యాత్రా చరిత్ర
యాత్రాచరిత్ర మండపాక పార్వతీశ్వర శాస్త్రి (1833-1897) రచించిన వచన గ్రంథము. దీనిని పూర్వభాగము, ఉత్తరభాగము లనే రెండు పుస్తకములుగా ముద్రించారు. దీని పూర్వభాగాన్ని బొబ్బిలి సంస్థానానికి చెందిన శ్రీ రంగరాయ విలాస ముద్రాక్షరశాల వారు 1915లో ముద్రించారు.
ప్రారంభము
మార్చుఈ యాత్ర 1886 సంవత్సరం జనవరి 24వ తేదీకి సరియైన పార్థివ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి ఆదివారమునాడు లాంచన పుర్వకముగా గొంత పరివారమును ముందుగా బంపి; 25వ తేదీని శ్రీ బొబ్బిలి వేణుగోపాలస్వామివారిని సేవించికొని పగలు 10 గంటలకు బయలుదేరి 4 గంటలకు విజయనగరము కంటన్మేంటులో బసచేసారు. ఈ మార్గములోని గ్రామాలు 1. రామభద్రపురము, 2. మరడాము, 3. గజపతినగరము. విజయనగరము పట్టణం సుందరముగా నున్నది, ఇది శ్రీ పూసపాటి ఆనంద గజపతి రాజు మహారాజావారి రాజధానియైయున్నది. ఇందు నాలుగు బురుజులుగల సాధారణమైన రాతి కోటయు, సంస్థానపు బియ్యే కాలేజీయు - తంతి యాఫీసును 4, 5 శివకేశవ నివేశంబులును మేలైన పూలతోటయు మంచి కోనేరును, వైద్యశాలలును - సంస్కృత పాఠశాల నొక సత్రంబును గలవు.