ముఖనాడిలో ( ఫేషియల్ నెర్వ్ ) వివిధ కారణాల వలన స్తంభనం ఏర్పడి నప్పుడు ఆ పక్క ముఖకండరాలలో పక్షవాతం కలుగుతుంది. ఆ ముఖ కండరాలు ఇచ్ఛా చలనాలను కోల్పోతాయి. ఆ కండరాల బిగుతు కూడా తగ్గిపోతుంది.

ముఖపక్షవాతాలలో రకాలు

మార్చు

ముఖనాడీ కేంద్రం మస్తిష్క మూలంలో వారధి (పాన్స్) భాగంలో ఉంటుంది. మెదడులో చలన వల్కలం (మోటార్ కార్టెక్స్) నుండి నాడీ తంతువులు వచ్చి ముఖనాడీ కేంద్రంలో ఉన్న నాడీకణాలతో సంధానం అవుతాయి. ముఖనాడీ కేంద్రంనుండి ముఖ నాడులు వెలువడుతాయి

నాడీకేంద్రంలోను, నాడీకేంద్రం పైనా కలిగే వ్యాధుల వలన కలిగే పక్షవాతాన్ని ఊర్ధ్వచలననాడీ పక్షవాతంగా (అప్పర్ మోటార్ న్యూరాన్ పెరాలిసిస్ ) పరిగణిస్తారు. ఊర్ధ్వచలననాడీ ముఖపక్షవాతము కలిగిన వారిలో లలాట కండరములకు రెండవ ప్రక్క చలనవల్కలపు తంతులు కొన్ని ప్రసరణ చేయుటవలన లలాట కండరాలలో వాతపు లక్షణాలు తీవ్రముగా ఉండవు[1]. వీరిలో నుదుటిలో ముడుతలు పూర్తిగా పోవు.

నాడీకేంద్రం దిగువ, నాడిలోను కలిగే రుగ్మతల వలన కలిగే పక్షవాతాన్ని అధః చలననాడీ పక్షవాతంగా (లోవర్ మోటార్ న్యూరాన్ పెరాలిసిస్) పరిగణిస్తారు. వీరిలో నుదుటి కండరాలలో కూడా వాతపు లక్షణాలు మిగిలిన ముఖకండరములలో వలె తీవ్రముగా ఉంటాయి. వీరిలో నుదుటి ముడుతలు మరుగవుతాయి.

కారణాలు

మార్చు

ముఖనాడుల పక్షవాతానికి సాధారణ కారణము బెల్స్ పక్షవాతం ( బెల్స్ పాల్సీ ). ముఖ పక్షవాతం వివిధ సమాజాలలో చాలా కాలంగా గుర్తించబడినా సర్. ఛార్లెస్ బెల్ 1826 లో దీనిని ముగ్గురు రోగులలో గమనించి లక్షణాలను వర్ణించడం వలన దీనికి అతని పేరు స్థిరపడింది. డెబ్బయి శాతం ముఖపక్షవాతాలకు బెల్స్ పక్షవాతం కారణం.

సుమారు ముప్పయి శాతం మందిలో మెదడు పొరలలో కలిగే తాపం వలన ( మినింజైటిస్ ), ప్రమాదాలలో కలిగే దెబ్బల వలన, కొత్త పెరుగుదలల వలన, మస్తిష్క రక్తనాళ విఘాతాల వలన ( సెరిబ్రల్ వాస్కులార్ ఏక్సిడెంట్స్ ), మధుమేహవ్యాధి, సార్కాయిడోసిస్, లైమ్స్ వ్యాధి వలన ముఖ పక్షవాతం కలుగ గలదు. కాని వీరిలో ఆ యా వ్యాధుల యితర లక్షణాలు కూడా ఉంటాయి. నాడీమండలంలో యితర భాగాలపై కూడా ఆ వ్యాధుల ప్రభావం ఉండడం చేత యితర నాడీమండల లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ఇతర నాడీమండల లక్షణాలు, యితర వ్యాధుల లక్షణాలు లేనివారిలో కనిపించే ముఖ పక్షవాతాన్ని బెల్స్ పక్షవాతంగా పరిగణించవచ్చు.

