మహానంది

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా మహానంది మండలం లోని గ్రామం

మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, మహానంది మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది మహానంది మండలానికి కేంద్రం.నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవ నందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవ నందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది.[1]ఇది మహా శివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహా శివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది.ఈ పురాతన ఆలయం సా.శ. 7 శతాబ్దం నాటిది. 10వ శతాబ్దపు పలకల శాసనాలు ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మత్తులు జరిగినట్లుగా, పునర్నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి.[2]

మహానందీశ్వరాలయం, మహానంది
మహానంది
View of the entire temple complex.
మహానంది is located in Andhra Pradesh
మహానంది
ఆంధ్రప్రదేశ్ పటంలో మహానంది స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు15°28′14″N 78°37′34″E / 15.47056°N 78.62611°E / 15.47056; 78.62611
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల
ప్రదేశంనంద్యాల
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుమహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడియన్ ఆర్కిటెక్చర్

చరిత్ర సవరించు

 
మహానందీశ్వరాలయం, మహానంది
 
మహానందీశ్వరాలయం, మహానంది

ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది[3]. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగం కొంచెం అణిగివుంటుందని కథనం. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనాన్ని తెలియచేస్తుంది.[4]

ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు సర్వ వేళలా గోముఖ శిలనుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగం క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం! ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే ఉంటుంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినాన లింగోధ్బవసమయలో అభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవాలు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలిభాగంలో కీకారణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్ర లో భాగంగా వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో భాగంగా ఆ వివరాలు వ్రాశారు. గుడి చుట్టూ సకలఫల వృక్షాలూ ఉండేవనీ, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని అతని వ్రాతల వల్ల తెలుస్తుంది. అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని వ్రాశారు. రాత్రిపూట మనుష్యులు ఉండరనీ తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారనీ, వచ్చినవారు తామే శివునికి అభిషేకం చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలి జాముకు వచ్చి ఆలయగర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. మొత్తానికి 1830ల నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైనా సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది.[5] నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యం ఉంది. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఇక్కడికి సమీప రైల్వే స్టేషను.[6]

క్షేత్రచరిత్ర/స్థలపురాణం సవరించు

 
నంది విగ్రహం, మహానంది పుణ్యక్షేత్రం

పూర్వీకులు తెలిపిని కథానుసారం.. ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడు తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని (శిలాద మహర్షి) పిలిచేవారు. భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా.. ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై... కావల్సిన వరాలు కోరుకొమ్మన్నాడు. దేవాధిదేవుడ్ని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు! మహాదేవా.. నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ.. అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షనూ గుర్తుంచుకుని.. మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆమేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది... మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు.. అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకు ‘ మహానందుడు’ అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా.. వరం కోరుకో.. అనగా.. మహానందుడు... దేవాధిదేవా.. నన్ను నీ వాహనంగా చేసుకో... అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు ‘మహానందా.. నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కి.మీ.ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. అని వరమిచ్చాడు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు.

మరియొక కథనం సవరించు

 
మహానందీశ్వరాలయ కోనేరు, మహానంది

ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆపుట్టమీద రోజూ ఒకకపిలగోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. పశువులకాపరి ఒక ఇది చూచాడు. పుట్టక్రింద బాల శివుడు నోరుతెరచి ఈపాలు త్రాగుతుండేవాడు. ఈదృశ్యం ఆగొల్లవాడు పెద్దనందునితో చెప్పాడు. నందుడువచ్చి చూచాడు. ఆదృశ్యం కంటబడింది. తన్మయుడయ్యాడు. గోవు భయపడింది. అవు పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆపుట్టమీద ముద్రితమైనవి. ఇవాల్టికు కూడా అవి మనం చూడవచ్చును. నందుడు తను చేసిన అపరాధానికి విచారించాడు. ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది. గర్భాలయం ఎదుట పెద్దనంది ఉంది.దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటివల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్ధం అనే పేరు వచ్చింది. దేవాలయం ప్రాకారం బయట విష్ణుకుండం, బ్రహ్మకుండం అనే రెండు కుండాలు ఉన్నాయి. త్రిమూర్తిత్త్వానికి గుడిలో స్వామివారు అతీతులు. లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుష తత్త్వాలను తెలుపుతాయి. భైరవజోస్యుల మహానందయ్య భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారకురాలు. ఇక్కడ ఉన్న కామేశ్వరీదేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యుల ప్రతిష్ఠ.[7]

ఆలయ ప్రసిద్ధి సవరించు

ఈ ఆలయం కళ్యాణి లేదా పుష్కరణి అని పిలువబడే మంచినీటి కొలనులకు ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణం ఈ ప్రాంతంలో చాళుక్య రాజుల బలమైన ఉనికిని చూపుతుంది.[8] ఆలయ కొలనులు నిర్మాణాలు విశ్వకర్మల నైపుణ్యాన్ని తెలియజేస్తాయి.

నవనందులు సవరించు

 
మహానందీశ్వరాలయం, మహానంది

మహానంది, శివనంది, వినాయకనంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది (విష్ణునంది అని కూడా అంటారు) నాగనంది, ఈ ఆలయాలను నవనందులు అంటారు.[9] [10] కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.[11]

చేరుకునే మార్గాలు సవరించు

నంద్యాల నుండి మహానంది సుమారు 21 కి.మీ. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్‌లో ఉంది, ఇది దాదాపు 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ నంద్యాలలో ఉంది.[3] నంద్యాల పట్టణం నుండి మహానంది చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. తిమ్మాపురం మీదుగా ఒక మార్గం బస్టాండ్ నుండి 17 కి.మీ దూరంలో ఉన్న అతి చిన్న మార్గం.[12] మరొక మార్గం, గిద్దలూరు రోడ్డు మీదుగా బోయలకుంట్ల క్రాస్ వద్ద ఎడమవైపు నుండి వెళ్లే మార్గం. ఇది నంద్యాల నుండి 24 కి.మీ దూరంలో ఉంటుంది.

మహానంది ఆలయ చిత్రాలు సవరించు

మూలాలు సవరించు

 1. "Mahanandishwara Temple, Mahanandi - Timings, History, Pooja & Aarti schedule,". Trawell.in. Retrieved 2023-01-20.
 2. "Mahanandi Tourism | Tourist Places to Visit & Travel Guide to Mahanandi".
 3. link, Get; Facebook; Twitter; Pinterest; Email; Apps, Other. "Mahanandi Temple Guide - మహానంది" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-04-07. {{cite web}}: |last2= has generic name (help)
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.
 5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
 6. "Mahanandiswara Swamy Mahanandi Temple - History, Timings, Website". Temple Darshan, Pooja and Sevas Information. 2015-12-25. Retrieved 2023-01-06.
 7. https://tirupaticentralexcise.gov.in/docs/mahanandi.pdf
 8. Subba Reddy, V. V. (2009). Temples of South India. ISBN 9788121210225.
 9. "Mahanandi | Mahanandi Photos | Kurnool Tourist Places". www.holidayiq.com. Archived from the original on 2012-11-14.
 10. "మహానంది క్షేత్రం | Mahaa Nandi". TELUGU BHAARATH. Retrieved 2023-01-20.
 11. Reddy, V. V. Subba (2009). Temples of South India. Gyan Publishing House. ISBN 978-81-212-1022-5.
 12. "::.Ap Tourism.::". Archived from the original on 10 December 2016. Retrieved 15 July 2016.

వెలుపలి లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మహానంది&oldid=3894862" నుండి వెలికితీశారు