మల్లంపల్లి శరభయ్య శర్మ
మల్లంపల్లి శరభయ్య శర్మ తెలుగు సాహిత్యరంగంలో కవిగా, అనువాదకుడిగా, పరిశోధకుడిగా, సంకలనకర్తగా, అధ్యాపకుడిగా, ఉపన్యాసకుడిగా ప్రసిద్ధుడు. ఈయన 1928, మార్చి 23 న కృష్ణాజిల్లా చిట్టి గూడూరు గ్రామంలో జన్మించాడు. అక్కడి ప్రాచ్యకళాశాలలోనే విద్యాభ్యాసం చేసి అదే కళాశాలలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేశాడు. తరువాత మద్రాసు లోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పరిశోధకుడిగా పనిచేశాడు. తరువాత రాజమండ్రి లోని ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరి ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశాడు.ఇతడు 2007 లో మరణించాడు[1].
మల్లంపల్లి శరభయ్య శర్మ | |
---|---|
జననం | 1928, మార్చి 23 కృష్ణా జిల్లా, గూడూరు మండలం చిట్టిగూడూరు గ్రామం |
మరణం | 2007 |
వృత్తి | అధ్యాపకుడు |
ప్రసిద్ధి | కవి, అనువాదకుడు, పరిశోధకుడు |
మతం | హిందూ |
సాహిత్యసేవ
మార్చుఇతడు కాళిదాసు వ్రాసిన కుమార సంభవము, విక్రమోర్వశీయము నాటకాలను తెలుగులోనికి అనువదించాడు. కన్నడ భాషలోని బసవేశ్వరవచనాలను, తాళ్లపాక పెదతిరుమలాచార్యుని వెంకటేశ్వర వచనాలను సంస్కృత భాషలోనికి అనువదించాడు. కాశ్మీర కవయిత్రి లల్ల వ్రాసిన వచనాలను తెలుగులో ముత్యాలసరాలుగా అనువదించాడు. వేదాంతదేశికుల దయాశతకాన్ని, అభినవగుప్తుని పరమార్థసారాన్ని తెలుగులో అనుసృజించాడు. కాశీఖండము, శ్రీకృష్ణకర్ణామృతము మొదలైన సంస్కృతగ్రంథాలకు తెలుగులో వ్యాఖ్యానాలు రచించాడు. వెయ్యేళ్ల తెలుగు వచనం నుంచి ఇతడు ఎంపిక చేసి కూర్చిన సంకలనాన్ని "ఆంధ్ర గద్యచంద్రిక" అనే పేరుతో 1965లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఇతడు వ్రాసిన సాహిత్య వ్యాసాలను కొన్నింటిని 1991లో తెలుగు అకాడమీ "సహృదయాభిసరణం" పేరుతో ప్రకటించింది. ఇంకా ఇతడు శ్రీవేణుగోపాలశతకము, సంస్కృతభాషలో "గౌరీ కళ్యాణమ్" అనే కావ్యాన్ని రచించాడు. ఇతని కవితలలో బెంగుళూరు నుండి వెలువడే "చైతన్యకవిత" అనే పత్రిక 1991లో "సుప్తదీర్ఘిక" అనే పేరుతో ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది.