ముఖనాడి
ముఖ కండరాలు చలించడం వలన ముఖ కవళికలు కలుగుతాయి. ముఖ కండరాల చలనాలు ఎడమ, కుడి ముఖనాడుల సంజ్ఞలపైన ఆధారపడుతాయి. ముఖ కవళికలు కలగించు కండరాలతో పాటు ఇతర ముఖకండరాలకు కూడా ముఖనాడులు నాడీతంతువులను కొనిపోతాయి. నాలుక మూడింట ముందున్న రెండు భాగాల నుంచి రుచి గ్రహిస్తాయి. బాష్పగ్రంథుల నుండి కన్నీరు స్రవింపజేసి కన్నులలో తడి ఆరిపోకుండా కాపాడుతాయి. నిద్రించునపుడు కళ్ళను మూసి ఉంచి వాటికి రక్షణ చేకూర్చుతాయి. పరిసరాలలో శబ్దస్థాయికి అనుగుణంగా చెవులు శబ్దం గ్రహించుటను (కొంత మేరకు) స్టెపీడియస్ కండరము ద్వారా నియంత్రిస్తాయి. ముఖ నాడిలో ఎందువలనైనా స్తంభనం కలిగితే ముఖంలో ఆ వైపు ముఖపక్షవాతం కలుగుతుంది.
శరీరంలో నాడులను కపాల నాడులు, వెన్ను నాడులుగా విభజించవచ్చు.
కపాల నాడులు
మార్చుకపాలనాడులు మెదడు వివిధ భాగాలలోను, మస్తిష్క మూలంలోను ఉండే వాటి కేంద్రముల నుండి మొదలిడి కపాలంలో వివిధ రంధ్రాల ద్వారా బయటపడుతాయి. మానవులలో 12 జతల కపాలనాడులు ఉంటాయి. వాటిలో ముఖనాడులు 7 వ జత కపాలనాడులు.
వెన్నునాడులు
మార్చువెన్నునాడులు వెన్నుపాము నుండి మొదలిడి వెన్నుపూసల మధ్య రంధ్రాల ద్వారా వెలువడుతాయి.
ముఖ నాడులు
మార్చుముఖనాడులు మస్తిష్క మూలంలో వారధి లో ( Pons ) ఉండే వాటి కేంద్రముల నుండి రెండు వైపుల వెలువడుతాయి. ఈ ముఖనాడుల కేంద్రాల్లో ఉండే నాడీకణాలతో మెదడులో చలనవల్కలముల (మోటార్ కార్టెక్స్) నుండి కొన్ని నాడీతంతువులు వచ్చి సంధానమవుతాయి. [2] [3] ప్రతి ముఖనాడికి రెండు మూలాలు ఉంటాయి. చలననాడి మూలం లావుగా ఉంటుంది. జ్ఞాననాడి మూలం సన్నంగా ఉంటుంది. ఈ రెండు మూలాలు కపాలపు వెనుక భాగములో పయనించి అంతర శ్రవణ రంధ్రము ద్వారా కర్ణాస్థిలో శిలాభాగము [4]( పీట్రస్) ) లోనికి ప్రవేశిస్తాయి. ముఖనాడిలో జ్ఞాననాడి మూలపు భాగాన్ని మధ్యస్థ నాడి గా పరిగణిస్తారు. ఈ మధ్యస్థనాడిలో నాలుక ముందు 2 / 3 భాగాల నుండి రుచిని గ్రహించే నాడీ తంతువులు, చెవిడొప్ప నుండి స్పర్శ, నొప్పి జ్ఞానములను కొనిపోయే తంతువులు, బాష్పగ్రంథులకు, నాలుక క్రింద లాలాజల గ్రంథులకు, దవడల క్రింద ఉండే లాలాజల గ్రంథులకు ప్రసరణ చేకూర్చే పరానుభూత నాడీ తంతువులు ఉంటాయి,
ముఖనాడి రెండు మూలాలు ముఖనాళము ( ఫేషియల్ కెనాల్ ) లోనికి ప్రవేశిస్తాయి. ముుఖనాళములో రెండు మూలాలు కలసి ముఖనాడి గా ఒకటవుతాయి. ముఖనాళములో ముఖనాడి Z లాగ మెలికలతో పయనిస్తుంది. మోకాలులా ఉండే ముందు మెలికలో జానుగ్రంథి ( [5]జెనిక్యులేట్ గాంగ్లియన్ ) అనే నాడీకణ సముదాయము ఉంటుంది. ఈ జానుగ్రంథి నుండి గ్రేటర్ పెట్రొసెల్ నాడి శాఖగా వెలువడుతుంది. ఈ శాఖ కంటిలో బాష్పగ్రంథికి ప్రసరణ చేకూరుస్తుంది.
