రతి అనంతర పరీక్ష

రతి అనంతర పరీక్ష (Post-coital test) వంద్యత్వం ఉన్న దంపతులలో సమస్యను గుర్తించడానికి మహిళా భాగస్వామి మీద చేసే వైద్య పరీక్ష.

గర్భాశయ కంఠం దగ్గర ఉండే రసాయనిక ద్రవాలు కొంతమంది స్త్రీలలో పురుష బీజకణాలమీద చెడుఫలితాలని కలిగించి తగినన్ని బీజకణాలని గర్భాశయంలో చేరకుండా చేస్తాయి. ఎందుకంటే గర్భాశయ కంఠం నుండి, యోని ద్వారం నుండి వెలువడే ద్రవాలు ఆమ్ల గుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆమ్ల ద్రవాలు మరింత ఎక్కువగా అక్కడ ఊరుతూ ఉంటే పురుష బీజకణాలు చైతన్య రహితమవుతాయి. ఇదికూడా వంధ్యత్వానికి ముఖ్యకారణం, ఆమ్ల ద్రవాలవల్ల పురుష బీజకణాలు ఎంతవరకు గర్భాశయంలోకి పయనించగలుగుతున్నాయని తెలుసుకోవడానికి రత్యనంతర పరీక్ష చేయడం జరుగుతుంది.

ఈ పరీక్ష సంయోగం జరిపిన 16 గంటలలోగా చేయడం జరుగుతుంది. కాని సంయోగం జరిగిన రెండు గంటలలోగా ఈ పరీక్ష చేస్తే పురుష బీజకణాలు ఎంత చైతన్యవంతంగా గర్భాశయంలోకి పయనించగలుగుతున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకి ఒక ప్రత్యేక సాధన ద్వారా గర్భాశయ కంఠంనుంచి తెల్లగా సుద్దగా ఉన్న దానిని కొద్దిగా తీసి మైక్రోస్కోప్ క్రిందపెట్టి వెంటనే పరీక్ష చేయడం జరుగుతుంది. సక్రమంగా ఉన్న పరిస్థితుల్లో మైక్రోస్కోపు క్రింద పరీక్ష చేసి చూస్తున్నప్పుడు ప్రతి ఫీల్డులోను పదినుంచి పదిహేను పురుష బీజకణాలు చైతన్యవంతంగా కనబడతాయి.

ఒకవేళ పురుష బీజకణాలు అధిక ఆమ్లద్రవాలవల్ల గర్భాశయంలోకి చేరలేని స్థితిలో ఉంటే ఈ పరీక్ష చేసినప్పుడు బీజకణాలు మామూలుకంటే చాలా తక్కువగా వుంటాయి. గర్భాశయకంఠం దగ్గర పూట ఉన్నా పుండున్నా కుటుంబ నియంత్రణకి సంబంధించిన బిళ్ళలుకాని, పేస్టూగాని సంయోగం సమయంలో యోని ద్వారంలో ఉంచినా ఈ రత్యానంతర పరీక్షవల్ల సరైన రిపోర్టు రాదు. పైన చెప్పుకున్న పరీక్ష లన్నింటివల్ల ఒక్కొక్కసారి వంధ్యత్వానికి కారణం ఏమీ కనబడకపోవచ్చు. కామశిల్పం సరిగ్గా తెలియకపోయినా, గర్భాధారణకాలంలో సంయోగం జరపకపోయినా వంధ్యత్వానికి కారణం అవుతుంది.