మధుబని చిత్రకళ లేదా మిథిల చిత్రకళ (Madhubani art) మిథిల, మధుబని ప్రాంతాలలో ప్రాచుర్యంలో వున్న ఒక హిందూ చిత్రకళా శైలి. ఇందులో చిత్రపటాలను చేతివ్రేళ్లు, కుంచెలు, కలాలు, అగ్గిపుల్లలు మొదలైన వాటిని ఉపయోగించి ప్రకృతి సిద్ధంగా లభించే వర్ణకాలను ఉపయోగించి కళ్లకు కట్టుకొనే జియోమెట్రికల్ గా కనిపించేవాటిని తయారుచేస్తారు. ఇవి అన్ని పండగలకు, జీవిత సన్నివేశాలకు సంబంధించినవిగా ఉంటాయి.

మధుబని చిత్రకళ

చరిత్ర

మార్చు

ఈ చిత్రకళ సరిగ్గా ఎప్పుడు ప్రారంభమయినదో తెలియదు. స్థానిక కథనం ప్రకారం రామాయణ కాలంలో జనక మహారాజు సీతారాముల కల్యాణం సమయంలో రాజ్యమంతా అందంగా అలంకరించమని ఆజ్ఞాపించాడు. అందుకోసం స్థానిక చిత్రకారుల్ని రప్పించి రాజభవననాన్ని రకరకాలైన అందమైన చిత్రపటాల్ని రూపొందించమని చెప్పాడు. ప్రాచీన సాంప్రదాయం ప్రకారం నేపాల్, బీహార్ ప్రాంతంలో ప్రాచుర్యంలోనున్న భిట్టి-చిత్ర (Bhitti-Chitra) అనే గోడకళాకృతులు మధుబని చిత్రకళకు ఆరంభం కావచ్చు.

మధుబని అనగా తేనె అడవి (మధు - తేనె; బని - అడవి) అని అర్ధం. ఇది మిథిల, ఉత్తర బీహార్ లోని ఒక ప్రాంతం. ఈ ప్రదేశం 2500 సంవత్సరాల ముందే ఒక ప్రాంతీయ గుర్తింపు, భాషలకు కలిగియున్నది.

ఈ చిత్రపటాలు గోడలమీద బురద ఆవుపేడ మిశ్రమంతో చిత్రించేవారు. ఆ సాంప్రదాయంలో వివాహం అనంతరం శోభనగదిని ఇలాంటి చిత్రపటాలతో తీర్చిదిద్దేవారు. సింబాలిక్ గా పద్మం, వెదురుపొద, చేపలు, పక్షులు, పాముల సంయోగ చిత్రాలను ఎక్కువగా చిత్రించేవారు. ఈ విధంగా ప్రకృతిలోని చిత్రాలకు రూపొందించిన జీవుల లైంగికవృద్ధి కలుగుతుందని వారి నమ్మకం. అలాంటి గదిలో నూతన దంపతులు మూడు రాత్రులు గడిపేవారు. ఈ విధంగా మిథిల చిత్రపటాలను ఆయా కుటుంబాలకు, కులం లేదా గ్రామానికి చెందిన స్త్రీలు మాత్రమే వివాహం సమయంలోనే చిత్రించేవారు.