తర్వాత ముఖనాడి మధ్య చెవిలో ఉండే స్టెపీడియస్ కండరానికి ఒక శాఖ ఇస్తుంది. స్టెపీడియస్ మధ్యచెవిలో ఉన్న అంకవన్నె ఎముకను ( స్టేపీస్ ) స్థిరముగా ఉంచడానికి, శబ్దముల స్థాయిని అనుసరించి శబ్దగ్రాహణను నియంత్రించడానికి తోడ్పడుతుంది. ఒక మిల్లీ మీటరు పరిమాణములో ఉండే స్టెపీడియస్ మానవ శరీరములో ఉండే మిక్కిలి చిన్న కండరము. అంకవన్నె ఎముక మిక్కిలి చిన్న ఎముక.
తరువాత ముఖనాడి నుంచి ఖార్డా టింపనీ అనే శాఖ వెలువడుతుంది. ఈ శాఖలు నాలుక 2 / 3 ముందు భాగాల నుంచి రుచి సంజ్ఞలు సేకరిస్తాయి. ఖార్డా టింపనీ శాఖలు నాలుక క్రింద లాలాజల గ్రంథులకు, దవడ క్రింద లాలాజల గ్రంథులకు పరానుభూత నాడీ తంతువులను కూడా చేరుస్తాయి.
తరువాత ముఖనాడి కపాలం క్రింద చెవి వెనుక ఉండే స్టైలాయిడ్ రంధ్రము నుంచి బయటకు వస్తుంది. రాగానే పోష్టీరియర్ ఆరిక్యులార్ నెర్వ్ అనే శాఖను ఇస్తుంది. ఈ శాఖ చెవి దగ్గఱ ఉన్న కండరాలకు ప్రసరణ ఇస్తుంది.
తరువాత స్టైలో హయాయిడ్ కండరానికి, డైగాస్ట్రిక్ కండరానికి శాఖలు ఇచ్చి చెవి మూలములో ఉన్న శ్రవణమూల లాలాజలగ్రంథి ( పెరాటిడ్ సెలైవరీ గ్లాండ్) లోనికి చొచ్చుకొని ఆ గ్రంథి నడిమిలో [6]కణత నరము ( టెంపొరల్ ), చెక్కిలి నరము ( జైగోమేటిక్ ), బుగ్గ నరము ( బక్కల్ ), దవడ నరము ( మార్జినల్ మాండిబ్యులార్ ), మెడ నరము (సెర్వైకల్ ) అనే శాఖలుగా చీలుతుంది. ఆ శాఖలు లాలాజల గ్రంథి ముందు భాగము నుండి బయటపడి వివిధ ముఖ కండరాలకు, మెడలో ప్లాటిస్మా అనే కండరానికి నాడీప్రసరణ కావిస్తాయి.
ముఖములో [1]లలాటకండరాలకు మెదడు రెండుప్రక్కల చలనవల్కముల నుండి నాడీప్రసరణ చేకూరుతుంది. క్రింది కండరములకు మెదడులో ఆవలిప్రక్క చలనవల్కముల నుండి మాత్రము నాడీప్రసరణ చేకూరుతుంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 https://www.annemergmed.com/article/S0196-0644(17)31504-4/fulltext.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help); Missing or empty|title=
(help) - ↑ Gray’s Anatomy fifteenth edition pages 720-724
- ↑ "The Facial Nerve (CN VII) - Course - Functions - TeachMeAnatomy". teachmeanatomy.info. Retrieved 2023-05-02.
- ↑ "Definition of petrous | Dictionary.com". www.dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-04.
- ↑ "Definition of geniculate | Dictionary.com". www.dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-04.
- ↑ "What is the Facial Nerve?". Otolaryngology — Head & Neck Surgery (in ఇంగ్లీష్). Retrieved 2023-05-04.