రాజశేఖర చరిత్రము

రాజశేఖర చరిత్రము
(రాజశేఖర చరిత్ర నుండి దారిమార్పు చెందింది)

తెలుగు భాషలో మొట్ట మొదటి బహుళ ఆదరణ పొందిన వచన నవల. దీనిని రచించినది కందుకూరి వీరేశలింగం. ఈయన ఈ నవలను అలీవర్ గోల్డ్‌స్మిత్ ఆంగ్లంలో వ్రాసిన ది వికార్ అఫ్ వేక్ ఫీల్డ్ నుండి ప్రేరణపొంది రచించినా గోల్డ్‌స్మిత్ రచనతో పెద్దగా సంబంధములేదని అన్ని విషయాలు కొత్తవేనని పుస్తకంగా రెండవ ముద్రణ వెలువడినపుడు వీరేశలింగం తెలియచేశాడు. ఈ పుస్తకం ఆంగ్లం,[1] తమిళం, కన్నడ మొదలగు భాషలకు అనువాదం చేయబడి ప్రజాదరణ పొందినది. ఎన్నోసార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎంపిక చేయబడింది.

రాజశేఖర చరిత్రము
1987లో విశాలాంధ్ర ప్రచురణ రాజశేఖర చరిత్రము ముఖపత్రము
రచయిత(లు)కందుకూరి వీరేశలింగం
దేశంభారత దేశం
భాషతెలుగు
శైలినవల
ప్రచురణ సంస్థ1880

తెలుగు నవలలో ఇదే మొదటిది కాకున్నా ఈ పుస్తకం ప్రభావం రీత్యా తెలుగు మొదటి నవలగా పేరుగాంచినదని, తరువాత వ్రాసిన నవల లన్నిటికీ, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశేఖర చరిత్రమే మార్గదర్శకంగా వున్నది కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయినదని ఈ నవలపై విమర్ననాత్మక గ్రంథం రాసిన రాసిన డా. అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నాడు. ఈ నవలలో ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులుగారు ఈ నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారని రమాపతిరావు తెలిపాడు. సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయ చరిత్రలో తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని వ్రాసుకున్నారు.

తొలి తెలుగు నవల

మార్చు

తెలుగులో ఏది తొలి తెలుగు నవల అన్న విషయంపై కొన్ని వాదాలున్నాయి. అందుగురించి దార్ల వెంకటేశ్వరరావు తన వ్యాసంలో ఇలా వ్రాశాడు:[2]

కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన “రాజశేఖర చరిత్రము” (1878) ను విమర్శిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి తొలిసారిగా “నవల” అనే పదాన్ని ప్రయోగించాడు. అంతకుముందు నరహరి గోపాల కృష్ణమశెట్టి శ్రీ రంగరాజ చరిత్రము (1872) రాసినా, దాన్ని ఆయన “నవీన ప్రబంధము” అని తెలుగులోనూ, ఆంగ్లంలో రాసుకున్న “Preface”లో “Novel” అని చెప్పుకున్నారు. పదహారవ శతాబ్దంలోనే తెలుగులో నవల వచ్చిందనే పరిశోధకులూ ఉన్నారు. తెలుగులో పింగళి సూరన రాసిన “కళా పూర్ణోదయం” తొలి తెలుగు నవల అవుతుందన్నారు. దీన్ని “ప్రబంధంగా”నే సాహితీ పరిశోధకుల్లో అత్యధికులు గుర్తిస్తున్నారు. కథ కల్పితమే కానీ, ఆధునిక నవలకు ఉండవలిసిన లక్షణాలు “కళా పూర్ణోదయం”లో లేవని పరిశోధకులు (ఆచార్య జి.నాగయ్య 1996 : 809) స్పష్టం చేశారు.

కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు 1867 లో రాసిన “మహాశ్వేత”ను తెలుగులో మొట్ట మొదటి నవల అని నిడుదవోలు వెంకటరావు తదితర పరిశోధకులు పేర్కొన్నారు. కానీ, ఇది బాణుడు సంస్కృతంలో రాసిన “కాదంబరి” కి అనువాదమే తప్ప స్వతంత్ర కల్పన కాదు. అంతే కాకుండా దీనికి ఆదునిక సాహిత్య ప్రక్రియ నవలా లక్షణాలు లేవని, పైగా “మహాశ్వేత” పూర్తిగా లభించలేదనీ పరిశోధకులు భావించారు.

తెలుగు నవలపై పరిశోధన చేసిన వాళ్ళలో తొలి తెలుగు నవల ఏది అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. “ఆంధ్ర నవలా పరిచయం” పరిశోధనలో మొదలి నాగభూషణం శర్మ, “తెలుగు నవలా వికాసము” పరిశోధనలో బొడ్డుపాటి వేంకట కుటుంబరావు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం”లో ఆరుద్ర తదితరులు తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారు రాసిన "శ్రీ రంగరాజ చరిత్రము”ను గుర్తించారు. దీనికే “సోనాబాయి పరిణయం” అనే మరో పేరు కూడా ఉంది.

కందుకూరి వీరేశలింగం పంతులు గారి రచనలపై సమగ్ర పరిశీలన చేసిన అక్కిరాజు రమాపతిరావు, “తెలుగు సాహిత్య వికాసము”లో పుల్లా బొట్ల వేంకటేశ్వర్లు, "సమాజము - సాహిత్యం"లో ఆర్.ఎస్. సుదర్శనం మొదలయిన వారంతా కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన “రాజశేఖర చరిత్రము”నే తొలి తెలుగు నవలగా పేర్కొన్నారు. ఇంకా చాలామంది పరిశోధకులు తొలి తెలుగు నవలపై లోతుగానే చర్చించారు. “రాజశేఖర చరిత్రము” వెలువడిన తర్వాత అనేక మంది రచయితలను ప్రభావితం చేసి, తెలుగులో అనేక నవలలు వెలువడటానికి కారణమయ్యింది. ఈ నవలకున్నంత ‘ప్రభావం -మార్గదర్శనం’ అంతకుముందు వచ్చిన నవలలకు లేవు.

రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము వలన అతని కుటుంబం ఎన్నోకష్టాలపాలవుతుంది. రకరకాల మలుపుల తర్వాత మరల కుటుంబం ఆ కష్టాలను అధిగమిస్తుంది. రాజశేఖరుడు ఊరి పెద్దగా, తన ధనాన్ని దేవాలయం కొరకు, బంధు మిత్రుల కపట కష్టాలు తీర్చటానికి ఖర్చు చేస్తాడు. అంధ విశ్వాసాలకు లోనై బంగారం చేస్తాననే దొంగ బైరాగి దగ్గర బంగారాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తరువాత కుటుంబంతో రాజమహేంద్రవరం వెళతాడు. అక్కడనుండి కాశీ యాత్రకు బయలుదేరి, మార్గమధ్యమంలో రామరాజు అనే మనిషికి ప్రాణాలు నిలుపుతాడు కాని కూతురు కూరమృగాలపాలైందనుకుంటాడు. ఒక వ్యక్తి సహాయంతో పెద్దాపురం చేరి అక్కడ రాజ ప్రతినిధి శోభనాద్రిరాజు కపటానికి లొంగి కుమార్తె వివాహం చేయబోగా, ఒక అగంతుకుని సాయంతో ఆ ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత అప్పుతీర్చలేక కారాగార వాసం పాలవుతాడు. చివరకు కుమార్తెను ఎవరో ఎత్తుకొని పోగా, మరల మారువేషంలో వున్న రామరాజు సాయంతో రక్షించబడి, కుటుంబం సభ్యులందరూ మరల కలుస్తారు. కాశీలో అసువులు బాసాడని అనుకున్న అల్లుడు కూడా ఇల్లు చేరతాడు. రామరాజు అనే వ్యక్తే కృష్ణజగపతి మహారాజుగారని తెలిసి ఆయన సహాయంతో స్వంత ఊరు చేరి, అంధవిశ్వాసాలను విడిచి, అర్భాటలకులోనవక జీవితం గడుపుతాడు.

