ముక్త్యాల రాజా వాసిరెడ్డి

ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్రదేశంలో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశానికి చెందినవాడు[1].ఈతనిని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ కు తలమానికమగు నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు.తొలుత ఇతను కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి కృషిచేసాడు.[2] ఈ ప్రాజెక్టు పూర్తికాబడి ఉపయోగంలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు సన్నాహాలు చేయుట మొదలుపెట్టింది. తొలుత కృష్ణా పెన్నా నదులను సంధించుటకు తలపెట్టింది. ఇది తెలిసి మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. మాచర్ల నుండి దట్టమయిన అడవులగుండా నందికొండ వరకు వెళ్ళి డాం నకు అనువైన స్థలం చూశాడు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచే ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించాడు[3]. మద్రాసు ప్రభుత్వం వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయంను దాటవేయుటకు ప్రయత్నించారు. దీని వెనుక ఎవరున్నారో రాజాగారికి అర్ధమయింది. వారు వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి కార్లు వెళ్ళుటకు వీలగు దారి ఏర్పాటుచేయించాడు. ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చారు.

ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నాలు మొదలైనవి.మహేశ్వర ప్రసాద్ ఢిల్లే వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు.

అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశాడు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నిర్మాణ సమయంలో మహేశ్వర ప్రసాద్ యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చాడు. 1966 ఆగస్టు 3న డాం నుండి నీరు వదిలారు.

నాగార్జునసాగర్ డాం ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యంగా సాగర్ ఆయకట్టు రైతులకు మహేశ్వర ప్రసాద్ బహుధా స్మరణీయులు.కాని రాజావారి సేవలను తర్వాతి తరం వారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గుర్తించలేదు, సరిగదా పూర్తిగా మరచారు. రాజా మహేశ్వర ప్రసాదుకు ఇందిరా దేవి అను కుమార్తె ఉంది. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త, పూర్వ ఐ.సి.యస్ ఉద్యోగి వెలగపూడి రామకృష్ణ కుమారుడు దత్తును పెండ్లాడారు.

చిత్రమాలి

మార్చు

మూలాలు

మార్చు
  1. టి. గౌరీశంకర్, ముక్త్యాల దీపం: రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారి జీవిత చరిత్ర, రాణి భవానీదేవి మెమోరియల్ ట్రస్ట్, 1988
  2. Cusecs candidate By K. L. Rao పేజీ.31
  3. Nagarjuna Sagar: the epic of a great temple of humanity : world's largest masonry dam; M. Gopal Rao; Bharatiya Vidya Bhavan, 1979

వనరులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.