ఈ మధుబని చిత్రకళ గురించి బయటి ప్రపంచానికి తెలియనే తెలియదు. భారత నేపాల్ సరిహద్దులలో 1934 సంవత్సరం సంభవించిన భూకంపంలో అనేకమైన ఇండ్లు కూలిపోయాయి. మధుబని జిల్లాలోని బ్రిటిష్ అధికారి విలియం జి. ఆర్చర్ (William G. Archer) కూలిపోయిన ఇంటిగోడల్ని పరీక్షిస్తున్నప్పుడు ఈ గోడలమీద రంగురంగుల చిత్రపటాలను గుర్తించాడు. వీటికి పాశ్చాత్య చిత్రకారులైన మీరో, పికాసో చిత్రకారులను పోలినట్లు తెలుసుకొన్నాడు. ఆ చిత్రపటాల తెలుపు - నలుపు ఫోటోలను తీసుకొన్నాడు. వాటిగురించి మార్గ్ (Marg) అనే ఇండో-నేపాల్ కళా జర్నల్ 1949 సంచికలో ప్రచురించాడు. 1966 -1968 కరువు కాలంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నది. అటువంటి క్లిష్టమైన సమయంలో ప్రజల ఆర్థిక స్వాలంబన కోసం పుపుల్ జయకర్ (Pupul Jayakar) బొంబాయి నుండి భాస్కర్ కులకర్ణి అనే కళాకారున్ని మిధిలకు పంపించి అక్కడి స్త్రీలకు చిత్రకళలో శిక్షణ ఇప్పించి, ఆయా చిత్రపటాలను అమ్మించి ఆ ప్రాంత ప్రజలకు కొంత రాబడి, తద్వారా ఆర్థిక సహాయాన్ని అందేటట్లు పాటుబడ్డారు.

ఈ చిత్రకళను అంతర్జాతీయంగా గుర్తింపు కలిగించడానికి యూస్ వెకాడ్ (Yves Vequad) అనే ఫ్రెంచి నవలా రచయిత, పత్రికా విలేఖరి 1970 ప్రాంతంలో కృషిచేశారు. ఇతడు మిథిల చిత్రకళ గురించి పరిశోధన చేసి ది విమెన్ పైంటర్స్ ఆఫ్ మిథిల (‘The Women Painters of Mithila’) అనే చిత్రాన్ని రూపొందించాడు. జర్మనీకి చెందిన సాంఘికవాది ఎరికా మోసర్ (Erika Moser) పేదరికంలో మగ్గుతున్న దుసధ్ (Dusadh) జనసమూహాన్ని ఈ కళలో ప్రావీణుల్ని చేశాడు. తత్ఫలితంగా మౌఖికంగా చలామణీలోనున్న రాజా సలేష్ సాహసాలు (The adventures of Raja Salhesh) మొదలైన వాటిని రాహువు ప్రధానంగా కలిగిన చిత్రపటాలను తయారుచేసి తద్వారా వీటికి మరొక రకంగా గుర్తింపు వచ్చేటట్లు పాటుపడ్డాడు.

1977 లో మిధిల చిత్రకారుల సంఘాన్ని ప్రారంభించారు. ఫోర్డ్ ఫౌండేషన్ మధుబని చిత్రకళను వృద్ధిలోకి తేవడానికి చాలాకాలంగా కృషిచేస్తున్నారు. 1990లో జపాన్ దేశీయుడైన టోక్యో హసెగావా (Tokyo Hasegawa) సుమారు 850 మధుబని చిత్రపటాలకు ఉపయోగించి టొకామచి (Tokamachi) లో మిధిల మ్యూజియం ప్రారంభించాడు.

మధుబని చిత్రకళ శైలి

మార్చు

మధుబని చిత్రకళలో ఐదు విభిన్నమైన శైలి లేదా పద్ధతులు ఉన్నాయి. ఇవి: భరణి, కచ్ని, తాంత్రిక, నేపాలీ, కొబార్. మొదటి మూడు పద్ధతులు ముఖ్యంగా ఉన్నత తరగతికి చెందిన బ్రాహ్మణ, కాయస్థ మహిళలు తయారుచేస్తారు. వీరు ముఖ్యంగా హిందూ మత దేవతలను చిత్రిస్తారు. క్రింది తరగతులకు చెందిన స్త్రీలు ఎక్కువగా దైనందిక జీవనానికి చెందిన విషయాల గురించి చిత్రీకరిస్తారు. గోడ్నా, కొబార్ పద్ధతులు ఎక్కువగా దళిత, దుషధ్ జాతులవారు తయారుచేస్తారు. కొబార్ చిత్రపటాలను వధువు కుటుంబసభ్యులు ఎక్కువగా వేస్తారు. చేప లేదా మత్స్యము మధుబని చిత్రకళలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు