మారీచుడు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఇది రామాయణ గాథ. మారీచుడు తాటకి కొడుకు. సుబాహుని అన్న. మిక్కిలి జిత్తుల మారి. విశ్వామిత్రుడు యాగమును చేయ యత్నింపఁగా మారీచ సుబాహువులు ఆయజ్ఞమునకు విఘ్నము చేయ వచ్చిరి. అపుడు విశ్వామిత్రుడు అయోధ్యకు పోయి దశరథుని అడిగి రామలక్ష్మణులను పిలుచుకొనివచ్చి తన యాగమునకు విఘ్నముచేయ వచ్చువారిని సంహరింపుము అని చెప్పగా, రాముడు ఆగ్నేయాస్త్రము ప్రయోగించి సుబాహుని చంపి, శీతేషాస్త్రమును ప్రయోగించి మారీచుని సముద్రమున పడునట్లు చేసెను. అంతట మారీచుడు రాముని పరాక్రమము ఎఱిగినవాఁడు అయి అతని తెరువుకు పోరాదు అని దక్షిణసముద్రతీరమున ఆశ్రమముకావించుకొని అచ్చట తపస్సు చేయుచు ఉండెను. అనంతరము వనవాసము చేయవచ్చిన రాముడు దండకారణ్యమున ఉండగా, రావణుఁడు అతని భార్య సీతను ఎత్తుకొని పోవుటకు ఈమారీచుని సహాయము కోరెను. అప్పుడు మారీచుడు రాముని పరాక్రమమును వానికి తెలిపి ఆకార్యము వలదు అని బహు విధంబులుగ వానికి బోధించియు వాడు వినకపోయినందున ఎట్ట కేలకు రావణుని మాటకు కట్టు బడి తాను ఒక బంగారు జింక అయి రాముని ఆశ్రమమునకు ఎదుట పచ్చిక మేయుచు ఉండెను. సీత దానిని చూచి దాని రూపరేఖాలావణ్యాది గుణములకు సంతసిల్లి తోడనే ప్రియునకు తెలిపి దానిని తనకు పట్టి ఇయ్యవలయును అని ప్రార్థించెను. అంతట రాముడు దానిని పట్టబోయి అది తనకు చిక్కక పరుగెత్తఁగా దానిని తఱుముకొని బహుదూరము పోయి మాయామృగము అని తెలిసికొని బాణప్రయోగము చేయగా మారీచుడు నిజరూపమును పొంది "హా ........ సీత హా ....... లక్ష్మణ" అని అఱచుచు ప్రాణములు విడిచెను. ఆకూతవిని సీత దిగులుపడి రామునకు ఏమో ఆపద పొసఁగినట్లు ఉన్నది, నీవు పోయి ఆ ఆపద తొలఁగించి పిలుచుకొని రమ్ము అని లక్ష్మణుని పంపెను. ఆసమయమున ఒంటరిగా ఉండెడు ఆమెవద్దకు సన్యాసివేషముతో రావణుడు వచ్చి ఆమెను ఎత్తుకొని పోయెను. ఆకారణంగా రామాయణ గాథలో మారీచుని పాత్ర ఒక ప్రధానమైనదిగా ఉంది. రామునిచే తరమబడినవాడు.