండిన పండ్లలో పోషకాలు మార్చు

  • పిండివదార్థాలు - 84 గ్రాములు,
  • చక్కెర - 48గ్రాములు,
  • వీచువదార్థం - 10 గ్రాములు,
  • కొవ్వు -0.3 గ్రాము,
  • ప్రొటీన్లు - 3 గ్రాములు.

అత్తి పండు తియ్యని రుచి గల పండు. దీనిని విరిచి తినవచ్చు. అత్తి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి కనుక జాగ్రత్తగా విదిలించి తింటారు. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది. అరోగ్యానికి మేలు కలిగిస్తుంది. అత్తి పండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు. ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి. అత్తిపండుకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాధాన్యత ఉంది. మెత్తగా, తియ్యగా, మధురంగా ఉండే ఈ పండులో అన్నీ మంచి గుణాలే. అన్నీ ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలే. అయితే మెత్తగా ఉండటంవల్ల దీనికి పండిన తరువాత త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది. దీనితో సాధారణంగా దీనిని ఎండబెట్టి డ్రైఫ్రూట్ రూపంలో వాడుతుంటారు. దీనిలో మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్థాల వంటివి అల్పమోతాదులో ఉంటాయి. పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో 50నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. దీనిని నేరుగా గాని, లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి గాని తీసుకోవచ్చు. పిండి పదార్థాలను తీసుకోవటంవల్ల మలబద్ధకం ఏర్పడుతుంటే, ఆ పదార్థాలతోపాటు అత్తిపండ్లను కలిపి తీసుకుంటే సరిపోతుంది. అత్తిపండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అత్తిపండ్లను కేకుల తయారీలోను, జాముల తయారీలోనూ వాడతారు. దీనిని దీర్ఘవ్యాధులనుంచి త్వరగా కోలుకోవడానికి వాడవచ్చు.

ఎలా వాడాలి? మార్చు

అత్తి పండ్లను వాడబోయేముందు బాగా కడగాలి. ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది. నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే, దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి. కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతోసహా తీసుకోవాలి.

  • మాత్ర (డోస్) : స్వరసం (జ్యాస్) 10-20మి.లీ. గుజ్జు: 5-10 గ్రా.
  • వివిధ భాగాలు, శాస్ర్తియ అధ్యయనం
  • పండు: మృధువిరేచకం (ల్యాగ్జేటివ్), ఎక్స్‌పెక్టోరెంట్ (కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది)
  • పండు గుజ్జు: అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది) యాంటిఇన్‌ఫ్లమేటరి (ట్యూమర్స్, గమ్ యాబ్సిస్) (వాపును తగ్గిస్తుంది)
  • నిర్యాసం (లేటెక్స్) : అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది), టాక్సిక్ (పులిపిరులు, కీటకాల కాటుకు వాడవచ్చు).
  • ఆకు: బొల్లిమచ్చలకు వాడవచ్చు.
  • చెట్టుపట్ట: ఎగ్జిమా, ఇతర చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది.
  • నిర్యాసం (గమ్) : యాంజియో టెన్సిన్ 1 కన్వర్టింగ్ ఎంజైమ్‌మీద వ్యతిరేకంగా పోరాడే మూడురకాల పెప్టైడ్‌లను అత్తిపండ్ల నిర్యాసంలో కనుగొన్నారు. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.

వివిధ వ్యాధుల్లో ప్రత్యేక ప్రయోగ విధానం మార్చు

  • వ్రణశోథ: పండును చీల్చి, గుజ్జును వేడిచేసి నోటి చిగుళ్లమీద తయారయ్యే వ్రణం మీద లేపనం మాదిరిగా ప్రయోగించాలి.
  • మలబద్ధకం: అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. వీటివల్ల, వీటిని మలబద్ధకంలో వాడవచ్చు. అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
  • అర్శమొలలు: అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది. మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు. మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది.
  • ఉబ్బసం: కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.
  • శృంగారానురక్తి తగ్గటం: అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.
  • ఆనెలు: పచ్చి అత్తిపండ్ల మీద గాటు పెడితే పాల వంటి నిర్యాసం కారుతుంది. దీనిని ఆనెల మీద ప్రయోగిస్తే నెమ్మదిగా ఆనెలు మెత్తబడి పై పొరలు ఊడిపోతాయి. పచ్చి అత్తికాయల నిర్యాసానికి నొప్పిని తగ్గించే తత్వం ఉంది.
  • నోటిలో పుండ్లు: అత్తిపండ్లనుంచీ కారే పాల మాదిరి నిర్యాసాన్ని స్థానికంగా ప్రయోగించాలి.
  • శరీరంలో వేడి: బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపాలి. వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి.
  • బలహీనత: చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Fig | Description, History, Cultivation, & Types | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2023-06-29. Retrieved 2023-07-31.
  2. "Ficus carica - Anjeer". www.flowersofindia.net. Retrieved 2023-07-31.
  3. Thumb, The Green (2022-06-29). "Anjeer Tree (Fig Tree): How to grow & care for Fig Plant?". Plant Care Tips (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  4. "Ficus carica".{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అంజూరం&oldid=4077118" నుండి వెలికితీశారు