మామిడాల రాములు

మామిడాల రాములు వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్.[1] ఏరోస్పేస్ విభాగంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాడు. అమెరికా రక్షణ విభాగానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు.

మామిడాల రాములు
జననం
తరిగొప్పుల, వరంగల్ జిల్లా, తెలంగాణా
విద్యబి. ఇ, ఎంటెక్, పి. హెచ్. డి
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం, ఐఐటీ ఢిల్లీ, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం
వృత్తిమెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

రాములు నల్గొండ/వరంగల్ జిల్లా, జనగాం సమీపంలో ఉన్న తరిగొప్పుల గ్రామంలో జన్మించాడు.[2] తాత ముత్తాలది రజక వృత్తి. ఈయన ఆ వృత్తిని ఎంచుకోకుండా చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నాడు. కొద్ది రోజులు బచ్చన్నపేటకు వెళ్ళి అక్కడ అక్క వరసయ్యే ఒక బంధువు ఇంట్లో ఉంటూ పనిచేసుకుంటూ కొద్ది రోజులు చదువుకున్నాడు. మళ్ళీ తండ్రి అనుమతితో స్వగ్రామానికి వచ్చి ఐదవ తరగతి దాకా స్థానిక పాఠశాలలో చదివాడు. ప్రతి తరగతిలోను మొదటి స్థానంలో నిలిచేవాడు. ఊరివాళ్ళ ప్రభావంతో తండ్రి తనను చదువు ఎక్కడ మానిపిస్తాడోనని ప్రాథమిక విద్య తర్వాత నర్మెట్ల అనే గ్రామం వెళ్ళాడు. హైస్కూలు చదువు కోసం జనగాం వచ్చి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పూర్తయిపోవడంతో ఆంధ్రభాషా వర్ధిని ఉన్నత పాఠశాల లో చేరాడు. కూలిపని చేసి అక్కడ ఫీజు కట్టేవాడు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండటంతో గౌరిపెద్ది రామారావు అనే ఉపాధ్యాయుడు ఈయన ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. ఆయన సలహాతో గణితం, సామాన్య శాస్త్రం తో పాటు సంస్కృతాన్ని కూడా అభ్యసించాడు. తర్వాత రామారావు సలహాతోనే ఆ ఊర్లోని సంపన్నుల పిల్లలకు ట్యూషన్లు చెప్పి తన ఖర్చుల కోసం డబ్బు సంపాదించుకున్నాడు. మరో స్నేహితుడి సాయంతో హరిజన్ సేవక్ సంఘ్ వసతి గృహంలో స్థానం సంపాదించాడు.

హెచ్. ఎస్. సి లో జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఒకడిగా నిలిచాడు రాములు. మొదట్లో ఎవరూ మార్గ నిర్దేశం చేసేవారు లేకపోవడంతో ఐటిఐ లో చేరాడు. అక్కడి ఉపాధ్యాయుడు ఈయన మార్కులు చూసి ఆశ్చర్యపోయి ఇంకా ఏదైనా మంచి కోర్సులో చేరమని అక్కడి నుంచి పంపించేశాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాదుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఏ పని చేయాలో పాలుపోక మౌలాలి రైల్వే క్వార్టర్ల నిర్మాణంలో పని చేస్తున్న తన పక్కఊరి వాళ్ళ సహాయంతో కూలి పనికి చేరాడు. పీయూసీలో సీటు, దారుషఫాలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్థానం సంపాదించాడు. ఉపకారవేతనం కూడా లభించింది. పీయూసీ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంజనీరింగ్ లో మొదటి జాబితాలో సీటు వచ్చింది. కానీ ఫీజు కట్టడానికి చేతిలో డబ్బుల్లేవు. బి. ఎస్. సి లో చేరాడు. హాస్టల్లోని విద్యార్థులు కొంతమంది ఇతని ప్రతిభను గమనించి ఇంజనీరింగ్ లో చేరడానికి కావలసిన డబ్బులు సమకూర్చి ఇచ్చారు. ట్యూషన్లు చెప్పుకుంటూ అప్పు తీర్చమని మార్గం చెప్పారు. దాంతో బి. ఎస్. సి నుంచి ఇంజనీరింగ్ కి మారాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో కూడా తను చదువుకుంటున్న కాలేజీలోనే కూలీ పనులకు వెళ్ళేవాడు. ప్రొఫెసర్లు మందలించి మరిన్ని ట్యూషన్లు చెప్పుకోమని సలహా ఇచ్చారు. అలా నాలుగేళ్ళు కష్టపడి ఇంజనీరింగ్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

పోలీస్ విచారణసవరించు

కళాశాలలో ఉన్నపుడే జార్జ్ రెడ్డి, జంపాల తదితరులతో కలిసి విద్యార్థి విప్లవ సంస్థయైన పి. డి. ఎస్. యు లో చురుగ్గా పాల్గొన్నాడు. జార్జ్ రెడ్డి మరణించినపుడు రాములు జీవనాడి అనే పత్రికలో నిప్పురవ్వ పేరుతో రాసిన కవితలు మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు పొందాయి. అదే సమయంలో రాములు ఉద్యమ చరిత్ర మీద పోలీసు విచారణ మొదలైంది. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం పూర్తి కాగానే ఏదో సంఘటన విషయంలో ఇతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు ఇతను పని చేస్తున్న ఇనిస్టిట్యూట్ కు వచ్చారు. కానీ ఆ సంస్థ యజమాని మిత్రా ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని చెప్పడంతో గండం గడిచింది. అప్పటి ఎం. పి జి. వెంకటస్వామి పోలీసులకు సర్ది చెప్పడంతో కేసుల నుంచి బయటపడ్డాడు.

పురస్కారాలుసవరించు

  1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయబడింది.[3][4][5]

మూలాలుసవరించు

  1. "Ramulu Mamidala". Mechanical Engineering, Univeristy of Washington. Univeristy of Washington. Retrieved 15 April 2018.
  2. గోవర్ధనం, కిరణ్ కుమార్. "శభాషయ్యా రాములయ్యా". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 15 April 2018.
  3. నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 17 June 2018. Retrieved 4 September 2019.
  4. ఆంధ్రజ్యోతి (31 May 2018). "విశిష్ట పురస్కారాలు". Retrieved 4 September 2019.[permanent dead link]
  5. మనం న్యూస్ (6 June 2018). "తెలంగాణ కళకు ఘనసత్కారం". Retrieved 4 September 2019.[permanent dead link]