ముఖ కండరాలు

కపాల నాడి ద్వారా సరఫరా అయ్యే స్ట్రైటెడ్ అస్థిపంజర కండరాలు సమూహం

ముఖ కండరాలు ముఖనాడి (కపాల నాడి VII) ద్వారా సంజ్ఞలు గ్రహించి పనిచేసే చారల (స్ట్రైయేటెడ్) అస్థి కండరాల సమూహం. కనులు మూయడం, నోటిని మూసి ఉంచడం, ఆహారం నములునపుడు నములు కండరాలకు సహకరించడం, ఊళవేయడం వంటి ఇతర పనులతోపాటు, ముఖములో వివిధ కండరాల వలన ముఖంలో చలనాలు, ముఖ కవళికలు కలుగుతాయి. ముఖకవళికలను ముఖకండరాలు నియంత్రిస్తాయి.[1]ముఖనాడిలో ఏ కారణమువలనైనా స్తంభనం కలిగితే ఆ వైపు ముఖకండరాలు ఇచ్ఛా చలనాలు కోల్పోయి ముఖ పక్షవాతానికి గురి అవుతాయి. ఈ కండరాలను అనుకరణ కండరాలు అని కూడా అంటారు. అన్ని సకశేరుకాలలో (వెన్నెముక కల జంతువులు) కనిపించే న్యూరల్ క్రెస్ట్ కణాల నుండి ఉద్భవించినా ముఖ కండరాలు క్షీరదాలలో మాత్రమే కనిపిస్తాయి. చర్మానికి అతుక్కొనే కండరాలు ముఖకండరాలు మాత్రమే.[2] మిగిలిన అస్థి కండరాలు కీళ్ళకు ఇరుప్రక్కల ఉండే ఎముకలకు అతుక్కొని ఉండడం వలన అవి సంకోచించినపుడు కీళ్ళలో చలనాలు కలిగిస్తాయి. ముఖ కండరాలు సంకోచించినపుడు ముఖముపై ఉన్న చర్మములో చలనం కలిగిస్తాయి.

Facial muscles
Head
Lateral head anatomy
వివరములు
లాటిన్musculi faciei
facial nerve
Identifiers
TAA04.1.03.001
FMA71288
Anatomical terms of muscle

నిర్మాణం

మార్చు

ముఖ కండరాలు చర్మం క్రింద (సబ్క్యు టేనియస్) ఉండి ముఖ కవళికలను నియంత్రిస్తాయి. అవి సాధారణంగా పుర్రె ఎముక ఉపరితలం నుంచి (అరుదుగా అంటిపట్టుకొన్న తంతుయుత కణజాలం నుండి) ఉద్భవించి ముఖ చర్మంలో చొప్పించబడతాయి. అవి సంకోచించినప్పుడు, చర్మం కదులుతుంది. ఈ కండరాలు అవి పయనించే దిశకు లంబకోణంలో ముడుతలు కలిగిస్తాయి.[3]

నరాలు

మార్చు

ముఖ కండరాలకు ముఖనాడి (కపాల నాడి VII) ద్వారా సంజ్ఞలు అందుతాయి, ప్రతి ముఖనాడి ఆ వైపు ఉన్న ముఖకండరాలపై పనిచేస్తుంది.[4] కాని సమీపంలో ఉన్న నమలు కండరాలు త్రిభుజాకార నాడి (కపాల నాడి V) శాఖ అయిన అధోహనువు నాడి (మాండిబ్యులార్ నెర్వ్) ద్వారా సంజ్ఞలు గ్రహిస్తాయి..

ముఖ్యమైన కొన్ని ముఖ కండరాలు

మార్చు

పృష్ఠశిర లలాట కండరాలు ( ఆక్సిపిటో ఫ్రాంటాలిస్ )

మార్చు
 

ఈ కండరములు తల వెనుక భాగం నుంచి నుదుటికి వ్యాపిస్తాయి. ఈ కండరముల లలాట భాగాలు కనుబొమలను పైకెత్తుటకు, నుదుటిలో ముడుతలు కలిగించుటకు ఉపయోగపడుతాయి.

నేత్రమండలిక ( ఆర్బిక్యులారిస్ ఆక్యులై ) కండరాలు

మార్చు

ఈ కండరపు పోగులు కనుగుంటల చుట్టూ మండలాకారాములో ఉంటాయి. ఇవి కన్నులు గట్టిగా మూసుకొనుటకు తోడ్పడుతాయి .

భ్రుకుటి కండరాలు ( కారుగేటర్ సూపర్ సిల్లై కండరాలు )

మార్చు

ఇవి కనుబొమల లోభాగం వద్ద ఉంటాయి. ఈ కండరాలు కనుబొమలు ముడివేయుటకు తోడ్పడుతాయి.

వక్త్రమండలిక కండరం ( ఆర్బిక్యులారిస్ ఓరిస్ )

మార్చు

నోటి చుట్టూ వివిధ దిశలలో పోగులు ఉండి పెదవుల చుట్టూ ఉండే యీ కండరం పెదవులను ముడుచుటకు, ఊళవేయుటకు, సన్నాయి, వేణువుల వాయిద్యాలు వాడటానికి ఉపయోగపడుతుంది. చొంగ కారుటను అరికడుతుంది.

వక్త్రకోణ నిమ్న కండరాలు ( డిప్రెస్సర్ ఏంగులై ఓరిస్ )

మార్చు

ఈ కండరాలు కనుబొమలు ముడిచి నపుడు పెదవి కోణాలను క్రిందకు లాగుతాయి.

అధరోద్ధరణ కండరాలు ( లెవేటర్ లేబై సుపీరియారిస్ )

మార్చు

ఈ కండరాలు పై పెదవిని మీదకు చలింప జేస్తాయి.

వక్త్రకోణ ఉద్ధరణ కండరాలు ( లెవేటర్ ఏంగులై ఓరిస్ )

మార్చు

ముఖానికు చెరివైపు ఉండే ఈ కండరం ఆ ప్రక్క నోటి కోణమును ముక్కువైపు మీదకు లాగుటకు ఉపయోగపడుతుంది. ఇది విచారములో ఉన్నపుడు ముక్కు నుండి నోటి వరకు ఉండే ముడతను కలిగిస్తుంది.

కపోలికలు ( బుగ్గ కండరాలు; బక్సినేటర్ )

మార్చు

ఇవి బుగ్గలలో ఉండే కండరాలు. బుగ్గలను దంతాలకు అదిమి ఉంచి ఆహారం నములటానికి ఉపయోగపడుతాయి. ఊళ వేయుటకు, సన్నాయి వంటి వాద్యపరికరాలు వాయించుటకు కూడ కపోలిక కండరాలు ఉపయోగపడతాయి.

చిబుక కండరాలు ( మెంటాలిస్ కండరాలు )

మార్చు

మూతి ముడుచుకొనుటకు, పెదవి విఱుచుటకు ఈ కండరాలు ఉపయోగపడుతాయి.

కుడి ముఖకండరాలకు కుడి ముఖనాడి, ఎడమ ముఖకండరాలకు ఎడమ ముఖనాడి నాడీప్రసరణ సమకూరుస్తాయి.

మెదడు నుంచి సంజ్ఞలు నాడులలో విద్యుత్తు ద్వారాను, నాడీతంతు నాడీకణ సంధానముల వద్దను, నాడీతంతు కండర సంధానముల వద్దను సంజ్ఞలు నాడీ ప్రసారిణుల ద్వారాను ప్రసరిస్తాయి. నాడితంతువుల నుంచి సంజ్ఞలు కండరాలకు చేరునపుడు కండరాలు ముడుచుకుంటాయి.

మూలాలు

మార్చు
  1. Gray’s Anatomy fifteenth edition
  2. Wilkins, Adam S. (2017). "History of the Face I". Making Faces. Belknap Press. p. 169. ISBN 9780674725522.
  3. Illustrated Anatomy of the Head and Neck, Fehrenbach and Herring, Elsevier, 2012, page 89
  4. Illustrated Anatomy of the Head and Neck, Fehrenbach and Herring, Elsevier, 2012, page 89