మల విసర్జన సహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్ధకం (ఆంగ్లం: Constipation) గా భావించాలి. సాధారణంగా మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండా ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది.

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం[1]. దీనికి ప్రధాన కారణం- మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే’ మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో మలబద్ధకం అత్యంత సాధారణ జీర్ణ సమస్య.[2] ఇది జనాభాలో 2 % నుండి 20 % మందికి సంభవిస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు, పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామము చేయకపోవడము వలన, వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.[3]

కారణాలు

మార్చు
  • మందుల దుష్ఫలితాలు: కొన్ని దగ్గు మందులు, రక్తపోటు మందులు, కాల్షియం సమ్మేళనాలు, ఆందోళన తగ్గించడానికి వాడే మందులు మొదలైనవి మలబద్ధకాన్ని కలిగించవచ్చును.
  • మాలాశయంలో పుండ్లు: క్షయ, అమీబియాసిస్ వంటి వ్యాధులలో పేగులలో పుండ్లు / ట్యూమర్లు తయారై మలబద్ధకం రావచ్చు.
  • పెద్ద పేగులో ట్యూమర్లు: పెద్దపేగులో కాన్సర్ సంబంధించిన ట్యూమర్లు మల విసర్జనకు అడ్డుపడి మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య చాలా కాలంగా ఉంటున్నా, మలంతోపాటు రక్తపు జీర కనిపించినా దీని గురించి ఆలోచించాలి.
  • థైరాయిడ్ గ్రంధి చురుకుదనం తగ్గడం (హైపో థైరాయిడిజం) : దీనిలో మలబద్ధకంతో పాటు, శరీరపు క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. దీనిమూలంగా బరువు పెరగడం, చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, నాడి వేగం తగ్గం, చర్మం దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • నరాల దౌర్బల్యం: వెన్నుపూసలలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలు. వీనిలో మలబద్ధకంతో, మూత్ర నియంత్రణ కూడా కోల్పోతారు. చంటిపిల్లలలో నరాలకు సంబంధించిన న్యూరాన్లు లోపించడం వల్ల పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే మలబద్ధకం ప్రారంభమౌతుంది.
  • ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవుట
  • కొన్ని రకాల మందులవలన ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ అతిగా వాడటం.
  • తరచుగా తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్ళకు గురికావడం
  • వేళకు మలవిసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం
  • రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవటం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.

లక్షణాలు

మార్చు
  • తేన్పులు ఎక్కువగా ఉండటం. మల విసర్జనకు వెళ్ళాలంటేనే భయంగా ఉండటం.
  • గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం.
  • కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం
  • మలవిసర్జన సరిగా పూర్తిగా కాదు.
  • తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం
  • జీవన విధానం సక్రమంగా జరుగక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

సలహాలు

మార్చు
  • ద్రవ పదార్ధాలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలం మృదువుగా, స్నిగ్థంగా, ఎక్కువగా తయారవుతుంది.
  • పీచు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, అరటిపండు, జామకాయ మంచివి.
  • పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది
  • ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి.
  • నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.
  • నీరు సరిపడినంతగా తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి.
  • ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్దకం కలుగదు.
  • మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.
  • మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. ఇందువలన అర్శమొలలు తయారయి, తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి.

మందులు

మార్చు

మూలాలు

మార్చు
  1. ""మలబద్ధకం నివారణం ఏలా?"". Archived from the original on 2017-06-27. Retrieved 2017-03-06.
  2. "constipation" Archived 2006-03-30 at the Wayback Machine.
  3. "Treatment of constipation in older adults"."PMID 16342852".
"https://te.wikipedia.org/w/index.php?title=మలబద్దకం&oldid=4315314" నుండి వెలికితీశారు