రక్తపోటు

(రక్త పీడనం నుండి దారిమార్పు చెందింది)

రక్తపు పోటు లేదా రక్తపోటు (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు జీవ లక్షణములను (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు జీవ లక్షణములను అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని 'అధిక రక్తపోటు' (high blood pressure or hypertension) అంటారు. ఇలా రక్తపు పోటు మితి మీరితే అది రోగ లక్షణం.

Blood pressure
A healthcare worker measuring blood pressure using a sphygmomanometer.
MeSHD001795
MedlinePlus007490
LOINCమూస:LOINC

రక్తపు పోటు లక్షణాలు

మార్చు

రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనబడవు. చాప కింద నీరులా ఇది శరీరానికి కొంత హాని చేసిన తరువాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని ప్రస్పుటమవుతుంది. ఇలా ముదిరిన తరువాత మందులు వాడినా జరిగిపోయిన హానిని తిరగబెట్టలేము. అందుకని తరచు రక్తపు పోటు ఎంత ఉందో, అవకాశం దొరికినప్పుడల్లా - కొలుచుకుని చూసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో వైద్యుణ్ణి చూడ్డానికి ఏ పని మీద వెళ్ళినా రివాజుగా నర్సులు రక్తపు పోటుని కొలిచి నమోదు చేస్తారు. అలా నమోదు చేసినప్పుడు రోగి ఆ కొలతలని అడిగి తెలుసుకుని గుర్తు పెట్టుకోవటం మంచిది. ఈ కొలత ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే ఎక్కువ రక్తపు పోటు (high blood pressure) ఉందని అంటారు. ఎక్కువ రక్తపు పోటు ఉంటే అది గుండె జబ్బుకీ, మూత్రపిండాల జబ్బుకీ దారితీసే ప్రమాదం ఉంది. దీనికి విపర్యంగా మూత్రపిండాలకి జబ్బు చేస్తే దాని మూలంగా రక్తపు పోటు పెరుగుతుంది కూడ. అందుకని రక్తపు పోటు విలువ మీద ఒక కన్నేసి ఉంచటం చాల మంచి అలవాటు, ప్రాణాన్ని రక్షించుకునే అలవాటు.

రక్తపు పోటు అంటే ఏమిటి?

మార్చు

మన గుండె పని చెయ్యాలి కాని ప్రయాస పడుతూ పని చెయ్యకూడదు. రక్తపు పోటు గుండె ఎంత కష్టపడి పనిచేస్తున్నాదో సూచిస్తుంది. రక్తనాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తూన్న రక్తం అలల మాదిరి ప్రవహిస్తుంది. ఇలా పారుతున్న రక్తం నాళం గోడల మీద ఒత్తిడి (pressure) పెడుతుంది. ఈ ఒత్తిడి గుండెకి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళుతూన్న కొద్దీ క్రమేపీ తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి, ఆఖరున సిరలలో ప్రవేశించి నీరసించి, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళా గుండె చేరుకుంటుంది. కనుక శరీరం అంతటా పోటు ఒకేలా ఉండదు. వైద్యులు 'రక్తపు పోటు' అన్నప్పుడు ధమనులలో ఉన్న పీడనం (pressure). శరీరం అంతా ఈ పీడనం ఒకేలా ఉండదు కనుక సాధారణంగా జబ్బ మీద కొలుస్తారు. ఈ పోటు వేళని బట్టి, అప్పటి వరకు పడ్డ ప్రయాసని బట్టి, మనస్సులో ఉండే ఆరాటాన్ని బట్టీ, వేసుకుంటూన్న మందులని బట్టీ కూడా మారుతూ ఉంటుంది. కొందరికి వైద్యుడి పరికరాలు చూడగానే గుండె దబదబ కొట్టుకుని ఈ పోటు పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపు పోటు 120/80 ఉంటుందని వైద్యులు నిర్ణయించేరు[ఆధారం చూపాలి]. ఈ విలువలు 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపు పోటుతో బాధ పడుతూన్నట్లు లెక్క. సాధారణంగా ఈ కొలతలు రెండు మూడు సార్లు తీసి, సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపు పోటు ఎక్కువయింది అని నిర్ణయిస్తారు.రక్తపోటు చికిత్స కోసం కొత్త ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకం ప్రకారం రక్తపోటు సిస్టోలిక్ రక్తపోటు ≥140 mmHg, డయాస్టొలిక్ రక్తపోటు ≥90 mmHg కంటే అధికంగా ఉన్నపుడు[1] ( 140/90) ఫార్మకోలాజికల్ యాంటీహైపెర్టెన్సివ్ చికిత్సను ప్రారంభించాలని 25 ఆగస్టు 2021 న సిఫార్సు చేసినది[2]

ఇక్కడ ఉటంకించిన విషయాన్ని బట్టి రక్తపు పోటు కొలవటానికి రెండు సంఖ్యలు వాడతారని తెలుస్తోంది కదా. ఈ రెండింటిలో మొదటి సంఖ్య (ఎగువ ఉన్న సంఖ్య) సిస్టాలిక్‌ పోటు (systolic pressure), రెండవ సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య) డయస్టాలిక్‌ పోటు (diastolic pressure). గుండె ముకుళించుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకి వస్తుంది. అప్పుడు ఈ పోటు ఎక్కువగా ఉంటుంది. అదే సిస్టాలిక్‌ పోటు అంటే. గుండె వికసించుకున్నప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అప్పుడు ఈ పోటు తక్కువగా ఉంటుంది. అది డయాస్టాలిక్‌ పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతనీ, రక్తపు పోటుని రస స్తంభం (mercury column) పొడుగుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంభం వాడకుండానే కొలవ గలుగుతున్నారు.

రక్తపు పోటుకి కారణాలు

మార్చు

'ఎవ్వరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది?' అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. ప్రవర (family history), లింగం (gender), వయస్సు (age), జాతి (race) - అన్నీ కొద్దో గొప్పో దోహదం చేస్తాయి. తల్లి దండ్రులకి, దగ్గర బంధువులకి ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతూన్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం అమెరికాలో ఉండే నల్ల వారిలో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కారణాల వల్ల వచ్చే రక్తపు పోటు పెరుగుదలని ఇంగ్లీషులో primary hypertension అంటారు. వీటిని మనం అంతర్జనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇలా కాకుండా ఏదో జబ్బు వల్ల వచ్చేది secondary hypertension లేదా తెలుగులో వ్యాధిజనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇటువంటి వర్గీకరణ కంటే భౌతిక సూత్రాలని ఉపయోగించి ఏయే సందర్భాలు రక్తపు పోటు పెరుగుదలకి దోహదం చేస్తాయో చూడవచ్చు.

  • పంపు జోరు (rate of pumping). గుండె ఎక్కువ జోరుగా కొట్టుకుంటే రక్తపు పోటు ఎక్కువ అవుతుంది.
  • ప్రవహించే రక్తం పరిమాణం (volume) పెరిగితే పోటు పెరుగుతుంది. అంటే శరీరంలో ఎక్కువ రక్తం ఉంటే పోటు కూడా ఎక్కువగానే ఉంటుంది. మనం ఎక్కువ ఉప్పు తింటే అది రక్తపు పరిమాణాన్ని పెంచుతుంది. ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు.
  • ప్రవాహానికి నిరోధం (resistance) ఉంటే పోటు పెరుగుతుంది. గొట్టం చిన్నదయినా నిరోధం పెరుగుతుంది లేదా గొట్టంలో ఏదైనా అడ్డు పడ్డా నిరోధం పెరుగుతుంది. అందుకనే రక్తనాళపు గోడలలో పిత్తఘృతాల్ (కొలెస్టరాల్‌) పేరుకుంటే పోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మందులు రక్తనాళాలని కుచించుకునేలా చేస్తాయి (vasoconstriction), కొన్ని పెద్దవయేలా చేస్తాయి (vasodilators). ఈ మందుల ప్రభావం వల్ల రక్తపు పోటు పెరగటం, తరగటం జరగవచ్చు.

కొత్త చికిత్స

మార్చు
  • రీనల్‌సింపథెటిక్‌ నెర్వ్‌అబ్లేషన్‌లో మూత్రపిండాలకు చేరువగా ఉండే రక్తనాళాన్ని ఎంచుకుని దానిలోకి ఓ సన్ననివైరు పంపుతారు. ఈ రక్తనాళం మోసుకెళ్లే...అధికరక్తపోటుకు కారణమయ్యే సంకేతాలను సన్నని ఈ వైరు ఛిద్రం చేస్తుంది. తద్వారా రక్తపోటును పెంచేందుకు ఉద్దేశించిన సంకేతాలు మెదడునుంచి మూత్రపిండాలకు చేరడానికిముందే అంటే...మార్గమధ్యంలోనే సమసిపోతాయి.
  • రోజూ తీసుకునే ఆహారంలో మిర్చీ లాగించేయండి.మిరపలో ఉండే కాప్‌సాసిన్‌ రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.మిరపలో ఉన్న ప్రత్యేక గుణాలు నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రక్తనాళాలు సురక్షితంగా ఉంటాయి.

కొత్త మందు

మార్చు

అధిక రక్తపోటు నివారణకు సరికొత్త చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ విధానంతో ప్రాణాలను కాపాడడమే కాదు.. లక్షలాదిమంది రక్తపోటు బాధితుల జీవన ప్రమాణాలను పెంచవచ్చని ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని మోనా ష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించి ఈ విధానాన్ని రూపొందించారు. ఆస్ట్రేలియా, ఐరోపా‌ల్లో ఈ అధ్యయనం చేశారు. చికిత్సకు లొంగని స్థాయిలో రక్తపోటు ఉన్న రోగులకు ఆరు నెలలపాటు ఈ విధానంలో చికిత్స చేశామని, తర్వాత మూడేళ్లపాటు వారి రక్తపోటు అదుపులోనే ఉందని వివరించారు. ఈ చికిత్సా విధానాన్ని పెర్క్యుటేనియస్ రీనల్ సింపథిటిక్ డినర్వేషన్ (Percutaneous Renal Sympathetic Denervation) అని అంటారు. దీని ప్రకారం.. మెదడుకు సిగ్నల్స్ పంపే నరాలు కిడ్నీల చుట్టూ ఉంటాయి. రక్తపోటును పెంచేవి కూడా కిడ్నీలే. కిడ్నీల నుంచి మెదడుకు సంకేతాలు పంపకుండా వాటి మధ్య ఉన్న నరాలను నిర్వీర్యం చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ విధానంలో స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవు. ఈ విధానంలో లోకల్ అనస్థీసియా ఇస్తారు. నిర్దిష్ట నరంపై రేడియో ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. దీంతో, కిడ్నీలకు రక్తాన్ని పం పించే ఆ నరం నిర్వీర్యం అయిపోతుంది.[3]

రక్తపు పోటుని అదుపులో పెట్టటం ఎలా?

మార్చు

మన అలవాట్లని మార్చుకుని చాల వరకు రక్తపు పోటుని అదుపులో పెట్టవచ్చు. ఇటువంటి సలహాలని ఆచరణలో పెట్టే ముందు వైద్యుణ్ణి సంప్రదించటం అన్నిటి కంటే ముఖ్యం.

  • పొగ తాగటం మానటం.
  • బరువుని అదుపులో పెట్టటం. ప్రతి వ్యక్తి విగ్రహానికి అనుకూలమైన బరువు ఉండాలి తప్పితే అతిగా ఉండకూడదు. లావుపాటి శరీరంతో పోలిస్తే బక్కపలచని శరీరం ఎప్పుడూ శ్రేయస్కరమే.
  • ఆరోగ్యమైన ఆహారం తినటం. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, పెరుగు, మొదలయిన పదార్ధాలు ఉండటం మంచిది. నూనెలు, నేతులు వాడేటప్పుడు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (unsaturated fatty acids) సంతృప్త కొవ్వు ఆమ్లాలు (saturated fatty acids) కంటే మంచివని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని రకాల చేప నూనెలు (fish oils) ఈ సందర్భంలో మంచివని గమనించాలి. ఉదాహరణకి : eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA).
  • ప్రతి రోజూ నియమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం. ప్రతిరోజూ అరగంటకి తక్కువ కాకుండా, కొద్దిగా చెమట పట్టే వరకు, గబగబ నడవటం.
  • ఆహారంలో ఉప్పు తగ్గించి తద్వారా సోడియం తగ్గించటం. ఉప్పు లేక పోతే తిండి రుచించదు. కాని సాధ్యమయినంత వరకు ఉప్పుని మితిగా వాడటం చిన్నప్పటినుండి అలవాటు చేసుకొనటం మంచిది.
  • మనస్సుకి ఆరాటం, ఉద్విగ్నత (anxiety, stress) తగ్గించటం. యోగ మంత్రం జపం చెయ్యటం వల్ల రక్తపు పోటు అదుపులోకి వస్తుందనటానికి ఆధారాలు ఉన్నాయి.
  • మాదక ద్రవ్యాలని సేవించేటప్పుడు మితి మీరకుండా ఉండటం. ఆల్కహాలు, సారా వంటి మాదక ద్రవ్యాలు మోతాదులో పుచ్చుకుంటే పరవాలేదు కాని, మితి మీరితే ప్రమాదం. ఆడవారి యెడల విచక్షణ చూపటం కాదు కానీ, మగ వారు బరించగలిగే మోతాదులో సగమే స్త్రీలు భరించగలరు. గర్బిణి స్త్రీలు - ఆరోగ్యంగా ఉన్నా సరే - మాదక ద్ర్వ్యాలు మూట్టకూడదు.

ఈ సలహాలు పాటిస్తే ఎంతెంత లాభం ఉంటుందో (అంటే ఈ సలహాలు పాటించటం వల్ల సిస్టాలిక్‌ పోటు ఏ మాత్రం తగ్గుతుందో ఈ దిగువ పట్టికలో చూపటం అయింది.

సలహా వివరణ సలహా పాటిస్తే సిస్టాలిక్‌ సంఖ్యలో తగ్గుదల
ఎక్కువగా ఉన్న బరువుని తగ్గించాలి 10 కిలోల బరువు తగ్గితే .. 5 నుండి 20 పాయింట్లు
పథ్యం చెయ్యాలి కొవ్వు తక్కువ ఉన్న పాలు,

పళ్ళు, కాయగూరలు, తింటే..

8 నుండి 14 పాయింట్లు
రోజూ వ్యాయామం చెయ్యాలి చెమట పట్టే వరకు 30 నిమిషాలు గబగబ నడిస్తే.. 4 నుండి 9 పాయింట్లు
మాదక ద్రవ్యాలు తగ్గించాలి రోజూ ఒక గ్లాసు కంటే ఎక్కువ తాగకుండా ఉంటే.. (మగవారికి)

రోజూ అర గ్లాసు కంటే ఎక్కువ తాగకుండా ఉంటే.. (ఆడువారికి)

2 నుండి 4 పాయింట్లు

బి.పి.ని అదుపుచేసే ఆహారనియమాలు

మార్చు

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే పోరని కప్పుకొని నియమంగా, నిశ్చలంగా ఉండే ఓ శరీర అవయవము . ఈ గుండె తన క్రమాన్ని, నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా, తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .

గుండె, రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్ అంటారు . ఇది ముఖ్యంగా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి, 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంటాయో... ఆ శక్తి .

బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము ... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితిని " సిస్తొ లిక్ (Systolic)" అని, పూర్తీగా విచ్చుకునే స్థితిని " డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్ ప్రజర్ (Pulse Pressure) " అని వ్యవహరిస్తారు .