వ్యాధి విధానం

మార్చు

బెల్స్ పక్షవాతం అధః చలననాడీ పక్షవాతాన్ని కలిగిస్తుంది. బెల్స్ పక్షవాతానికి కారణం తెలియదు. పరిశోధనలలో కొంతమందిలో జ్వరం పొక్కులు కలిగించే హెర్పీస్ సింప్లెక్స్ విషజీవాంశాలు ( వైరస్లు ),కొంతమందిలో ఆటాలమ్మ / మేఖల విసర్పిణి జీవాంశాలు ( చికెన్ పాక్స్ / హెర్పీస్ జాష్టర్ వైరస్లు ) కనుగోబడ్డాయి.

వీరిలో సన్నని ముఖనాడి నాళంలో పయనించే ముఖనాడిలో తాపం, వాపు కలుగుతుంది. అస్థినాళం యిరుకై ముఖనాడి మీద కలిగే ఒత్తిడి వలన, రక్తప్రసరణ తగ్గడం వలన, తాపం వలన కలిగే విధ్వంసము వలన, నాడిని చుట్టుకొని ఉండే కొవ్వుపొరకు ( మయిలిన్ షీత్ ) కలిగే విధ్వంసం వలన నాడి వ్యాపారానికి భంగం ఏర్పడుతుంది. నాడిలో సంజ్ఞల ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. అందువలన ముఖ కండరాలలో నీరసం ( వాతం ) కలుగుతుంది. బెల్స్ పక్షవాతం చాలా మందిలో తాత్కాలికంగానే ఉంటుంది. చికిత్సతోను, చికిత్స లేకపోయినా కొద్ది వారాలలో క్రమంగా వ్యాధి నయమవుతుంది. కొంతమందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి త్వరగా నయమవుతుంది.

ముఖ పక్షవాత లక్షణాలు

మార్చు

ఈ లక్షణాల తీవ్రత వివిధస్థాయిలలో ఉంటుంది. సాధారణంగా ముఖంలో ఒకపక్కే పక్షవాతం కనిపిస్తుంది. అసాధారణముగా రెండు ముఖనాడులు పక్షవాతానికి గుఱి కావచ్చు. వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా కలిగి రెండు మూడు రోజుల్లో ఉధృతి పొందుతాయి. జలుబు, తలనొప్పి, చెవి కిందా, చెవిచుట్టూ బాధ, కింద దవడలో నొప్పి కలుగవచ్చు. మిగిలిన శరీర భాగాలలో పక్షవాతం ఉండదు.

 
Bellspalsy

ముఖ కండరాలలో అదురు, నీరసం కలుగవచ్చు. ఆ పక్క కనుబొమ, నోటిభాగం క్రిందకు వాలి ఉంటాయి[2].

వ్యాధికి గుఱైన వైపు నుదుటిలో ముడుతలు లోపిస్తాయి. నేత్రమండలిక కండరంలో బిగుతు తగ్గడం వలన ఆ వైపు కంటిని పూర్తిగా మూయలేరు. కన్నీళ్ళు బయటకు ఒలుకుతుంటాయి.

బాష్పగ్రంథులు స్రవించడం తగ్గి కంటిలో తేమ తగ్గుతుంది.

ముక్కు నుండి పైపెదవికి జారే ముడుత ( నాసోష్ఠ వళి ) రూపు తగ్గి ఉంటుంది. ఆ పక్క నోటి కోణం క్రిందకు ఒరిగి ఉంటుంది. ఆ ప్రక్క చొంగ కారవచ్చు.

ఆ పక్క బుగ్గలో గాలి ఊదిపెట్టి ఉంచలేరు. ఊళ సరిగా వేయలేరు.

ఆ పక్క నాలుక ముందు భాగంలో రుచి లోపిస్తుంది[3]. లాలాజలం స్రవించడం తగ్గి నోరు పొడిగా ఉండవచ్చు. మాట్లాడడానికి , తిండి తినడానికి, నీళ్ళు త్రాగడానికి యిబ్బంది ఉంటుంది. చెవులలో గింగురు శబ్దము, మాటలధ్వని, శబ్దాల హోరు హెచ్చయి అసౌఖ్యము కలుగవచ్చు.