విశేషాలు

మార్చు

కందుకూరి వీరేశలింగం పంతులుగారు “రాజశేఖర చరిత్రము” ఆయన సమకాలీన కాలాన్ని ప్రతిఫలించేటట్లు రాశారు. ఆయన రాసిన నవలకు "వివేకచంద్రిక" అనే పేరు కూడా ఉంది. అంధ విశ్వాసాలవల్ల, ఆవివేకఫుటాచారాలను ఉపయోగించుకొని సంఘంలోని కపటులు కల్లరులు, కుక్షింబరులు, స్తుతి పాఠకులు, దాంభికులు బాగుపడుతున్నది తెలియచేస్తుంది. ప్రతి సంఘటనా - ఒక సాంఘిక దురా చారాన్నీ, ఒక మూఢ విశ్వాసాన్నీ హేళన చేసి, వికృత పరచి, విమర్శించే ఉద్దేశంతో కల్పించబడింది. రుక్మిణి కాసులపేరు రథోత్సవంలో దొంగిలించ బడటం - ప్రశ్న చెప్పేవారి దాంభిక వర్తనను బట్టబయలు చేయటానికీ, నృసింహస్వామి మరణవార్త ఎఱుక చెప్పువాళ్ళ కాపట్యాన్ని, ఎరుక నమ్మేవాళ్ళ మూర్ఖత్వాన్నీ హేళన చేయటానికీ, నృసింహ స్వామి రుక్మిణి కలలో కల్పించటం- భూత, ప్రేత , పిశాచాదులను వేళాకోళం చేయటానికీ పంతులు గారు కల్పించారు. హరిశాస్త్రుల భూతవైద్యం, పిఠాపురంలో ఆంజనంవేసి దొంగను పట్టటం, స్వర్ణయోగం తెలుసు నన్న బైరాగి- ఇచ్చిన స్వర్ణాన్ని దొంగిలించి పలాయనం చిత్తగించటం, సిద్ధాంతి కూతురు గ్రహ బాధ, సుబ్బారాయుడి ఆతుర సన్యాసం, హరి పాపయ్య శాస్త్రుల వారి భోజన పాండిత్యం, పీఠాధిపతుల ఆర్భాటాలూ; మఠాధిపతుల కుక్షింభరత్వం, ఇళ్ళు కాలిపోతే గ్రామదేవతకు శాంతి చేయడం - ఇంకా వీధి బడుల్లోని అక్రమాలూ, వంట బ్రాహ్మలూ-శవవాహకుల మూర్ఖవర్తనలు పంతులుగారు యీ నవలలో విమర్శించారు. ఆ నవలలో అంతరించిపోతున్న రాజరిక జీవిత లక్షణాలు కనిపిస్తాయి. దాంతో పాటూ అశాస్త్రీయ విషయాలను ఖండించటం కనిపిస్తుంది. మూఢ విశ్వాసాలను కొన్ని పాత్రల ద్వారా కల్పించి వాటి వల్ల జరుగుతున్న మోసాలను కూడా వివరించారు. కానీ, ఈ నవల నిండా తెలుగు వాళ్ళ జీవితం, వాళ్ళు జీవించిన పరిసరాలూ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. పైగా కందుకూరి వారి రచనల నిండా ఆధునిక సంస్కరణ భావాలు ఉన్నాయి.

మూలాలు, వనరులు

మార్చు
  1. K, Veeresalingam (1887). Fortune's wheel. London: ELliotstock. Retrieved 1 April 2018.
  2. దార్ల, వెంకటేశ్వరరావు. "తొలి తెలుగు నవల". సాహిత్యవేదిక. Retrieved 1 April 2018.
  • తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్ ద్వా.నా.శాస్త్రి - ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
  • కందుకూరి వీరేశ లింగం - డాక్టర్ అక్కిరాజు ఉమాపతి రావు - "తెలుగు వైతాళికులు" లఘుగ్రంధాల పరంపరలో ముద్రింపబడినది - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006)
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: