ఉప్పు సత్యాగ్రహం

మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన భారత స్వాతంత్ర్య ఉద్యమం

భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెసు జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అనీ, దండి యాత్ర అనీ, దండి మార్చి అనీ కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరం లోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించాడు.[1] రోజురోజుకూ పెరిగే సత్యాగ్రహులతో యాత్ర సాగి, 24 రోజుల తరువాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6 న, ఉదయం 6:30 గంటలకు గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు, ఇది కోట్లాది భారతీయులు బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది.[2]

దండి యాత్ర
యాత్ర అంతాన గాంధీ, ఉప్పు గల్లును పట్టుకున్నాడు. అతని వెనక రెండవ కుమారుడు మణిలాల్ గాంధీ, మైథుబెన్ పెటిట్ ఉన్నారు.
తేదీ12 మార్చి 1930 - 1930 ఏప్రిల్ 5
ప్రదేశంసబర్మతి, అహ్మదాబాదు, గుజరాత్
ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ

దండి వద్ద ఉప్పు వండిన తరువాత గాంధీ, తీరం వెంబడి దక్షిణ దిశగా కొనసాగి, ఉప్పు తయారు చేస్తూ, మార్గంలో సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వెళ్ళాడు. దండికి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరసానా సాల్ట్ వర్క్స్ వద్ద సత్యాగ్రహాన్ని నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక వేసింది. అయితే, ఈ సత్యాగ్రహానికి కొద్ది రోజుల ముందు, 1930 మే 4–5 అర్ధరాత్రి గాంధీని అరెస్టు చేశారు. దండి సత్యాగ్రహం, ఆ తరువాత ధరసానా సత్యాగ్రహాలకు వార్తాపత్రికల్లోను, న్యూస్‌రీల్‌ల ద్వారానూ వచ్చిన విస్తృతమైన ప్రచారంతో భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. గాంధీ జైలు నుండి విడుదల కావడం, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌తో చర్చలు జరిగడంతో ఉద్యమం ముగిసింది.[3] ఉప్పు సత్యాగ్రహం ఫలితంగా 60,000 మంది భారతీయులు జైలు పాలైనప్పటికీ,[4] బ్రిటిషు వారు వెంటనే పెద్ద రాయితీలేమీ ఇవ్వలేదు.[5]

ఉప్పు సత్యాగ్రహ ప్రచారం గాంధీ ప్రవచించిన సత్యాగ్రహ సూత్రాలపై ఆధారపడింది.1930 ప్రారంభంలో, బ్రిటిషు పాలన నుండి భారత సార్వభౌమత్వాన్ని, స్వయం పాలననూ సాధించుకోవటానికి భారత జాతీయ కాంగ్రెస్, తన ప్రధాన వ్యూహంగా సత్యాగ్రహాన్ని ఎంచుకుంది. ప్రచారాన్ని నిర్వహించడానికి గాంధీని నియమించింది. 1882 బ్రిటిషు ఉప్పు చట్టాన్ని గాంధీ తమ సత్యాగ్రహ మొదటి లక్ష్యంగా ఎంచుకున్నారు. దండికి పాదయాత్ర, ధరసానాలో వందలాది అహింసా నిరసనకారులను బ్రిటిషు పోలీసులు కొట్టడం వంటి సంఘటనలు సామాజిక రాజకీయ అన్యాయాలపై పోరాటంలో శాసనోల్లంఘనను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రదర్శించాయి.[6]

గాంధీ సత్యాగ్రహ బోధనలు, దండి యాత్రలు 1960 లలో ఆఫ్రికన్ అమెరికన్లు, ఇతర మైనారిటీ వర్గాల పౌర హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో అమెరికన్ పౌరహక్కుల కార్యకర్తలైన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జేమ్స్ బెవెల్ తదితరులపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. 1920-22 నాటి సహాయ నిరాకరణోద్యమం తరువాత ఈ మార్చి బ్రిటిషు అధికారానికి అత్యంత ముఖ్యమైన వ్యవస్థీకృత సవాలు విసిరింది. 1930 జనవరి 26 న భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య నినాదం ప్రకటించిన వెంటనే దండి సత్యాగ్రహం మొదలైంది.[7] ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణనిచ్చింది. దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది.

సార్వభౌమాధికారం, స్వీయ పాలన ప్రకటన

మార్చు

1929 డిసెంబరు 31 న అర్ధరాత్రి, భారత జాతీయ కాంగ్రెస్, లాహోర్ వద్ద రావి నది ఒడ్డున భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూల నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్, 1930 జనవరి 26 న సార్వభౌమాధికారం, స్వయం పాలన లేదా సంపూర్ణ స్వరాజ్య ప్రకటనను బహిరంగంగా జారీ చేసింది.[8] ఆ ప్రకటన ఇలా ఉంది:

ఇతర ప్రజల మాదిరిగానే, స్వేచ్ఛను పొందడం, వారి శ్రమ ఫలాలను ఆస్వాదించడం, జీవితావసరాలను తీర్చుకో గలిగి ఉండటం, తద్వారా వారు అభివృద్ధికి పూర్తి అవకాశాలు కలిగి ఉండడం భారతదేశ ప్రజల హక్కు అని మేము నమ్ముతున్నాం. ఏ ప్రభుత్వమైనా ఈ హక్కులను అందనీయకుండా చేసి, వారిని అణచివేస్తే, ఆ ప్రభుత్వాన్ని మార్చడానికీ, రద్దు చేయడానికీ ప్రజలకు మరింతగా హక్కు ఉందని మేము నమ్ముతున్నాం. భారతదేశంలోని బ్రిటిషు ప్రభుత్వం భారతీయ ప్రజల స్వేచ్ఛను హరించడమే కాక, ప్రజలను దోపిడీ చెయ్యడంపైనే ఆధారపడింది. భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం చేసింది. అందువల్ల, భారతదేశం బ్రిటిషు సంబంధాన్ని తొలగించుకుని, సంపూర్ణ స్వరాజ్యాన్ని (అంటే, పూర్తి సార్వభౌమాధికారం, స్వయం పాలన) సాధించాలని మేము నమ్ముతున్నాం.

శాసనోల్లంఘనలో మొదటి చర్యను నిర్వహించే బాధ్యతను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాంధీకి అప్పగించింది. ఒకవేళ గాంధీని అరెస్టు చేస్తే, వెంటనే బాధ్యతలు స్వీకరించడానికి కాంగ్రెస్ స్వయంగా సిద్ధంగా ఉంది.[9] బ్రిటిషు ఉప్పు పన్నును లక్ష్యంగా చేసుకుని సత్యాగ్రహంతో శాసనోల్లంఘన ప్రారంభించాలన్నది గాంధీ ప్రణాళిక. 1882 ఉప్పు చట్టం బ్రిటిషు వారికి ఉప్పు సేకరణ, తయారీలపై గుత్తాధిపత్యాన్ని ఇచ్చింది. ఉప్పు పంపిణీ నిర్వహణను ప్రభుత్వ ఉప్పు డిపోలకు మాత్రమే ఇచ్చి, ఉప్పుపై పన్ను విధించింది.[10] ఉప్పు చట్టం ఉల్లంఘించడం నేరం. తీరంలో నివసించేవారికి ఉప్పు ఉచితంగా లభించినప్పటికీ (సముద్రపు నీటి ఆవిరి ద్వారా), భారతీయులు దీనిని వలస ప్రభుత్వం నుండి కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించింది.

నిరసనగా ఉప్పే ఎందుకు?

మార్చు
 
పాదయాత్రలో మహాత్మా గాంధీ సరోజిని నాయుడు .

ప్రారంభంలో, గాంధీ ఎంచుకున్న ఉప్పు పన్ను సరైన ఎంపికని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భావించలేదు.[11] జవహర్‌లాల్ నెహ్రూ, దిబ్యలోచన్ సాహూలు సందిగ్ధంగా ఉన్నారు. దాని బదులు భూమి శిస్తు బహిష్కరణ చేపడదామని సర్దార్ పటేల్ సూచించాడు.[12][13] స్టేట్స్‌మన్ పత్రిక ఈ ఎంపిక గురించి ఇలా వ్రాసింది: "నవ్వాపుకోవడం కష్టం. ఆలోచించగల చాలామంది భారతీయుల మానసిక స్థితి ఇదేనని మేము అనుకుంటున్నాం." [13] ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా ప్రతిఘటన యొక్క ఈ ప్రణాళికలతో బ్రిటిషు వారు కూడా కలవరపడలేదు. స్వయంగా వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కూడా ఉప్పు నిరసన ముప్పును తీవ్రంగా పరిగణించలేదు. లండన్‌కు రాసిన ఉత్తరంలో, "ఈ ఉప్పు దండయాత్ర వలన నా నిద్రేమీ చెడిపోదులే" అని రాసాడతడు [14]

అయితే, తన నిర్ణయానికి గాంధీ వద్ద సరైన కారణాలే ఉన్నాయి. మరిన్ని రాజకీయ హక్కులు కావాలంటూ చేసే నైరూప్య డిమాండు కంటే, రోజువారీ వాడుకలో ఉండే అంశం అన్ని వర్గాల పౌరులతో ప్రతిధ్వనిస్తుంది.[15] ఉప్పు పన్ను బ్రిటిషు రాజ్ పన్ను ఆదాయంలో 8.2% వరకూ ఉంటుంది. పేద భారతీయులకు చాలా భారంగా ఉండే పన్ను ఇది.[16] తన ఎంపికను వివరిస్తూ గాంధీ, "గాలి, నీరూ.. ఆ తరువాత బహుశా ఉప్పే జీవితానికి అత్యవసరం" అని అన్నాడు.

ఈ నిరసన పూర్ణ స్వరాజ్‌ను ప్రతి భారతీయుడికి అర్థమయ్యే విధంగా నాటకీయంగా మారుస్తుందని గాంధీ అభిప్రాయపడ్డాడు. హిందువులు, ముస్లింలు ఇద్దరికీ ఉన్న సమస్యపై పోరాడటం ద్వారా వారిలో ఐక్యత పెరుగుతుందని కూడా ఆయన వాదించాడు.[9] నిరసన ఊపందుకున్న తరువాత, నాయకులు ఉప్పును శక్తికి చిహ్నంగా గ్రహించారు. అపూర్వమైన ప్రజాదరణ పొందిన ప్రతిస్పందన గురించి నెహ్రూ వ్యాఖ్యానిస్తూ, "ఒక నీటి బుగ్గ ఒక్కసారిగా పొంగినట్లు అనిపించింది." [13]

యాత్ర కోసం సన్నాహాలు

మార్చు

ఉప్పు చట్టాలను ధిక్కరించడం ద్వారా గాంధీ శాసనోల్లంఘనను ప్రారంభిస్తారని ఫిబ్రవరి 5 న వార్తాపత్రికలు రాసాయి. ఉప్పు సత్యాగ్రహం మార్చి 12 న అహ్మదాబాదు లోని సబర్మతి ఆశ్రమంలో ప్రారంభమై ఏప్రిల్ 6 న దండిలో ముగుస్తుంది. గాంధీ ఏప్రిల్ 6 న దండిలోఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తాడు.[17] ఉప్పు చట్టాలను భారీగా ఉల్లంఘించడానికి గాంధీ ఏప్రిల్ 6 ను ఎంచుకోవడానికి ఒక సింబాలిక్ కారణముంది -ఇది 1919 లో రౌలాట్ చట్టానికి వ్యతిరేకంగా జాతీయ సమ్మె తలపెట్టిన "నేషనల్ వీక్"లో మొదటి రోజు.[18] గాంధీ, తన ప్రార్థన సమావేశాలలోనూ పత్రికలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూనూ క్రమం తప్పకుండా ప్రకటనలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా మీడియాను ఈ మార్చ్ కోసం సిద్ధం చేశాడు. అరెస్టు చేస్తారని ఊహిస్తున్నానంటూ ఆయన పదేపదే చేసిన ప్రకటనలు, సమయం దగ్గరయ్యే కొద్దీ అతని భాషలో పెరుగుతున్న నాటకీయత ఉత్కంఠను పెంచాయి. "మేము జీవన్మరణ పోరాటానికి సిద్ధమౌతున్నాం, పవిత్ర యుద్ధంలో దిగుతున్నాం; మేము మరణాన్ని ఆలింగనం చేసుకుని మమ్మల్ని మేమే నైవేద్యంగా సమర్పించుకుందా మనుకుంటున్నాం" అని గాంధీ అన్నాడు.[19] చలనచిత్ర సంస్థలతో పాటు డజన్ల కొద్దీ భారతీయ, యూరోపియన్, అమెరికన్ వార్తాపత్రికల కరస్పాండెంట్లు ఈ ప్రకటనలకు స్పందించి, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడం ప్రారంభించారు.[20]

మార్చి కోసం సత్యాగ్రహానికి, అహింసకు కఠోరమైన క్రమశిక్షణతో కట్టుబడి ఉండాలని గాంధీ చెప్పాడు. అందుచేత, అతను నిరసనకారులను కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుండి కాకుండా, తన క్రమశిక్షణా ప్రమాణాలలో శిక్షణ పొంది ఆరితేరిన తన సొంత ఆశ్రమం లోని సహవాసులను ఎంచుకున్నాడు.[21] 24 రోజుల పాదయాత్ర 4 జిల్లాలు, 48 గ్రామాల గుండా వెళుతుంది. సత్యాగ్రహ మార్గాన్ని, ప్రతి సాయంత్రం ఆగే స్థలం, ప్రజలను సత్యాగ్రహంలో చేర్చుకోగల సామర్థ్యం, గత పరిచయాలు, సమయం వంటి విషయాలపై ఆధారపడి తయారు చేసారు. మార్చి‌‌కు ముందు గాంధీ ప్రతి గ్రామానికి కార్యకర్తలను పంపేవాడు. తద్వారా స్థానిక ప్రజల అవసరాలను గ్రహించి, దాన్ని బట్టి ప్రతి విశ్రాంతి స్థలంలో తన ప్రసంగాలను ప్లాన్ చేసుకునేవాడు.[22] ప్రతి గ్రామంలోనూ చెయ్యాల్సిన కార్యక్రమాల ప్రణాళికను ముందే తయారుచేసి పెట్టుకున్నారు. వీటిని భారతీయ, విదేశీ పత్రికలలో ప్రచారం చేసారు.[23] 1930 మార్చి 2 న గాంధీ, వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌కు లేఖ రాసాడు. భూమి ఆదాయ అంచనాలను తగ్గించడం, సైనిక వ్యయాన్ని తగ్గించడం, విదేశీ వస్త్రంపై సుంకం విధించడం, ఉప్పు పన్నును రద్దు చేయడం మొదలైన తన పదకొండు డిమాండ్లను ఇర్విన్ నెరవేర్చేటట్లయితే, మార్చి ఆపేస్తానని ఆ లేఖలో రాసాడు.[9][24] ఉప్పు పన్ను గురించి ఇర్విన్‌కు అతడు చేసిన బలమైన విజ్ఞప్తి ఇలా ఉంది:

నా లేఖ మీ హృదయాన్ని కదిలించకపోతే, ఈ నెల పదకొండవ రోజున, ఉప్పు చట్టాల నిబంధనలను ధిక్కరించడానికి, నాకు అందుబాటులో ఉన్న ఆశ్రమ సహవాసులతో కలిసి ముందుకు వెళ్తాను. నిరుపేదల దృక్కోణం నుండి చూస్తే, ఈ పన్ను అన్నింటికన్నా అత్యంత అన్యాయమని నేను భావిస్తున్నాను. సార్వభౌమాధికారం, స్వయం పాలన ఉద్యమం ఈ దేశపు అత్యంత నిరుపేదల కోసమే. ఈ ఉద్యమం, ఈ దౌష్ట్యం తోటే మొదలౌతుంది.[25]

ఇంతకు ముందే చెప్పినట్లుగా, వైస్రాయ్ "ఉప్పు నిరసన" పట్ల చాలా ఉపేక్ష వహించాడు. అతను ఆ లేఖను పట్టించుకోలేదు. గాంధీని కలవడానికి నిరాకరించాడు. ఆ తరువాత, మార్చి ప్రారంభమైంది. "మోకాళ్లపై వంగి నేను రొట్టె ఇమ్మని అడిగాను, బదులుగా నాకు రాయి ఇచ్చారు" అని గాంధీ వ్యాఖ్యానించాడు.[26] మార్చి‌‌కు ముందు రోజు సాయంత్రపు ప్రార్థనలో గాంధీ చెప్పేది వినడానికి వేలాది మంది భారతీయులు సబర్మతికి చేరుకున్నారు. అమెరికన్ పత్రిక, ది నేషన్ ఇలా రాసింది: "గాంధీ ఇచ్చే పోరాట ప్రకటన వినడానికి 60,000 మంది ప్రజలు నది ఒడ్డున గుమిగూడారు. ఈ పోరాటపు పిలుపు బహుశా ఇప్పటివరకు ఇచ్చిన పిలుపులన్నిటి లోకీ విలక్షణమైనది" [27][28]

దండి యాత్ర

మార్చు
ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ తన అనుచరులతో సహా దండి వైపు పాదయాత్రగా వెళ్తున్నప్పటి ఒరిజినల్ వీడియో

1930 మార్చి 12 న గాంధీ, మరో 80 మంది సత్యాగ్రహులతో కలిసి, సబర్మతి ఆశ్రమంలో యాత్ర మొదలుపెట్టాడు. ఈ సత్యాగ్రహుల్లో చాలామంది షెడ్యూల్డ్ కులాల వారు. వారి గమ్యం 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ తీర గ్రామం దండి.[17] తెల్లటి ఖద్దరు దుస్తులు ధరించి సత్యాగ్రహులు నడుస్తూ పోతూంటే, అనేక మంది శ్వేత వస్త్ర ధారులు ఈ ప్రవాహంలో చేరిపోతూంటే, ఈ ఉప్పు కవాతు తెల్లటి నదీ ప్రవాహంలా ఉందని వర్ణించారు. సాధారణంగా గాంధీ కార్యక్రమాలలో జనసమూహాన్ని తగ్గించి రాసే అధికారిక ప్రభుత్వ వార్తాపత్రిక ది స్టేట్స్‌మన్, సబర్మతి - అహ్మదాబాద్ రహదారిపై 1,00,000 మంది ప్రజలు ఉన్నారని రాసింది.[29][30]

మొదటి రోజు యాత్ర 21 కి.మీ. దూరం సాగి, అస్లాలీ గ్రామంలో ముగిసింది. అక్కడ గాంధీ సుమారు 4,000 మందితో మాట్లాడాడు.[31] అస్లాలీ వద్ద, మార్చి వెళ్ళిన ఇతర గ్రామాలలోనూ, వాలంటీర్లు విరాళాలు సేకరించి, కొత్త సత్యాగ్రహులను నమోదు చేశారు. బ్రిటిషు పాలనకు సహకరించకూడదని నిర్ణయించుకున్న గ్రామాధికారుల నుండి రాజీనామాలను అందుకున్నారు.[32] వారు ప్రతి గ్రామంలోకి ప్రవేశించగానే, డప్పులు కొడుతూ, చేతాళాలు వేస్తూ జనం నిరసనకారులను స్వాగతించారు. ఉప్పు పన్ను అమానుషమని చెబుతూ, ఉప్పు సత్యాగ్రహాన్ని "పేదవాడి పోరాటం"గా గాంధీ అభివర్ణించాడు. రాత్రిళ్ళు వారు బయటే పడుకునేవారు. తినడానికి తిండి, కడుక్కోడానికి నీళ్ళు మాత్రమే వాళ్ళు గ్రామస్తులను అడిగేవారు. ఇది పేదలను పోరాటంలో తీసుకువస్తుందని గాంధీ అభిప్రాయపడ్డాడు.[33]

వేలాది మంది సత్యాగ్రహులు, సరోజినీ నాయుడు వంటి నాయకులు గాంధీతో కలిసారు. ప్రతిరోజూ, కవాతులో కొత్తవారు చేరుతూ ఉండేవారు. చివరికి ఆ ఊరేగింపు కనీసం రెండు మైళ్ళ పొడవుకు చేరింది.[31] వారి ఉత్సాహాన్ని నిలుపుకోవటానికి, పాదయాత్రలో నిరసనకారులు రఘుపతి రాఘవ రాజా రామ్ భజన పాడేవారు.[31] సూరత్‌లో వారిని 30,000 మంది స్వాగతించారు. వారు దండి రైల్వేస్టేషను వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ 50,000 మందికి పైగా గుమిగూడారు. గాంధీ దారి పొడవునా ఇంటర్వ్యూలు ఇచ్చి, వ్యాసాలు రాశాడు. న్యూస్‌రీల్ ఫుటేజీని చిత్రీకరిస్తున్న విదేశీ పాత్రికేయులు, మూడు బాంబే సినిమా కంపెనీలు, ఐరోపా, అమెరికాల్లో గాంధీని ఇంటింటికీ పరిచయం చేసాయి. (1930 చివరిలో, టైమ్ మ్యాగజైన్ అతన్ని "మ్యాన్ ఆఫ్ ది ఇయర్"గా ప్రకటించింది).[33] న్యూయార్క్ టైమ్స్ ఈ ఉప్పు యాత్ర గురించి దాదాపు ప్రతిరోజూ రాసింది. ఏప్రిల్ 6, 7 తేదీలలో అయితే, రెండు మొదటి పేజీ కథనాలను ప్రచురించింది.[34] మార్చ్ ముగింపులో, గాంధీ "బలవంతుడితో చేసే ఈ హక్కుల పోరాటంలో నాకు ప్రపంచ మద్దతు కావాలి" అని ప్రకటించాడు.[35] ఏప్రిల్ 5 న సముద్రతీరానికి చేరుకున్న తరువాత, గాంధీని అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. గాంధీ ఇలా అన్నాడు:

మార్చ్ పొడుగునా వారు ఏమాత్రం జోక్యం చేసుకోకపోవడాన్ని నేను అభినందించకుండా ఉండలేను... ఇది వారిలో వచ్చిన నిజమైన హృదయ పరివర్తన అని, వారి విధానాల్లో వచ్చిన మార్పేననీ నమ్మేట్లుగా ఉంటే ఎంతో బాగుండును. జనాదరణ పొందిన ఈ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం పట్ల శాసనసభలో వారు చూపిన అనాసక్తినీ, వారి అధికార దర్పాన్నీ చూస్తే, భారతదేశాన్ని నిర్దయగా దోపిడీ చెయ్యాలనే వారి విధానం ఎట్టి పరిస్థితిలోనైనా కొనసాగిస్తారనడానికి ఏ సందేహమూ ఉండనక్కరలేదు. అందువల్ల ఈ జోక్యం చేసుకోకపోవడానికి నేను చెప్పే ఏకైక వివరణ ఏమిటంటే, బ్రిటిషు ప్రభుత్వం ఎంత బలమైనదైనా, ప్రపంచ అభిప్రాయం పట్ల భయపడుతూనే ఉంటుంది. మా ఈ శాసనోల్లంఘన నిస్సందేహంగా ఒక అత్యంత తీవ్రమైన రాజకీయ ఆందోళన. శాసనోల్లంఘన శాంతియుతంగా, అంటే అహింసాత్మకంగా, ఉన్నంతకాలం.. ఇలాంటి ఆందోళనను అణచివేస్తే ప్రపంచం సహించదు. ఈ మార్చ్ పొడుగునా సహనంగా ఉన్న ప్రభుత్వం, రేపు అసంఖ్యాకంగా ప్రజలు ఉప్పు చట్టాలను ధిక్కరించినపుడు కూడా ఇంతే సహనంగా ఉంటుందో లేదో చూడాలి.[36][37]

మరుసటి రోజు (ఏప్రిల్ 6) ఉదయం, ప్రార్థన తరువాత, గాంధీ ఉప్పు బురదను పైకి లేపి, "దీనితో, నేను బ్రిటిషు సామ్రాజ్యపు పునాదులను కదిలిస్తున్నాను" అని ప్రకటించాడు.[16] తరువాత అతను దానిని సముద్రపు నీటిలో ఉడకబెట్టి, బ్రిటిషు చట్టాన్ని ధిక్కరిస్తూ ఉప్పును తయారు చేశాడు. తన వేలాది మంది అనుచరులను కూడా అదేవిధంగా సముద్ర తీరం వెంబడి "ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ" ఉప్పును తయారు చేయమని చెప్పాడు. గ్రామస్థులను కూడా ఉప్పును తయారు చేయమని చెప్పమని కూడా వారిని కోరాడు.[38]

మొదటి 80 సత్యాగ్రహులు

మార్చు

79 మంది సత్యాగ్రహులు గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారు. వీళ్ళు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుండి వచ్చారు. ఈ యాత్ర ముందుకు పోయేకొద్దీ ఊపందుకుంటూ మరింత మందిని చేర్చుకుంటూ పోయింది. కింది జాబితా లోని వారు దండి యాత్ర మొదలైనప్పటి నుండి చివరి వరకూ గాంధీతో కలిసి ఉన్న మొదటి 79 మంది నిరసనకారులు. మార్చి ముగిసిన తర్వాత వారిలో ఎక్కువ మంది చెదిరిపోయారు.[39][40]

 
దండి సత్యాగ్రహం మార్గం
సంఖ్య పేరు వయస్సు అప్పటి రాష్ట్రం ఇప్పటి రాష్ట్రం
1 మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 61 పోర్‌బందర్ సంస్థానం గుజరాత్
2 ప్యారేలాల్ నయ్యర్ 30 పంజాబ్ పంజాబ్
3 ఛగన్‌లాల్ నాథ్థుభాయ్ జోషి 35 పేరు తెలియని సంస్థానం గుజరాత్
4 పండిత నారాయణ్ మోరేశ్వర్ ఖరే 42 బాంబే మహారాష్ట్ర
5 గంపత్‌రావ్ గోడ్సే 25 బాంబే మహారాష్ట్ర
6 ప్రథ్వీరాజ్ లక్ష్మీదాస్ అషర్ 19 కచ్ గుజరాత్
7 మహవీర్ గిరి 20 నేపాల్ సంస్థానం
8 బాల్ దత్తాత్రేయ కాలేల్కర్ 18 బాంబే మహారాష్ట్ర
9 జయంతి నాథూభాయ్ పరెఖ్ 19 పేరు తెలియని సంస్థానం గుజరాత్
10 రసిక్ దేశాయ్ 19 పేరు తెలియని సంస్థానం గుజరాత్
11 విఠల్ లీలాధర్ థక్కర్ 16 పేరు తెలియని సంస్థానం గుజరాత్
12 హరఖ్జీ రాంజీభాయ్ 18 పేరు తెలియని సంస్థానం గుజరాత్
13 తన్సుఖ్ ప్రన్షంకర్ భట్ 20 పేరు తెలియని సంస్థానం గుజరాత్
14 కాంతీలాల్ హరిలాల్ గంధి 20 పేరు తెలియని సంస్థానం గుజరాత్
15 ఛోటూభాయ్ ఖుషల్భాయ్ పటేల్ 22 పేరు తెలియని సంస్థానం గుజరాత్
16 వాల్జీభాయ్ గోవింద్‌జీ దేశాయ్ 35 పేరు తెలియని సంస్థానం గుజరాత్
17 పన్నాలాల్ బలభాయ్ ఝవేరి 20 గుజరాత్
18 అబ్బాస్ వర్తేజీ 20 గుజరాత్
19 పుంజాభాయ్ షా 25 గుజరాత్
20 మాధవ్‌జీభాయ్ థక్కర్ 40 కచ్ గుజరాత్
21 నరంజీభాయ్ 22 కచ్ గుజరాత్
22 మగన్‌భాయ్ వోర 25 కచ్ గుజరాత్
23 దుంగార్సీభాయ్ 27 కచ్ గుజరాత్
24 సోమాలాల్ ప్రాగ్జీభాయ్ పటేల్ 25 గుజరాత్
25 హస్ముఖ్‌రాం జకాబార్ 25 గుజరాత్
26 దౌడ్‌భాయ్ 25 గుజరాత్
27 రాంజీభాయ్ వంకర్ 45 గుజరాత్
28 దినకర్‌రాయ్ పాండ్య 30 గుజరాత్
29 ద్వారకానాథ్ 30 మహారాష్ట్ర
30 గజానన్ ఖరే 25 మహారాష్ట్ర
31 జెథాలాల్ రూపారెల్ 25 కచ్ గుజరాత్
32 గోవింద్ హర్కరే 25 మహారాష్ట్ర
33 పాండురంగ్ 22 మహారాష్ట్ర
34 వినాయక్‌రావ్‌ ఆప్తే 33 మహారాష్ట్ర
35 రాంతీర్థ్ రాయ్ 30 యునైటెడ్ ప్రావిన్సెస్
36 భానుశంకర్ దవే 22 గుజరాత్
37 మున్షిలాల్ 25 యునైటెడ్ ప్రావిన్సెస్
38 రాఘవన్ 25 మద్రాస్ ప్రెసిడెన్సీ కేరళ
39 రవ్జీభాయ్ నాథలాల్ పటేల్ 30 గుజరాత్
40 షివభాయ్ గొఖల్భాయ్ పటేల్ 27 గుజరాత్
41 శంకర్భాయ్ భీకాభాయ్ పటేల్ 20 గుజరాత్
42 జష్భాయ్ ఇష్వర్భాయ్ పటేల్ 20 గుజరాత్
43 సుమంగళ్ ప్రకాశ్ 25 యునైటెడ్ ప్రావిన్సెస్
44 థేవర్‌తుండియిల్ టైఇటస్ 25 మద్రాస్ ప్రెసిడెన్సీ కేరళ
45 కృష్ణ నాయర్ 25 మద్రాస్ ప్రెసిడెన్సీ కేరళ
46 తపన్ నైర్ 25 మద్రాస్ ప్రెసిడెన్సీ కేరళ
47 హరిదాస్ వర్జీవందాస్ గంధి 25 గుజరాత్
48 చిమన్లాల్ నర్సిలాల్ షహ్ 25 గుజరాత్
49 షంకరన్ 25 మద్రాస్ ప్రెసిడెన్సీ కేరళ
50 యెర్నేని సుబ్రహ్మణ్యం 25 ఆంధ్రప్రదేశ్
51 రామనిక్లాల్ మగన్లాల్ మొది 38 గుజరాత్
52 మదన్ మోహన్ చతుర్వేది 27 రాజపుటానా రాజస్థాన్
53 హరిలాల్ మహింతుర 27 మహారాష్ట్ర
54 మోతీబస్ దాస్ 20 ఒడిశా
55 హరిదాస్ మజుందార్ 25 గుజరాత్
56 ఆనంద్ హింగోరిని 24 సింధ్ సింధ్
57 మహదేవ్ మార్తాంద్ 18 కర్ణాటక
58 జయంతిప్రసాద్ 30 యునైటెడ్ ప్రావిన్సెస్
59 హరిప్రసాద్ 20 యునైటెడ్ ప్రావిన్సెస్
60 అనుగ్రహ్ నారాయణ్ సిన్హా 20 బీహార్
61 కేశవ్ చిత్రే 25 మహారాష్ట్ర
62 అంబలాల్ శంకర్భాయ్ పటేల్ 30 గుజరాత్
63 విష్ణు పంత్ 25 మహారాష్ట్ర
64 ప్రేంరాజ్ 35 పంజాబ్
65 దుర్గేష్ చంద్ర దాస్ 44 బెంగాల్ బెంగాల్
66 మాధవ్‌లాల్ షా 27 గుజరాత్
67 జ్యోతిరాం 30 యునైటెడ్ ప్రావిన్సెస్
68 సూరజ్‌భాన్ 34 పంజాబ్
69 భైరవ్ దత్త్ 25 యునైటెడ్ ప్రావిన్సెస్
70 లాల్జీ పర్మర్ 25 గుజరాత్
71 రత్నజీ బొరీ 18 గుజరాత్
72 విష్ణు శర్మ 30 మహారాష్ట్ర
73 చింతామణి శాస్త్రి 40 మహారాష్ట్ర
74 నారాయణ్ దత్త్ 24 రాజపుటానా రాజస్థాన్
75 మనిలాల్ మోహందాస్ గంధి 38 గుజరాత్
76 సురెంద్ర 30 యునైటెడ్ ప్రావిన్సెస్
77 హరి కృష్ణ మొహొని 42 మహారాష్ట్ర
78 పురతన్ బుచ్ 25 గుజరాత్
79 ఖరగ్ బహదుర్ సింఘ్ గిరి 25 నేపాల్ సంస్థానం
80 శ్రీ జగత్ నారాయణ్ 50 ఉత్తర ప్రదేశ్

ప్రసిద్ధ దండి యాత్రలో పాల్గొన్న ఈ సత్యాగ్రహులను గౌరవిస్తూ ఐఐటి బొంబాయి ఆవరణలో ఒక స్మారక చిహ్నాన్ని రూపొందించారు.[41]

యాత్ర షెడ్యూల్

మార్చు
తేదీ రోజు మధ్యాహ్న విశ్రాంతి రాత్రి విశ్రాంతి మైళ్ళు
12-03-1930 బుధవారం చందోలా తలావ్ అస్లాలీ 13
13-03-1930 గురువారం బరేజా నవగాం 9
14-03-1930 శుక్రవారం వాస్నా మాటార్ 10
15-03-1930 శనివారం దభాన్ నడియాడ్ 15
16-03-1930 ఆదివారం బొరియావి ఆనంద్ 11
17-03-1930 సోమవారం ఆనంద్ వద్ద విశ్రాంతి దినం 0
18-03-1930 మంగళవారం నాపా బోర్సాద్ 11
19-03-1930 బుధవారం రాస్ కంకర్‌పురా 12
20-03-1930 గురువారం బ్యాంక్ ఆఫ్ మహిసాగర్ కరేలి 11
21-03-1930 శుక్రవారం గజేరా ఆంఖి 11
22-03-1930 శనివారం జంబుసార్ ఆమోద] 12
23-03-1930 ఆదివారం బువా సామ్నీ 12
24-03-1930 సోమవారం సామ్ని వద్ద విశ్రాంతి దినం 0
25-03-1930 మంగళవారం ట్రాల్సా డెరోల్ 10
26-03-1930 బుధవారం బారుచ్ అంకలేశ్వర్ 13
27-03-1930 గురువారం సంజోద్ మంగరోల్l 12
28-03-1930 శుక్రవారం రైమా ఉమరాచి 10
29-03-1930 శనివారం ఎర్తాన్ భట్‌గామ్ 10
30-03-1930 ఆదివారం సాంధియర్ డేలాడ్ 12
31-03-1930 సోమవారం డెలాడ్ వద్ద విశ్రాంతి రోజు 0
01-04-1930 మంగళవారం చాప్రాభట సూరత్ 11
02-04-1930 బుధవారం డిండోలి వంజ్ 12
03-04-1930 గురువారం దామన్ నవ్‌సారి 13
04-04-1930 శుక్రవారం విజాల్‌పూర్ కరాడి 9
05-04-1930 శనివారం కరాడి-మట్వాడ్ దండి 4

సామూహిక సహాయ నిరకరణ

మార్చు
 
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా బహిరంగ సభలో గాంధీ.

లక్షలాది మంది ఉప్పు తయారు చేయడం ద్వారా లేదా అక్రమ ఉప్పును కొనుగోలు చేయడం ద్వారా ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో సామూహిక శాసనోల్లంఘన భారతదేశ మంతటా వ్యాపించింది.[16] ఉప్పును భారత తీరం అంతా చట్టాన్ని ఉల్లంఘిస్తూ విక్రయించారు. గాంధీ స్వయంగా తయారుచేసిన చిటికెడు ఉప్పు 1,600 రూపాయలకు అమ్ముడైంది. ప్రతిస్పందనగా, బ్రిటిషు ప్రభుత్వం ఆ నెలాఖరుకు అరవై వేల మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసింది.[36] ఉప్పు సత్యాగ్రహంగా ప్రారంభమైన ఉద్యమం త్వరలోనే సామూహిక సత్యాగ్రహంగా రూపుదిద్దుకుంది.[42] బ్రిటిషు వస్త్రాన్నీ, వస్తువులనూ బహిష్కరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రావిన్సులలో ప్రజావ్యతిరేక అటవీ చట్టాలను ఉల్లంఘించారు. గుజరాతీ రైతులు తమ పంటలు, భూమిని కోల్పోతారనే బెదిరింపులు ఉన్నా, పన్ను చెల్లించడానికి నిరాకరించారు. మిడ్నాపూర్లో బెంగాలీలు చౌకీదార్ పన్ను చెల్లించడానికి నిరాకరించి, ఉద్యమంలో పాల్గొన్నారు.[43]

దీనికి స్పందనగా బ్రిటిషు వారు, కరస్పాండెన్స్ సెన్సార్షిప్ విధించడం, కాంగ్రెసునూ దాని అసోసియేట్ సంస్థలనూ చట్టవిరుద్ధమని ప్రకటించడంతో సహా, మరిన్ని చట్టాలు తెచ్చారు. ఆ చర్యలేవీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని అదుపు చెయ్యలేకపోయాయి.[44] కలకత్తా, కరాచీ, గుజరాత్‌ లలో హింస వ్యాప్తి చెందింది. సహాయ నిరాకరణోద్యమంలో హింస చెలరేగిన తరువాత గాంధీ సత్యాగ్రహాన్ని సస్పెండ్ చేసినట్లుగా కాకుండా, ఈసారి గాంధీ హింస పట్ల "అచలంగా" ఉన్నాడు. హింస అంతం కావాలని విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో చిట్టగాంగ్‌లో మృతులైన ఉద్యమకారులకు నివాళు లర్పించాడు. వారి కుమారులు చేసిన త్యాగాలకు గాను వారి తల్లిదండ్రులను అభినందించాడు. ". . ఒక యోధుడి మరణం దుఃఖం కలిగించే విషయం కానే కాదు." అని ప్రకటించాడు [45]

1929 నుండి 1931 వరకు శాసనోల్లంఘన ఉద్యమం మొదటి దశలో బ్రిటన్లో లేబర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ధరసానాలో కొట్టడం, పెషావర్ వద్ద కాల్పులు, సోలాపూర్ వద్ద కొట్టడం, ఉరితీయడం, సామూహిక అరెస్టులు, మరెన్నో అణచివేత చర్యలు కార్మిక ప్రధాన మంత్రి రామ్సే మెక్డొనాల్డ్ అతని స్టేట్ సెక్రెటరీ విలియం వెడ్గ్వుడ్ బెన్ ల ఆధ్వర్యంలో జరిగాయి. భారతదేశంలో ట్రేడ్ యూనియన్ వాదంపై నిరంతర దాడికి ప్రభుత్వం కూడా సహకరించింది.[46] కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా "భారీ పెట్టుబడిదారులూ, ప్రభుత్వమూ చేసిన ఎదురుదాడి" అని సుమిత్ సర్కార్ దీన్ని అభివర్ణించాడు.[47]

కిస్సా ఖ్వానీ బజార్ ఊచకోత

మార్చు
 
మహాత్మా గాంధీతో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్

పెషావర్లో సత్యాగ్రహానికి గాంధీకి చెందిన ముస్లిం పష్తూన్ శిష్యుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వం వహించాడు. అతను ఖుదాయి ఖిద్మత్‌గార్ అనే 50,000 మంది అహింసా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాడు.[48] 1930 ఏప్రిల్ 23 న గఫార్ ఖాన్ అరెస్టయ్యాడు. పెషావర్ లోని కిస్సా కహానీ బజార్లో (కథకుల బజారు) ఖుదాయి ఖిద్మత్‌గార్ గుంపు గుమిగూడింది. నిరాయుధులైన జనంపై మెషిన్ గన్లతో కాల్పులు జరపాలని బ్రిటిషు వారు రాయల్ గర్హ్వాల్ రైఫిల్స్ కు చెందిన 2/18 బెటాలియన్ సైనికులను ఆదేశించారు. 200-250 మంది పష్తూన్ సత్యాగ్రహులు మరణించారు.[49] వారంతా అహింసా శిక్షణకు అనుగుణంగా వ్యవహరించారు. దళాలు వారిపై కాల్పులు జరపుతోంటే, ఇష్టపూర్వకంగా బుల్లెట్లకు ఎదురు నిలిచారు. ఒక బ్రిటిషు ఇండియన్ ఆర్మీ సైనికుడు చంద్ర సింగ్ గర్హ్వాలి, ప్రఖ్యాత రాయల్ గర్హ్వాల్ రైఫిల్స్ దళాలు జనంపై కాల్పులు జరపడానికి నిరాకరించాయి. ఆ ప్లాటూన్ మొత్తాన్నీ అరెస్టు చేసారు. వారిలో చాలామందికి జీవిత ఖైదుతో సహా భారీ జరిమానాలు విధించారు.[49]

ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర

మార్చు

దండి మార్చి‌లో మహాత్ముడితో పాటు 79 మంది అనుచరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి యెర్నేని సుబ్రహ్మణ్యం. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.[50]

నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దండు నారాయణరాజును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించాడు. ఉప్పు సత్యాగ్రహం సమయంలోనే 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి అనే గేయకవితను రాశాడు. మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో తెలుగులోకి అనువదించిన క్రొవ్విడి లింగరాజు, ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు. [51]

బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే 'ఆంధ్రా దండి'గా పిలుస్తారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంలోనే కేంద్ర శాసన సభకు రామదాసు పంతులు, శాసన మండలి సభ్యత్వానికి స్వామి వెంకటాచలం రాజీనామాలు చేశారు. ఉప్పు చట్టాలను ఉల్లఘించి బులుసు సాంబమూర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ (మాలపల్లి నవల రచయిత), ఖాసా సుబ్బారావు లాఠీ దెబ్బలు తిన్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని తన నివాసం వేదవనంలో సత్యాగ్రహ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం, శ్రీకాకుళం జిల్లా బారువలో నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు, మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు, రాయలసీమ పరిధిలో కల్లూరి సుబ్బారావు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. నెల్లూరులోని మైపాడు బీచ్‌లో బెజవాడ గోపాలరెడ్డి ఉప్పు తయారు చేసి ప్రజలకు అమ్మాడు.

ధరసానా సత్యాగ్రహం, ఆ తరువాత

మార్చు

భారతదేశం అంతటా జరిగిన పరిణామాలతో సన్నిహితంగా ఉంటూ ఉన్నప్పటికీ, దండి యాత్ర తరువాత గాంధీ స్వయంగా చురుగ్గా పాల్గొనలేదు. దండి దగ్గర తాత్కాలిక ఆశ్రమాన్ని సృష్టించాడు. అక్కడి నుంచి బొంబాయిలోని మహిళా అనుచరులను మద్యం షాపులు, విదేశీ వస్త్రాల దుకాణాల వద్ద పికెటింగు చెయ్యమని కోరాడు. "విదేశీ వస్త్రాలతో భోగి మంటలు వేయాలి. పాఠశాలలు, కళాశాలలు ఖాళీగా ఉండాలి." అని అన్నాడు.[45]

తన తదుపరి ప్రధాన చర్యగా మహాత్మా గాంధీ, దండికి దక్షిణంగా 40 కి.మీ. దూరాన ఉన్న ధరసానా సాల్ట్ వర్క్స్ పై దాడి చెయ్యాలని నిర్ణయించాడు. అతను లార్డ్ ఇర్విన్‌కు లేఖ రాశాడు, మళ్ళీ తన ప్రణాళికలను చెప్పాడు. మే 4 అర్ధరాత్రి సమయంలో, గాంధీ ఒక మామిడి తోటలో నిద్రిస్తున్నప్పుడు, సూరత్ జిల్లా మేజిస్ట్రేటు ఇద్దరు భారతీయ అధికారులు, ముప్పై మంది సాయుధ కానిస్టేబుళ్లతో కలిసి వెళ్లాడు.[52] చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులకు జైలు శిక్ష విధించాలనే 1827 నిబంధన ప్రకారం అతన్ని అరెస్టు చేశారు. ఏ విచారణా లేకుండా పూనా సమీపంలో జైల్లో ఉంచారు.

ధరసానా సత్యాగ్రహం ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగింది. డెబ్బై ఆరేళ్ల రిటైర్డ్ జడ్జి అబ్బాస్ త్యాబ్జీ, గాంధీ భార్య కస్తూర్బాతో కలిసి సత్యగ్రహానికి నాయకత్వం వహించాడు. ధరసానా చేరుకునే ముందు ఇద్దరినీ అరెస్టు చేసి మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారి అరెస్టుల తరువాత మహిళా కవి, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజిని నాయుడు నాయకత్వంలో ఈ కవాతు కొనసాగింది. "మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపయోగించకూడదు. మిమ్మల్ని కొడతారు, కానీ మీరు ప్రతిఘటించకూడదు: దెబ్బలను తప్పించుకోడానికి మీరు చేతిని అడ్డుపెట్టడం కూడా చెయ్యకూడదు." అని ఆమె సత్యాగ్రహులను హెచ్చరించారు. సైనికులు సత్యాగ్రహాలను ఇనప పొన్ను ఉన్న కర్రలతో కొట్టారు. ఈ సంఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. యునైటెడ్ ప్రెస్ కరస్పాండెంట్ వెబ్ మిల్లర్ ఇలా నివేదించాడు:

సత్యాగ్రహుల్లో ఒక్కరు కూడా దెబ్బలను అడ్డుకోడానికి ఒక చేయి ఎత్తలేదు. వారు పది పిన్స్ లాగా పడిపోయారు. ఏ ఆచ్ఛాదనా లేని తలలపై కర్రల దెబ్బలు చేసే వికృత శబ్దాలు నేనున్న చోటికి వినబడుతూనే ఉన్నాయి. దెబ్బ దెబ్బకూ చూస్తున్న ప్రేక్షకుల శ్వాసలో సానుభూతితో మూలుగు వినబడింది. దెబ్బ తగిలినవారు అపస్మారక స్థితిలో, పగిలిన పుర్రెలతో, విరిగిన భుజాలతో, తీవ్రమైన నొప్పితో పడిపోయారు. రెండు మూడు నిమిషాల్లోనే భూమి దేహాలతో నిండిపోయింది. వారి తెల్లటి బట్టలపై రక్తం మరకలు విస్తరించాయి. ఇంకా దెబ్బలు తగలని సత్యాగ్రహులు చెల్లాచెదురవకుండా మొండిగా, నిశ్శబ్దంగా ముందుకు నడుచుకుంటూనే పోయారు -తమకూ దెబ్బలు తగిలేదాకా. వాళ్ళు ఎదురు తిరగక పోవడంతో పోలీసులు రెచ్చిపోయారు. కూర్చుండి పోయిన వారిని పొట్టలోనూ, వృషణాల పైనా క్రూరంగా తన్నడం ప్రారంభించారు. గాయపడిన పురుషులు బాధతో లుంగలు చుట్టుకు పోతోంటే, పోలీసుల ఆగ్రహం పెచ్చుమీరుతున్నట్లు కనిపించింది. పోలీసులు కూర్చుండిపోయిన వారిని చేతులూ, కాళ్ళూ పట్టుకుని లాక్కుపోయారు. కొన్నిసార్లు వంద గజాల వరకు లాక్కుపోయి వారిని గుంటల్లో పడవేసారు.[53]

ఇదంతా గమనించిన కేంద్ర శాసనసభ మాజీ స్పీకర్ విఠల్‌భాయ్ పటేల్, "బ్రిటిషు సామ్రాజ్యంతో భారతదేశం రాజీపడడమనే ఆశ శాశ్వతంగా పోయినట్లే" అని వ్యాఖ్యానించాడు.[54] ఈ కథను ఇంగ్లండ్‌లోని తన ప్రచురణకర్తకు టెలిగ్రాఫ్ చేయడానికి మిల్లర్ చేసిన మొదటి ప్రయత్నాలను భారతదేశంలోని బ్రిటిషు టెలిగ్రాఫ్ ఆపరేటర్లు సెన్సార్ చేశారు. బ్రిటిషు సెన్సార్‌షిప్‌ను బయట పెడతామని అతడు బెదిరించడంతో అతని కథను పంపించడానికి అనుమతించారు. ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా 1,350 వార్తాపత్రికలలో కనిపించింది. అమెరికా సెనేటర్ జాన్ జె. బ్లెయిన్ దీన్ని సెనేట్‌లో చదవగా అది సెనేట్ అధికారిక రికార్డులోకి చేరింది.[55] ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో ఉప్పు సత్యాగ్రహం విజయవంతమైంది. మార్చి‌ని చూపించే న్యూస్‌రీళ్ళను లక్షలాది మంది చూశారు. టైమ్ పత్రిక గాంధీని తన 1930 మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. గాంధీ మార్చి‌ని "కొంతమంది న్యూ ఇంగ్లాండ్ వాసులు ఒకప్పుడు బ్రిటిషు టీ పన్నును ధిక్కరించినట్లుగా వీళ్ళు బ్రిటిషు ఉప్పు పన్నును ధిక్కరించారు" అని పోల్చింది.[56] చివరకు, 1931 ఆరంభంలో ఇర్విన్‌తో చర్చలు జరపడానికి గాంధీ జైలు నుండి విడుదలయ్యే వరకు శాసనోల్లంఘన కొనసాగింది. ఇద్దరూ సమాన ఫాయీలో చర్చలు జరపడం ఇదే మొదటిసారి.[57] ఇది గాంధీ-ఇర్విన్ ఒప్పందానికి దారితీసింది. ఈ చర్చలు 1931 చివరిలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి దారి తీసాయి.

దీర్ఘకాలిక ప్రభావం

మార్చు
 
సాల్ట్ మార్చి‌కు అంకితం చేసిన 2005 నాటి స్టాంప్ షీట్.

ఉప్పు సత్యాగ్రహం తరువాత భారతదేశానికి డొమినియన్ ఏర్పాటు వైపు గాని, స్వయం పాలన వైపు గానీ తక్షణ పురోగతి ఏమీ జరగలేదు. బ్రిటిషు వారు పెద్దగా విధానపరమైన రాయితీలేమీ ఇవ్వలేదు.[58] ముస్లింల మద్దతును ఈ సత్యాగ్రహం పెద్దగా ఆకర్షించలేదు కూడా.[59] సత్యాగ్రహాన్ని తమ అధికారిక విధానంగా ముగింపు పలకాలని 1934 లో కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. నెహ్రూ తదితర కాంగ్రెస్ సభ్యులు గాంధీ నుండి దూరంగా జరిగారు. మరింత నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి గాంధీ, కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. హరిజన్ ఉద్యమం ద్వారా అంటరానితనాన్ని అంతం చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆయన కార్యక్రమాల్లో ఒకటి.[60] అయితే, 1930 ల మధ్య నాటికి బ్రిటిషు అధికారులు మళ్లీ నియంత్రణ సాధించినప్పటికీ, సార్వభౌమాధికారం కోసం స్వయం పాలన కోసం గాంధీ, కాంగ్రెస్ పార్టీ వాదనల లోని చట్టబద్ధతను భారత్‌, బ్రిటన్‌లే కాక, యావత్తు ప్రపంచమూ గుర్తించడం మొదలైంది.[61] 1930 ల నాటి సత్యగ్రహ ఉద్యమాల తరువాత భారతదేశంపై తమకు ఉందనుకుంటున్న నియంత్రణ కేవలం భారతీయుల సమ్మతి పైనే ఆధారపడి ఉందని బ్రిటిషు వారు గుర్తించవలసి వచ్చింది - బ్రిటిషు వారు ఆ సమ్మతిని కోల్పోవడంలో ఉప్పు సత్యాగ్రహం ఒక ముఖ్యమైన దశ.[62]

గాంధీతో తనకున్న అనుబంధం ఉప్పు సత్యాగ్రహంతో ఒక ఉత్కృష్ట స్థాయికి చేరినట్లు నెహ్రూ భావించాడు. భారతీయుల వైఖరిని మార్చడంలో దానికి శాశ్వత ప్రాముఖ్యత ఉందని కూడా భావించాడు:

ఈ ఉద్యమాలు బ్రిటిషు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి, ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాయి. కానీ నా ఉద్దేశంలో, వాటి నిజమైన ప్రాముఖ్యత, మన స్వంత ప్రజలపై, ముఖ్యంగా గ్రామీణులపై అవి చూపిన ప్రభావంలో ఉంది. సహాయ నిరాకరణ వారిని బురద నుండి బయటకు లాగి వారికి ఆత్మగౌరవాన్నీ, స్వావలంబననూ ఇచ్చింది. వారు ధైర్యంగా వ్యవహరించారు. అన్యాయమైన అణచివేతకు అంత తేలికగా లొంగలేదు; వారి దృక్పథం విస్తరించింది. వారు మొత్తం భారతదేశం పరంగా ఆలోచించడం ప్రారంభించారు. ఇది గొప్ప పరివర్తన. గాంధీ నాయకత్వం లోని కాంగ్రెసుకు ఆ ఘనత చెందుతుంది.[63]

ముప్పై సంవత్సరాల తరువాత, ఈ సత్యాగ్రహ ఆయుధం, ఈ దండి యాత్ర అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పైన, 1960 లలో నల్లజాతీయుల పౌర హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం పైనా బలమైన ప్రభావాన్ని చూపాయి:

చాలా మందిలాగే, నేనూ గాంధీ గురించి విన్నాను, కాని నేను అతనిని తీవ్రంగా అధ్యయనం చేయలేదు. నేను చదివినప్పుడు అతని అహింసాయుత నిరసన పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. ముఖ్యంగా అతడి ఉప్పు యాత్రకు, అతని అనేక ఉపవాసాలకూ నేను చలించిపోయాను. అసలు ఈ సత్యాగ్రహ భావనే (సత్య అంటే నిజం. నిజం ప్రేమతో సమానం ఆగ్రహ అంటే శక్తి; అందువలన, సత్యాగ్రహం అంటే సత్యం శక్తి లేదా ప్రేమ శక్తి) నాకు ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది. నేను గాంధీ తత్వాన్ని లోతుగా పరిశోధించినప్పుడు, ప్రేమ శక్తికి సంబంధించిన నా సందేహం క్రమంగా తగ్గిపోయింది. సామాజిక సంస్కరణల రంగంలో దాని శక్తిని నేను మొదటిసారిగా చూశాను.

ఉద్యమ విరమణ

మార్చు
 
గాంధీ, సరోజినీ నాయుడు.

సత్యాగ్రహం నిలిపివేసే అవకాశాలను పరిశీలించమంటూ యరవాడ జైలులోని గాంధీని మితవాదులైన తేజ్ బహదూర్ సప్రూ, జయకర్ కలవగా, కాంగ్రెస్ అధ్యక్షుడైన జవహర్‌లాల్ నెహ్రూదే నిర్ణయం తీసుకునే అధికారమని గాంధీ వారికి చెప్పాడు. జవాహర్‌లాల్, మోతీలాల్ ఉద్యమాన్ని కొనసాగించడమే తమ అభిమతమని గాంధీకి గట్టిగా చెప్పినా వైస్రాయ్‌కి చెప్పి వారిద్దరినీ గాంధీని కలిసేందుకు యరవాడ తీసుకువెళ్ళారు. అయితే చర్చలు ఫలప్రదం కాలేదు.[64] అక్టోబరు 11న ఆరునెలల శిక్షాకాలం పూర్తై జవహర్‌లాల్ విడుదల అయి భూమిశిస్తు కౌళ్ళు, ఆదాయపు పన్నులు నిలిపివేసేలా ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించడంతో పదిరోజుల్లో మళ్ళీ అరెస్టుచేశారు. ఈసారి రెండేళ్ళ కఠిన శిక్ష విధించారు. 1931 ఫిబ్రవరి 6న మోతీలాల్ మరణించాడు. తండ్రి అంత్యక్రియల సందర్భంగా రాజకీయాలలో సమయం వెచ్చించలేని నెహ్రూ తరఫున తనకు తానై స్వంత బాధ్యతతో గాంధీ, గాంధీ-ఇర్విన్ సంధి కుదుర్చుకుని శాసనోల్లంఘనాన్ని నిలిపివేశాడు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, అల్పసంఖ్యాక వర్గాల స్థితి వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగే చర్చలకు కాంగ్రెస్ హాజరవుతుందని అంగీకరించాడు. అందుకు బదులుగా బ్రిటిషు ప్రభుత్వం, హింసాత్మకమైన అభియోగాలు లేనివారి విడుదల, ఉప్పుతయారీకి అనుమతి, శాంతియుతమైన పికెటింగుకు అనుమతి ఇస్తుంది.

జవాహర్‌లాల్‌కు ఈ సంధి ఆమోదయోగ్యం కాలేదు.[65] ఇది స్వాతంత్ర్యాన్ని కాకపోయినా కనీసం పన్నుల చెల్లింపు నిరాకరణలో పాల్గొన్న బార్డోలీ, యుపీ ప్రాంతాల రైతుల నుండి జప్తు చేసిన ఆస్తులను తిరిగి తెచ్చుకోవడం, ఉప్పు తయారీకి, సేకరణకు పూర్తి హక్కులు పొందడం కూడా సాధించలేకపోయింది.[66] కరాచీ కాంగ్రెస్‌ మహాసభలో ఈ అంశంపై జవాహర్ స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టగా, ఉద్యమ విరమణ ఆమోదం పొందింది.

స్మారకం

మార్చు

ఈ ఘటన స్మృతిలో, నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ అనే స్మారక మ్యూజియాన్ని 2019 జనవరి 30 న దండిలో స్థాపించారు

ఇవి కూడా చూడండి

మార్చు

మీడియా

మార్చు
గాంధీ, అనుయాయుల ఉప్పు సత్యాగ్రహ యాత్ర సమయపు, ఒరిజినల్ చిత్రం.

మూలాలు

మార్చు
  1. "National Salt Satyagraha Memorial | List of names" (PDF).
  2. "Mass civil disobedience throughout India followed as millions broke the salt laws", from Dalton's introduction to Gandhi's Civil Disobedience, Gandhi and Dalton, p. 72.
  3. Dalton, p. 92.
  4. Johnson, p. 234.
  5. Ackerman, p. 106.
  6. Martin, p. 35.
  7. Eyewitness Gandhi (1 ed.). London: Dorling Kinderseley Ltd. 2014. p. 44. ISBN 978-0241185667. Retrieved 3 September 2015.
  8. Wolpert, Stanley A. (2001). Gandhi's passion : the life and legacy of Mahatma Gandhi. Oxford University Press. pp. 141. ISBN 019513060X. OCLC 252581969.
  9. 9.0 9.1 9.2 Ackerman, p. 83.
  10. Dalton, p. 91.
  11. Dalton, p. 100.
  12. "Nehru, who had been skeptical about salt as the primary focus of the campaign, realized how wrong he was ..." Johnson, p. 32.
  13. 13.0 13.1 13.2 Gandhi, Gopalkrishna. "The Great Dandi March — eighty years after", The Hindu, 5 April 1930
  14. Letter to London on 20 February 1930. Ackerman, p. 84.
  15. Gross, David M. (2014). 99 Tactics of Successful Tax Resistance Campaigns. Picket Line Press. p. 64. ISBN 978-1490572741.
  16. 16.0 16.1 16.2 Gandhi and Dalton, p. 72.
  17. 17.0 17.1 "Chronology: Event Detail Page". Gandhi Heritage Portal. 15 June 2012. Retrieved 16 August 2018.
  18. Dalton, p. 113.
  19. Dalton, p. 108.
  20. Dalton, p. 107.
  21. Dalton, p. 104.
  22. Dalton, p. 105.
  23. Ackerman, p. 85.
  24. "The Collected Works of Mahatma Gandhi". Gandhi Heritage Portal. Retrieved 16 August 2018.
  25. Gandhi's letter to Irwin, Gandhi and Dalton, p. 78.
  26. "Parliament Museum, New Delhi, India – Official website – Dandi March VR Video". Parliamentmuseum.org. Archived from the original on 23 మే 2012. Retrieved 1 August 2012.
  27. Miller, Herbert A. (23 April 1930) "Gandhi's Campaign Begins", The Nation.
  28. Dalton, p. 107
  29. Weber, p. 140.
  30. The Statesman, 13 March 1930.
  31. 31.0 31.1 31.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; వెబ్ మూలము అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  32. Weber, pp. 143–144.
  33. 33.0 33.1 Ackerman, p. 86.
  34. Dalton, p. 221.
  35. Collected Works of Mahatma Gandhi 43: 180, Wolpert, p. 148
  36. 36.0 36.1 Jack, pp. 238–239.
  37. "The Collected Works of Mahatma Gandhi". Gandhi Heritage Portal. Retrieved 2018-08-16.
  38. Jack, p. 240.
  39. "Mapping the unknown marcher". The Indian Express. 9 February 2014. Retrieved 16 August 2018.
  40. "Chronology: Event Detail Page". Gandhi Heritage Portal. 15 June 2012. Retrieved 16 August 2018.
  41. "Photos: Remembering the 80 unsung heroes of Mahatma Gandhi's Dandi March". The Indian Express. 9 February 2014. Retrieved 16 August 2018.
  42. "The Salt Satyagraha in the meantime grew almost spontaneously into a mass satyagraha." Habib, p. 57.
  43. Habib, p. 57.
  44. "Correspondence came under censorship, the Congress and its associate organizations were declared illegal, and their funds made subject to seizure. These measures did not appear to have any effect on the movement..." Habib, p. 57.
  45. 45.0 45.1 Wolpert, p. 149.
  46. Newsinger, John (2006). The Blood Never Dried: A People's History of the British Empire. Bookmarks Publications. p. 144.
  47. Sarkar, S (1983). Modern India 1885–1947. Basingstoke. p. 271.
  48. Habib, p. 55.
  49. 49.0 49.1 Habib, p. 56.
  50. "దండి మార్చ్: గాంధీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో నడిచిన తెలుగు వ్యక్తి ఎవరు?". BBC News తెలుగు. Archived from the original on 2021-03-27. Retrieved 2021-10-30.
  51. "ఉప్పు సత్యాగ్రహం". Sakshi. 2016-12-05. Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-30.
  52. Jack, pp. 244–245.
  53. Webb Miller's report from May 21, Martin, p. 38.
  54. Wolpert, p. 155.
  55. Singhal, Arvind (2014). "Mahatma is the Message: Gandhi's Life as Consummate Communicator". International Journal of Communication and Social Research. 2 (1): 4.
  56. "Man of the Year, 1930". Time. 5 January 1931. Archived from the original on 24 డిసెంబరు 2007. Retrieved 17 November 2007.
  57. Gandhi and Dalton, p. 73.
  58. Ackerman, p. 106: "...made scant progress toward either dominion status within the empire or outright sovereignty and self-rule. Neither had they won any major concessions on the economic and mundane issues that Gandhi considered vital."
  59. Dalton, p. 119-120.
  60. Johnson, p. 36.
  61. "Indian, British, and world opinion increasingly recognized the legitimate claims of Gandhi and Congress for Indian independence." Johnson, p. 37.
  62. Ackerman, p. 109: "The old order, in which British control rested comfortably on Indian acquiescence, had been sundered. In the midst of civil disobedience, Sir Charles Innes, a provincial governor, circulated his analysis of events to his colleagues. "England can hold India only by consent," he conceded. "We can't rule it by the sword." The British lost that consent...."
  63. Johnson, p. 37.
  64. సర్వేపల్లి గోపాల్ 1993, p. 128.
  65. సర్వేపల్లి గోపాల్ 1993, p. 133.
  66. సర్వేపల్లి గోపాల్ 1993, p. 134.