వ్యాధి నిర్ణయము

మార్చు

బెల్స్ పాల్సీ

మార్చు

ఇతర నాడీమండల వ్యాధి లక్షణాలు, ఇతర వ్యాధుల లక్షణాలు లేకుండా ఒకపక్క ముఖ పక్షవాత లక్షణాలు ఒకటి రెండు రోజుల్లో పొడచూపినపుడు వ్యాధి లక్షణాల బట్టి తాత్కాలిక ముఖ పక్షవాతంగా ( బెల్స్ పాల్సీ ) నిర్ధారణ చేయవచ్చు[4]. బెల్స్ పక్షవాతము అధః చలననాడీ పక్షవాతం (లోవర్ మోటార్ న్యూరాన్ పెరాలిసిస్). వీరిలో యితర శరీరభాగాలు పక్షవాతానికి గురికావు. ఈ వ్యాధి నిర్ధారణకు ప్రత్యేకమైన రక్తపరీక్షలు గాని యితర పరీక్షలు గాని లభ్యంలో లేవు. ఈ వ్యాధి తాత్కాలికమైనది, వ్యాధి లక్షణాలు కార్టికోష్టీరాయిడులతోను, ఏస్పిరిన్ తోను కొద్దివారాలలో ఉపశమిస్తాయి కాబట్టి విస్తృతముగా ఖరీదైన పరీక్షలు చేయడం అనవసరం.

విద్యుత్ కండరలేఖనంతో ( ఎలెక్ట్రో మయోగ్రఫీ ) ముఖనాడిలో హానిని, హానితీవ్రతను పసిగట్టవచ్చు.

మధుమేహ వ్యాధి

మార్చు

రక్త పరీక్షలు మధుమేహవ్యాధిని నిర్ణయించగలవు, కాని మధుమేహం కలవారిలో ఇతర కారణాలకు పరిశోధించి వాటిని మినహాయించాలి.

సార్కాయిడోసిస్

మార్చు

సార్కాయిడోసిస్ వ్యాధిని ఇతర లక్షణాలతోను, రక్త పరీక్షలతోను నిరూపించవచ్చు.

లైమ్స్ వ్యాధి

మార్చు

లైమ్స్ వ్యాధి ఉత్తర భూగోళవాసులలో చూస్తాం. ఈ వ్యాధి బొర్రీలియా సూక్ష్మజీవుల వలన కలుగుతుంది. వీరిలో ప్రథమదశలో ఎద్దుకన్నులా చర్మంపై ఎఱ్ఱని దద్దురు కనిపిస్తుంది. శరీరంలో అనేక లక్షణాలు కలిగించే యీ వ్యాధి వలన కొందఱిలో ముఖనాడి పక్షవాతం కలుగుతుంది. లేడి కొణుజులు కుట్టడం వలన యీ వ్యాధి సంక్రమిస్తుంది. వీరిలో కొందఱికి రెండు పక్కలా ముఖ పక్షవాతము కలుగవచ్చు. రక్త పరీక్షలతో లైమ్స్ వ్యాధిని నిరూపించవచ్చు. సూక్ష్మజీవి సంహారకములను ( ఏంటిబయాటిక్స్ ) చికిత్సకు వాడుతారు. వయోజనులలో డాక్సీసైక్లిన్ ను కాని ఎమాక్సిసిలిన్ కాని వాడవచ్చు.

మెదడులో వ్యాధులు

మార్చు

ఇతర కపాల నాడులలోను, నాడీమండలంలో యితర భాగాలలోను రోగలక్షణాలు ఉన్నపుడు, ముఖపక్షవాత చిహ్నాలు రెండు మూడు వారాలలో ఉధృతమవుతున్నా, తగ్గుదల చూపకపోయినా, మస్తిష్క వ్యాధులకు, యితర వ్యాధులకు పరిశోధించాలి.

మస్తిష్క రక్తనాళ విఘాతాలను ( సెరిబ్రల్ వాస్కులార్ డిసీజెస్ ), మెదడులో కొత్త పెరుగుదలలను, సూక్ష్మాంగజీవ వ్యాధులను కనుగోడానికి గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణాలు ( కంప్యూటెరైజ్డ్ ఏక్సియల్ టోమోగ్రఫీ ), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణాలు ( మాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ) ఉపయోగపడుతాయి

మస్తిష్క విఘాతాల వలన కలిగే స్పర్శనష్టము, చలననష్టము ముఖంలోనే కాక ఆ పక్క చేతులలోను, కాళ్ళలోను కూడా కనిపిస్తాయి. వీరిలో లలాట భాగంలో వాతపు లక్షణాలు రెండవ పక్క చలనవల్కలపు తంతులు కొన్ని ఈవల లలాట కండరానికి ప్రసరణ చేయడం వలన తీవ్రముగా ఉండవు[1]. నుదుటిలో ముడుతలు పూర్తిగా పోవు .

మధ్య చెవిలో తాపం

మార్చు

మధ్యచెవిలో సూక్ష్మజీవుల వలన తాపం ( ఆటైటిస్ ) కలిగిన వారిలో చెవినొప్పి, చెవినుంచి స్రావం కారుట వంటి లక్షణాలతో ముఖ పక్షవాతం కలుగవచ్చు. వారికి చెవి తాపానికి చికిత్స, వారి మధ్య చెవిలో తాపం వలన ఖొలిష్టియటోమా అనే పెరుగుదల ఏర్పడితే దానికి శస్త్రచికిత్స అవసరం.

అగ్నిసర్పి

మార్చు

ముఖపక్షవాతంతో బాటు బయట చెవిపైన, చెవి ప్రాంతంలోను పొక్కులతో ఎఱ్ఱదనం ఉన్నట్లయితే అది ఆటాలమ్మ - మేఖలవిసర్పిణి విషజీవాంశాల ( వైరస్లు) వలన కలిగిన అగ్గిచప్పిగా నిర్ధారణ చేయవచ్చు. దానిని రేమ్సే హంట్ సిండ్రోమ్ గా వర్ణిస్తారు. చికిత్సకు ఎసైక్లొవీర్, వాలసైక్లొవీర్ వంటి ఏంటివైరల్ మందులు వాడాలి.[5]

చికిత్స

మార్చు

ఒక ముఖనాడికే పరిమితమయిన పక్షవాతం హెచ్చుశాతం మందిలో తాత్కాలిక ముఖపక్షవాతంగా ( బెల్స్ పాల్సీ ) పరిగణించవచ్చు. చాలా మందిలో దానంతట అది తగ్గినా, త్వరిత ఉపశమనం కొరకు, అవశిష్ట లక్షణాలను అరికట్టడానికి చికిత్సలు అవసరం[5].

వీరికి ముఖనాడిలో తాపాన్ని పరిమితం చేసి, లక్షణాలు తొలగించడానికి తాప నిరోధకాలైన కార్టికోష్టీరాయిడులను ముఖ్యంగా ప్రెడ్నిసోన్ ను వాడుతారు[2]. వీటి వలన హెచ్చుశాతపు మందిలో వ్యాధి లక్షణాలు త్వరగా తగ్గుతాయి. కార్టికోష్టీరాయిడులు వ్యాధి లక్షణాలు కనిపించిన 72 గంటలలో మొదలుపెడితే ఫలితాలు బాగుంటాయి[2].

విషజీవాంశ నాశకాలు ( ఏంటివైరల్స్ ) : ఎసైక్లొవీర్ లేక వాలసైక్లొవీర్ లను కార్టికోష్టీరాయిడులతో పాటు వాడడం వలన అదనపు ప్రయోజనం చేకూరవచ్చు. పరిశోధనల ఫలితాలు నిర్దిష్టంగా లేవు.

లైమ్స్ వ్యాధి చికిత్సకు సూక్ష్మజీవి సంహారకములను ( ఏంటిబయాటిక్స్ ) వాడుతారు. వయోజనులలో డాక్సీసైక్లిన్ ను కాని ఎమాక్సిసిలిన్ కాని వాడవచ్చు.