ఉప్పు : బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయము కావడమన్నది ఉండదు . కాని జీవనవిధానంలో మార్పుల ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. జీవితములో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉందుకోవచ్చును. ఆహారములో ఉప్పు వాడకము తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడొద్దు . ముఖ్యముగా ప్రాసెస్డ్, ప్యాకేజీపదార్థములు, ఫాస్ట్ పుడ్స్, క్యాన్డ్ పదార్థములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బి.పి.ని అధికము చేస్తుంది.

పొటాషియం : ఇది బి.పి.ని తగ్గిస్తుంది .బీన్స్, జఠాణీలు, నట్స్, పాలకూర, జ్యాబేజీ, కొత్తిమిర, అరటి, బొప్పాయి, ద్రాక్ష, కమలా, నారింజ, నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడములో బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

కొవ్వు పదార్ధములు : వీటివలన రక్తములో కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపములో ఉన్న కొవ్వులు. వీటి వాడాకము తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు, ఆవకాయ, కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.

ఆహారములో మార్పులు : ఎక్కువ పీచు పదార్ధము ఉన్న వాడాలి. పండ్లు, కాయకూరలు, ఆకు కూరలు, పప్పులు వాడాలి. రోజుకు కనీషము 5 సర్వింగులు పండ్లు, కూరకాయలు తింటుండాలి. సాష్ లు, ఊరగాయలు బాగా తగ్గించాలి.

ఆల్కహాలు : అలవాటు ఉండే వారు మానివేయాలి, . . లేదా పరిమితులు ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు ఉన్న పానీయము .

పొగ త్రాగడము : దీనిలో నికొటిన్‌ ఉండడము వలన రక్తనాళాల పై ప్రభావము చూపుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి.

ఉప్పు, కారాలు ఎక్కువగా తినడం, పొగ, ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం చేయవద్దు .

రక్త పీడనం కొలిచే విధానం

మార్చు
 
స్ఫిగ్మోమానోమీటర్, ధమనీ పీడనాన్ని కొలిచే యంత్రం

శరీరంలో ప్రసరించే రక్తం, రక్తనాళాలపై కలిగించే ఒత్తిడిని రక్త పీడనం లేదా రక్తపోటు అంటారు. శరీరము యొక్క ప్రధాన జీవ లక్షణాలలో రక్తపోటు ఒకటి. ధమనులు, ధమనికలు, రక్తనాళాలు, శిరల ద్వారా రక్తం ప్రవహించే క్రమంలో దాని పీడనం తగ్గుతూ వస్తుంది. సాధారణంగా రక్తపీడనం అని వ్యవహరించేటప్పుడు ధమనీ పీడనాన్ని (గుండెనుండి రక్తాన్ని ఇతర అవయవాలకు చేరవేసే పెద్ద ధమనులలోని పీడనం) పరిగణిస్తారు. ధమనీ పీడనాన్ని సాధారణంగా స్ఫిగ్మోమానోమీటర్ అనే యంత్రంతో కొలుస్తారు. ఇది పాదరసం యొక్క నిలువుటెత్తుతో ప్రసరించే రక్తం యొక్క ఒత్తిడిని సూచిస్తుంది.

మందులు

మార్చు

వనరులు

మార్చు
  1. Guideline for the pharmacological treatment of hypertension in adults. World Health Organization. 2021. p. 19.
  2. "More than 700 million people with untreated hypertension". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2021-08-27.
  3. http://www.med.monash.edu.au/news/2013/blood-pressure-treatment.html
  • 1. Pamphlets published by National Kidney Foundation, 30 East 33rd Street, New York, NY 10016
  • 2. The Seventh Report of the Joint National Committee on Prevention, Detection, Evaluation and Treatment of High Blood Pressure (www.nhlbi.nih.gov/guidelines/hypertension).

చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రక్తపోటు&oldid=4313988" నుండి వెలికితీశారు