మలికా జాన్
మలికా జాన్ హిందుస్తానీ గాయని, నాట్యకారిణి (లేదా తవాయిఫ్). ఆమె భారతదేశంలో జన్మించిన ఆర్మేనియన్ జాతి స్త్రీ. ఆమె జన్మనామం విక్టోరియా హెమ్మింగ్వే, విలియం రాబర్ట్ యోవర్డ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఏంజలీనా అనే కుమార్తెకు జన్మనిచ్చారు. తర్వాత వివాహబంధం విచ్ఛిన్నం కాగా ఆమె సంగీతాన్ని అభిమానించే ప్రభువంశీకుడు ఖుర్షీద్ తో వారణాసి వచ్చి తవాయిఫ్ గా స్థిరపడ్డారు. ఆపైన మరో రెండు సంవత్సరాలకు నవాబ్ వాజిద్ అలీ షా కొలువులో స్థానం పొంది, కలకత్తా చేరుకున్నారు. ఆమె జన్మనామాన్ని, ఆమె కుమార్తె జన్మనామాన్ని బెనారస్ వెళ్ళాకా ఇస్లాం మతం స్వీకరించి మార్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె పేరు మలికా జాన్, కుమార్తె పేరు గోహర్ జాన్ గా మారింది.
మలికా జాన్ ఠుమ్రీ గాయనంలో అసమానురాలు. ఆమె సంగీతంతో పాటు కథక్ నృత్యం కూడా చేస్తూ తవాయిఫ్ గా రాణించారు. తాను సంగీతరంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడమే కాక తన కుమార్తె గోహర్ జాన్ అంతకన్నా సుప్రసిద్ధురాలై ఆమె పేరు నిలిపారు.
వ్యక్తిగత జీవితం
మార్చుపుట్టుకతో మలికా జాన్ పేరు విక్టోరియా హెమ్మింగ్స్. ఆమె భారతదేశంలో జన్మించినా, ఆమెది ఆర్మేనియన్ జాతి.[1] ఆమె మొదట్లో ఆజంగఢ్ లో నివసించేవారు, డ్రై ఐస్ ఫ్యాక్టరీలో ఇంజనీరు అయిన విలియం రాబర్ట్ యోవర్డ్ అన్న వ్యక్తిని 1872లో వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఏంజలీనా యోవర్డ్ అన్న కుమార్తె 1873లో జన్మించింది. తర్వాతికాలంలో ఆ కుమార్తె హైదర్ జాన్ గా హిందుస్తానీ సంగీత రంగంలో సుప్రసిద్ధి పొందారు. 1879లో వీరి వివాహ బంధం విచ్ఛిన్నమైంది, ఆ సమయంలో కూతురుతో విక్టోరియా చాలా కష్టాలు అనుభవించారు. 1881లో తన సంగీతాన్ని అభిమానించిన ముస్లిం ప్రభువంశీకుడు ఖుర్షీద్ తో వారణాసి వలసవెళ్ళి అక్కడ తవాయిఫ్ గా ఆమె ప్రఖ్యాతిపొందారు. సంగీతరంగంలో కూతురుతో సహా ఆమె గొప్ప పేరు సంపాదించుకున్నారు. తర్వాతికాలంలో ఆమె ఇస్లాం మతంలోకి మారి మలికా జాన్ గా పేరు మార్చుకున్నారు.[2] మలికా జాన్ 1983లో కలకత్తా చేరుకున్నారు ఆపైన మరణించేంతవరకూ అక్కడే జీవించారు. 1904-05 ప్రాంతాల్లో మలికా జాన్ మరణించారు.
కెరీర్
మార్చుమొదటి నుంచీ సంగీతం నేర్చుకుని సంగీతాభ్యాసం కొనసాగించిన మలికా జాన్ కి బెనారస్ నగరానికి వలసవచ్చాకా సంగీత రంగంలో విశేషఖ్యాతి రావడం ఆరంభమైంది. మలికా జాన్ ఠుమ్రీ దాద్రాలు పాడడంలో ప్రఖ్యాత గాయని హైదరీ జాన్ తర్వాత అంతటి గాయని అనిపించుకున్నారు. హైదరీ జాన్ మరణించాకా గానరంగంలో ఠుమ్రీ గాయనంలో బడీ మలికా జాన్ సాటిలేనివారే అయ్యారు.[1] కథక్ నాట్యంలోనూ ఆమె సిద్ధిపొందిన స్థాయికి చేరారు.
1883లో బడీ మలికా జాన్ బెనారస్ నుంచి కలకత్తాకు మారారు. అక్కడ నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానంలో స్థానం పొందారు. సరిగ్గా మూడేళ్ళు తిరిగేలోపే అప్పట్లోనే రూ.40,000 (19వ శతాబ్దం నాటికి రూపాయి విలువ చాలా తక్కువ) ఖర్చుచేసి 24 చిత్పూర్ రోడ్డు (ప్రస్తుతం రబీంద్ర సరాణీ)లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు.[3]
గోహర్ జాన్
మార్చుప్రధాన వ్యాసం: గోహర్ జాన్
మలికా జాన్ కుమార్తె గోహర్ జాన్ సంగీత, నాట్య రంగాల్లో విఖ్యాతులయ్యారు. సంగీత రంగంలో గోహర్ జాన్ తల్లికి మించి పేరు సంపాదించుకున్నారు. ఆమె తల్లికి వలె ఠుమ్రీ గాయనంలో అసమానగా పేరు సంపాదించుకోవడం, కథక్ నృత్యంలో నిష్ణాతురాలు కావడమే కాక హమ్ దమ్ అన్న కలంపేరుతో గజళ్ళు రాసిన కవయిత్రిగా, రబీంద్ర సంగీత్ లో ప్రాముఖ్యం పొందిన సంగీత విద్వాంసురాలిగా కూడా నిలిచారు. భారతదేశంలోకెల్లా డిస్క్ గా తన సంగీతం విడుదలైన తొలి సంగీత విద్వాంసురాలిగా గోహర్ జాన్ నిలిచిపోయారు.[4]
సమకాలీకులు
మార్చుమలికా జాన్ సమకాలీకుల్లో అదే మొదటి పేరుతో పిలవబడినవారు మరో ముగ్గురు ఉన్నారు. ఆ కారణంగానే ఈమెను వారందరిలోకి పెద్దవారవడంతో బడీ మలికా జాన్ అని పిలిచేవారు. వారి వివరాలు:[5]
- ఆగ్రాకు చెందిన మలికా జాన్
- మల్క్ పఖ్రాజ్ కు చెందిన మలికా జాన్
- చుల్ బులీకి చెందిన మలికా జాన్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 సామల, సదాశివ (2001). "గరువంపు గువ్వ చెల్లించిన గవ్వ". మలయ మారుతాలు (1 ed.). హైదరాబాద్: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 17. ISBN 81-86073-81-7.
- ↑ The importance of being Gauhar Jan The Tribune, 26 May 2002.
- ↑ Gohar Jan Archived 2008-07-24 at the Wayback Machine Chowk, 16 April 2008.
- ↑ Saregama’s online store www.livemint.com Wall Street Journal, 10 December 2007.
- ↑ 'My name is Gauhar Jan' Archived 2008-05-17 at the Wayback Machine www.the-south-asian.com, October 2003.