మాతంగిని హజ్రా (హిందీ: মাতঙ্গিনী হাজরা) ( 1869 నవంబరు 17[1] - 1942 సెప్టెంబరు 29[2]) - ఒక భారత స్వాతంత్ర్య ఉద్యమ విప్లవ వనిత. ఆమె భారత స్వాతంత్ర్యోద్యమంలో చేసిన ఒక ఉద్యమంలో తమ్లుక్ (పశ్చిమ బెంగాల్) పోలీసు స్టేషన్ పరిధిలో కాల్చి చంపి వేయబడింది. తూటాలు శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా చేతిలో జెండా దించకుండా వందేమాతరం అంటూ నేలకొరిగిన అమరనారి. గాంధేయ సిద్ధాంతాలపై ఆమె ప్రదర్శించిన నిబద్ధతను చూసి ఆ రోజుల్లో ఆమెను గాంధీ బుడీ అని స్థానికులు ఆప్యాయంగా పిలుచుకునేవారు.[3]

మాతంగిని హజ్రా
జననం(1869-11-17)1869 నవంబరు 17
మరణం1942 సెప్టెంబరు 29(1942-09-29) (వయసు 72)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కార్యకర్త

బాల్యం, వివాహం మార్చు

ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని మేథినీపుర్‌ జిల్లాలో తమ్లుక్‌కు సమీపంలోని హోగ్లా గ్రామంలో పేద రైతు కుటుంబంలో మాతంగిని హజ్రా జన్మించారు. ఆమె పేదరికం కారణంగా చదువుకోలేకపోయింది.[4] పైగా 12 ఏళ్లకే 60 ఏళ్ల త్రిలోచన్‌తో వివాహం అయింది. కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవటంతో 18వ ఏట వితంతువుగా పుట్టింటికి చేరింది. తన దురదృష్టాన్ని నిందిస్తూ కూర్చోకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేది.

స్వాతంత్ర్యోద్యమంలో మార్చు

స్వాతంత్ర్య ఉద్యమం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని నూలు వడకడం మొదలుపెట్టారు. ఆ ఖాదీ దుస్తులే ఆమె ధరించేవారు. అందరిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. లాఠీ దెబ్బలకు నెరవలేదు. పలుమార్లు అరెస్టయి జైలు జీవితం గడిపారు.

1933లో ఆమె జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. ఆ సమయంలో బెంగాల్‌ గవర్నర్‌ సర్‌ జాన్‌ ఆండర్సన్‌ అక్కడే పర్యటిస్తున్నారు. పోలీసుల కన్నుగప్పి ముందుకు వెళ్లి నల్లజెండా చూపిస్తూ ‘గవర్నర్‌ గోబ్యాక్‌’ అని నినదించింది. ఈ చర్యకుగాను ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.

1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం నాటికి ఆమె వయసు 73 సంవత్సరాలు. ఆ ఉద్యమంలో భాగంగా సెప్టెంబరు 29న సుమారు 6 వేల మంది మహిళలతో తమ్లుక్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టణ పోలీసుస్టేషన్‌ సమీపానికి చేరుకోగానే పోలీసులు ఉద్యమం వీడాలని హెచ్చరించారు. ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. దీంతో భావిభారత పౌరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె చేతిలో జెండాతో, వందేమాతర నినాదంతో ఎదురువెళ్ళింది. శరీరంలోకి దిగిన మూడు వరుస తూటాలకు కుప్పకూలిపోతున్నా ఆమె స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగింది. జెండాను మరింత పైకెత్తి, ఇంకా బిగ్గరగా వందేమాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. ప్రాణం వదిలినా.. జెండాను మాత్రం వదల్లేదు. ఆమె వీరగాథ నాడు ఎందరిలోనో స్ఫూర్తి రగిలించింది. ఆమె ప్రేరణతో స్థానికులు మేథినీపుర్‌లో కొంతకాలం సొంతంగా స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నారు.

మూలాలు మార్చు

  1. "বিপŕ§?ŕŚ˛ŕŚŹŕ§€ ŕŚŽŕŚžŕŚ¤ŕŚ™ŕ§?ŕŚ—ŕŚżŕŚ¨ŕ§€ ŕŚšŕŚžŕŚœŕŚ°ŕŚž". Biplobiderkotha.com. 2010-11-17. Archived from the original on 2021-08-15. Retrieved 2012-10-03.
  2. "মাতঙ্গিনী হাজরা". Amardeshonline.com. 2010-09-29. Archived from the original on 20 January 2016. Retrieved 2012-10-03.
  3. Amin, Sonia (2012). "Hazra, Matangini". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
  4. Maity, Sachindra (1975). Freedom Movement in Midnapore. Calcutta: Firma, K.L. pp. 112–113.