2003 మే 2 న కేరళ కోజికోడ్ జిల్లా మరాద్ బీచిలో ముస్లిము మూక ఎనిమిది మంది హిందువులను చంపిన సంఘటనను మరాద్ ఊచకోతగా పేర్కొంటారు.[1] దాడి చేసిన వాళ్ళలో మొహమ్మద్ అష్కర్ అనే వ్యక్తి కూడా ప్రమాదవశాత్తూ మరణించాడు. ఈ మారణకాండకై కుట్రచేసి అమలు జరపడంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పాత్ర ఉందని ఈ సంఘటనను దర్యాప్తు చేసిన జ్యుడిషియల్ కమిషను నిర్ధారించింది.[2] ఇది "ముస్లిము ఛాందసవాదులు, ఉగ్రవాదులూ కలిసి చేసిన స్పష్టమైన మతవాద కుట్ర" అని కమిషను నిర్ధారించింది. విదేశీ సంస్థలపాత్ర కూడా ఉందనే విషయమై కమిషనుకు స్పష్టమైన ఆధారాలు కనబడలేదు. 2009 లో కోర్టు ఇచ్చిన తీర్పులో 62 మంది ముస్లిములకు జీవితఖైదు శిక్ష విధించింది. వీరిలో ఎక్కువమంది ఇండియన్ యూనియన్ ముస్లిము లీగుకు, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీకి, నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంటుకూ చెందినవారే.[3]

మరింత మందిని చంపాలనే ఉద్దేశంతో హంతకులు బాంబులు కూడా విసిరారు గానీ అవి పేలలేదు.[4] సమీపంలోని మసీదులో పెద్ద ఎత్తున దాచిన కత్తులు చాకులూ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దఎత్తున నరమేధం చేసే ఉద్దేశంతో ఈ  ఆయుధాలను సిద్ధంగా ఉంచారు. కానీ పోలీసుల జోక్యంతో అది కుదరలేదు.[5]

జనవరి అల్లర్లు మార్చు

2002 జనవరి 3, 4 తేదీల్లో మరాద్‌లో ఓ తాగునీటి పంపు వద్ద జరిగిన స్వల్ప ఘర్షణ పెద్ద ఎత్తున అల్లర్లకు దారితీసింది. ఈ అల్లర్లలో ముగ్గురు హిందువులు, ఇద్దరు ముస్లిములు మరణించారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.[6] తదనంతరం జరిగిన పోలీసు దాడుల్లో 393 మందిని అరెస్టు చేసారు. వీరిలో 213 మంది ఆరెస్సెస్‌, భాజపా కార్యకర్తలు కాగా, 86 మంది ముస్లిము లీగ్‌కు, 78 మంది సీపీయెం సీపీఐలకు, ఇదరు నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంటుకూ చెందినవారు. సంఘటనలు జరిగిన స్థలాల్లో భద్రతా దళాలు గస్తీ కాచాయి.

హత్యాకాండ మార్చు

2003 మే 2 న సాయంత్రం వేళ, బీచిలో ముస్లిము మూక ఎనిమిది మంది హిందువులను ఊచకోత కోసింది. ఆ తరువాత హంతకులు అక్కడి నుండి తప్పించుకుని, స్థానిక జుమా మసీదులో తలదాచుకున్నారు. మరాద్ దర్యాప్తు కమిషను (జస్టిస్ థామస్ పి జోసెఫ్) కు పోలీసు కమిషనరు టి కె వినోద్ కుమార్ సమర్పించిన నివేదిక ప్రకారం, హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులను మసీదు లోనికి పోనీయకుండా వందలాది మంది ముస్లిము మహిళలు మసీదు వద్ద గుమిగూడి అడ్డుకున్నారు.[7]