నొప్పి తగ్గించడానికి ఏస్పిరిన్, ఎసిటెమైనొఫెన్, ఐబుప్రొఫెన్ లను వాడుతారు. ఈ మందులు వాడినపుడు రోగికి కల ఇతర వ్యాధులను, రోగి వాడే ఇతర మందులను పరిగణించాలి.

కంటికి రక్షణ

కనురెప్పలు పూర్తిగా మూసుకొనక కన్నీళ్ళు బయటకు ఒలకడం వలన, కన్నీళ్ళ స్రావం తగ్గడం వలన కనుగుడ్డుపై తడి ఆరిపోడానికి, కంటి స్వచ్ఛపటలం తాపానికి గుఱి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి కంటికి రక్షణ చేకూర్చాలి. కృత్రిమ బాష్పాలు వాడి, కనురెప్పను మూసిఉంచి ( ప్రత్యేకంగా నిద్రించునపుడు ) దానిపై కప్పు ఉంచి కంటికి రక్షణ చేకూర్చాలి.

వ్యాయామ చికిత్సలు

వ్యాయామ చికిత్సలు ముఖకండరాల బిగుతును కాపాడడానికి, శాశ్వత సంకోచాలు అరికట్టడానికి ఉపయోగపడుతాయి. కాపడం వంటి ఉష్ణచికిత్సల వలన నొప్పి తగ్గే అవకాశం ఉంది.

విద్యుత్ప్రేరణ చికిత్సల వలన పరిశోధనలలో సత్ఫలితాలు కనిపించలేదు.

ముఖనాడిపై ఒత్తిడి తగ్గించే శస్త్రచికిత్సల వలన ప్రయోజనం తక్కువ.

చాలా నెలల తర్వాత కూడా ముఖ కవళికలలో వికృతం పోనివారికి పునర్నిర్మాణ శస్త్రచికిత్సల వలన ప్రయోజనం చేకూరవచ్చు.

ఇతర వ్యాధుల వలన ముఖ పక్షవాతం కలిగితే ఆయా వ్యాధులకు చికిత్సలు చేయాలి.

తాత్కాలిక ముఖ పక్షవాతం కలిగిన వారిలో రెండు మూడు వారాలలో క్రమంగా వాతపు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. చాలామందిలో మూడు, ఆరు మాసాలలో లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా తక్కువ శాతం మందిలో కండరాల శక్తి పూర్వస్థితికి రాకపోవచ్చు.

కొంతమందిలో వ్యాధి వలన ధ్వంసం చెందిన ముఖనాడి తంతువులు పునరుజ్జీవనం చెందినపుడు వాటి గమ్యస్థాన గతులు తప్పుతాయి. కంటిచుట్టూ ఉండే నేత్ర మండలిక కండరపు నాడీతంతులు నోటి దగ్గఱ ఉండే వక్త్రకోణ ఉద్ధరణ కండరాలకు చేరుకుంటే కన్ను మూసినపుడు నోటి కోణం అసంకల్పితంగా పైకి లేస్తుంది.

ఊర్ధ్వ లాలాజల కేంద్రం ( సుపీరియర్ సేలివేటర్ న్యూక్లియస్ ) నుండి వెలువడే నాడీతంతులు బాష్పగ్రంథులకు చేరుకుంటే తినుబండారాల వాసన తగిలినప్పుడు, భోజన సమయాల్లో కన్నీళ్ళు కారవచ్చు. వీటిని మొసలి కన్నీళ్ళుగా వర్ణిస్తారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "https://www.annemergmed.com/article/S0196-0644(17)31504-4/fulltext". {{cite journal}}: Cite journal requires |journal= (help); External link in |title= (help)
  2. 2.0 2.1 2.2 "Bell's Palsy". National Institute of Neurological Disorders and Stroke (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
  3. "Bell's palsy - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
  4. "Bell's Palsy". Otolaryngology⁠ — Head & Neck Surgery (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
  5. 5.0 5.1 "Bell Palsy: Updated Guideline for Treatment". Consultant360 (in ఇంగ్లీష్). 2013-02-14. Retrieved 2023-05-09.