యు.ఎస్.కృష్ణారావు
ఉభయకర్ శివరామ కృష్ణారావు నాట్య కళాకారుడు, నాట్యాచార్యుడు, నృత్యదర్శకుడు, రచయిత.
ఉభయకర్ శివరామ కృష్ణారావు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | మల్లాపుర, ఉత్తర కెనరా జిల్లా, కర్ణాటక రాష్ట్రం | 1912 డిసెంబరు 31
మరణం | 2005 మార్చి 6 బెంగళూరు | (వయసు 92)
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్యం కళాకారుడు |
జీవిత భాగస్వామి | చంద్రభాగ దేవి |
విశేషాలు
మార్చుఇతడు కర్ణాటక రాష్ట్రం, ఉత్తర కెనరా జిల్లా, మల్లాపురలో 1912, డిసెంబరు 31న జన్మించాడు.[1] ఇతడు బెంగుళూరులో పెరిగి పెద్దయ్యాడు. ఇతడు మైసూర్ విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రంలో ఎం.ఎస్.సి.చదివాడు. అనేక సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాడు. బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇతడు కోలార్ పుట్టప్ప వద్ద 1939-40లలో భారతనాట్యాన్ని, 1941-42లలో కుంజు కురుప్ వద్ద కథాకళి నృత్యాన్ని అభ్యసించాడు. 1943లో తన భార్య చంద్రభాగ దేవితో కలిసి తంజావూరులో పందనల్లూర్ మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద భరతనాట్యంలో విస్తారమైన శిక్షణ తీసుకున్నాడు. ఆ కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు కాని, యువతి కాని భరతనాట్యం నేర్చుకోవడం నిజంగా ఒక సాహసోపేతమైన చర్య. అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఈ దంపతులు భారతీయ శాస్త్రీయ నృత్యంలో ఒక ఉత్కృష్టమైన జంటగా నిలదొక్కుకున్నారు. ఈ జంట మద్రాసులోని మ్యూజియమ్ థియేటర్లో 1944లో తొలి ప్రదర్శన గావించారు. తరువాత వీరు దేశవిదేశాలలో 1500కు పైగా జంటగా ప్రదర్శనలు ఇచ్చారు.[2]
ఈ జంట భరతనాట్యానికి ప్రాచుర్యాన్ని కల్పించారు. 1942లో వీరు బెంగళూరులో మహామాయ అనే నృత్య పాఠశాలను స్థాపించారు. వీరి వద్ద నాట్యం నేర్చుకున్న కళాకారులు ప్రపంచం నలుమూలలా విస్తరించి ఉన్నారు. వీరు నాట్యానికి సంబంధించి ప్రదర్శనాపూర్వక ప్రసంగాలను అనేకం చేశారు. వీరి ఈ ప్రసంగాలకు విద్యార్థినీ విద్యార్థులు నాట్యంపట్ల ఆకర్షితులయ్యారు. కృష్ణారావు బెంగళూరు విశ్వవిద్యాలయంలో నాట్యశాస్త్రానికి గౌరవ ప్రొఫెసర్‌గా 1973 నుండి 1977 వరకు సేవలందించాడు. ఇతని భార్య చంద్రభాగ దేవి 1973 నుండి 1977 వరకు భారతీయ విద్యాభవన్‌లో నాట్యంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది.
ఇతడు అనేక సంగీత నృత్య నాటకాలకు దర్శకత్వం వహించాడు. వాటిలో బుద్ధ, రాణీ శాంతల, గీతాగోవింద, కామదహన వంటివి ఉన్నాయి. ఇతడు తన భార్యతో కలిసి దేశంలోని అన్నిప్రాంతాలలో, విదేశాలలో అనేక చోట్ల అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి వచ్చిన ఆదాయాన్ని పలు సహాయ కార్యక్రమాలకు వెచ్చించాడు. ఇతడు మంచి నాట్యకళాకారుడే కాక అనేక మంది సంగీతవిద్వాంసులకు వాద్య సహకారం అందించాడు. ఇతడు హార్మొనియం, వేణువు మొదలైన అనేక వాద్యపరికరాలను ఉపయోగించగలడు. ఇతడు సంగీత కారులకు, వాద్యకళాకారులకు నాట్యాన్ని నేర్పించాడు.
ఇతడు కన్నడభాషలో "ఆధునిక భారతదల్లిల్ నృత్యకళె" అనే గ్రంథాన్ని రచించాడు. 1980లో చంద్రభాగ దేవితో కలిసి "నృత్యకళె" అనే గ్రంథాన్ని రచించాడు. ఈ రెండు గ్రంథాలు నర్తకులకు, నాట్యాచార్యులకు రెఫరెన్స్ గ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి. 1980లో ఇంగ్లీషులో " ఎ డిక్షనరీ ఆఫ్ భరత నాట్య", 1993లో "ఎ పనోరమా ఆఫ్ ఇండియన్ డాన్సస్" అనే గ్రంథాలను ప్రచురించాడు. 1994లో కన్నడలో "భరతనాట్య నిఘంటు"ను ప్రకటించాడు. కన్నడ విజ్ఞానసర్వస్వంలో కళలు, కళాకారులకు సంబంధించి వ్యాసాలు వ్రాశాడు. ఇవేకాక అనేక పత్రికలలో నాట్యసంబంధమైన ఎన్నో వ్యాసాలు ప్రచురించాడు.[1]
ఇతడు రాజ్యోత్సవ ప్రశస్థి, శాంతల అవార్డు, కర్ణాటక నృత్యకళాపరిషత్ అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, శృతి ఫౌండేషన్ నుండి ఇ.కృష్ణ అయ్యర్ పతకం వంటి ఎన్నో పురస్కారాలను పొందాడు.
ఇతడు 2005, మార్చి 6వ తేదీన తన 92వ యేట బెంగళూరులో మరణించాడు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Lalitha Venkat. "U S Krishna Rao (1912 – 2005)". Narthaki. Dr.Anita Ratnam. Retrieved 16 April 2021.
- ↑ web master. "ಯು.ಎಸ್.ಕೃಷ್ಣರಾವ್-ಯು.ಕೆ. ಚಂದ್ರಭಾಗಾದೇವಿ". ಕಣಜ. ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ. Retrieved 16 April 2021.