ఈ మారణకాండను చేసినది ఎన్‌డిఎఫ్‌యే నని చెప్పే సూచికలను నేర విభాగపు ఐజీ, మహేష కుమార్ సింగ్లా తన తొలి దర్యాప్తు నివేదికలో పొందుపరచాడు.[8] అయితే తన వాదనకు అనుకూలంగా తగు ఆధారాలను ఆయన కమిషనుకు చూపించలేకపోయాడు. తరువాతి కాలంలో పోలీసులు పెద్ద ఎత్తున మారణాయుధాలను, 17 బాంబులతో సహా, పట్టుకున్నారు. పోలీసు కమిషనరు వినోద్ కుమార్ ఇలా చెప్పాడు: "ఇది కట్టుదిట్టమైన వ్యవస్థ కలిగిన సంస్థ చేసిన ఆపరేషను. ఈ ఆపరేషను చాలా హఠాత్తుగా మొదలై, వేగంగా జరిగి, 10 నిముషాల్లోనే ముగిసిపోయింది. దాడి చేసిన వారంతా ఒకే మతానికి చెందినవారు".[9]

దాడి చేసినవాళ్ళలో ఒకడైన మొహమ్మద్ అష్కర్ కూడా ఈ సంఘటనలో మరణించాడు. కేరళ నేర దర్యాప్తు విభాగం 147 మందిపై నేరారోపణ పత్రాలను ఫైలు చేసింది.[10]

కమిషను నివేదికలోని ప్రధాన అంశాలు మార్చు

ఇంటిలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ లతో ఈ కేసును, ఇందులో మతవాద శక్తుల కుట్రలను, వారికి నిధులు బాంబులూ ఎలా అందాయనే విషయాలను తిరిగి దర్యాప్తు చేయించాలని కమిషను తన నివేదికలో పేర్కొంది. ఈ విషయాలను దర్యాప్తు చెయ్యడానికి కేరళ రాష్ట్ర నేర విభాగం సుముఖత చూపలేదు. ఈ వైముఖ్యం "సందేహాస్పదంగాను, ఆందోళనకరంగానూ ఉంద"ని కమిషను అభివర్ణించింది.[11]

శిక్ష మార్చు

2009 జనవరి 15 న కోజికోడ్ ప్రత్యేక కోర్టు 63 మంది నిందితుల్లోను 62 మందికి యావజ్జీవ ఖైదు శిక్ష విధించింది. మొత్తం 139 మంది ముద్దాయిల్లోను, 62 మంది హత్యకుగాను, ఒకరు అందుకు దోహదపడినందుకుగాను, నేరం ఋజువు కాగా, మిగతావారు ఆరోపణల నుండి విముక్తులయ్యారు.

కొత్త్త ఎఫ్‌ఐఆర్ మార్చు

2016 లో ముస్లిము లీగు నాయకుల పేర్లను కూడా చేర్చి ఒక కొత్త ఎఫ్‌ఐఆర్ ను సీబీఐ దాఖలు చేసింది. [12]

మూలాలు మార్చు

 1. "Marad shocks". The Hindu Frontline. 7 October 2006.
 2. Marad report slams Muslim League The Indian Express, 27 September 2006
 3. 62 get life term for Marad killings The Indian Express, 16 January 2009
 4. The Marad massacre Outlook (magazine), 06 June 2003
 5. The Marad massacre Archived 2012-08-19 at the Wayback Machine The Hindu, Saturday, 31 May 2003
 6. "Marad can yet be retrieved". Indiatogether.org. Archived from the original on 2006-05-08. Retrieved 2017-07-25.
 7. "Kerala sits on riot report indicting Cong govt, Muslim League". The Indian Express.
 8. NDF behind Marad massacre?[1] Archived 2005-12-21 at the Wayback Machine
 9. Weapons seized Archived 14 మార్చి 2007 at the Wayback Machine
 10. "Marad: How politicians fanned a communal riot". Rediff.com.
 11. "Marad Shocks: Frontline Weekly". Archived from the original on 12 జనవరి 2009. Retrieved 25 జూలై 2017.
 12. http://www.thehindu.com/news/national/kerala/CBI-registers-fresh-FIR-in-second-Marad-riot-case/article17061807.ece