వచన కవిత

(వచనకవిత నుండి దారిమార్పు చెందింది)

పాతకాలం పద్యమైతే వర్తమానం వచన కవిత. ఆంగ్లంలోని ఫ్రీవర్స్ అన్నదానికి సమానార్థకంగా వచన కవిత అన్న పదం ప్రయోగింపబడుతోంది. తెలుగు కవిత్వం ప్రక్రియలలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది వచన కవిత్వమే. తెలుగు కవిత్వానికి పద్యమే దిక్కు అన్నది అంగీకరించక, కొత్త ధోరణుల్లో తెలుగు కవితా ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలన్న తపనతో యువ కవులు చేసిన ప్రయోగమే వచన కవిత.

కుందుర్తి ఆంజనేయులు వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. నగరంలోవాన కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచన కవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం తెలుగు సాహిత్య లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో తెలుగు సాహిత్య లోకం హోరెత్తింది. వచనం లో రాస్తే అది కవిత్వము ఎలా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.

వచన కవితా ప్రక్రియలో అవధానం నిర్వహించాలని కుందుర్తి ఆంజనేయులు ఆలోచన చేసినా అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు ఏభై సంవత్సరాల తరువాత ర్యాలి ప్రసాద్ వచన కవిత్వంలో అవధాన ప్రక్రియ ప్రారంభించి దశావధానాలు, శతావధానాలు, సహస్రావధానం,మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు.కవి భావుకతకు, భావప్రకటనా స్వేచ్చకు చందస్సు ఆటంకం కాబట్టి చందోరహితమైన వచనం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుందన్నది వచన కవుల అభిప్రాయం. వచన కవితకు శిష్ట్లా , పఠాభి, నారాయణ బాబు, శ్రీశ్రీ వంటి వారు ఆద్యులు కాగా, కుందుర్తి వచన కవితా ఉద్యమాన్ని నిర్వహించి వచన కవితా పితామహుడు అని పేరు తెచ్చుకున్నాడు.

వచన కవితా లక్షణాలు:

మార్చు
  • శ్రీ శ్రీ అన్నట్లు చందో బందోబస్తులన్నీ వచన కవిత తెంచింది.
  • వచన కవితలో గేయ కవిత లాగా మాత్ర చందస్సు కూడా నిబద్దం కాదు.
  • కాలం మారిన దశలో పాత కవి సంప్రదాయలను, అలంకారాలను వచన కవిత తిరస్కరించింది.
  • సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం.
  • చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత భావుకతకు ప్రాధాన్యత నిచ్చింది.
  • ఆకర్షణీయమైన అంత్య ప్రాసలు వచన కవితకు అలంకారాలయ్యాయి.
  • చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు.

వచనకవిత చందో ప్రాధాన్యం లేనిది కాబట్టి అనవసర పదాలు, పదాడంబరం పట్ల ప్రత్యేక శ్రద్దా ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యతనివ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన వచన కవితలు రాస్తున్నవారిలో కె. శివారెడ్డి, నందినీ సిధారెడ్డి, ప్రేంచంద్, అఫ్సర్ వంటి కవులు వచన కవితా ప్రక్రియకు వన్నెలు తెస్తున్నవారు. ఇప్పుడు పద్యం రాసే వారికంటే వచన కవిత రాయడం వైపే మొగ్గు చూపేవారు ఎక్కువ. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వచన కావ్యానికి పురస్కారాన్ని ప్రకటించి వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేస్తోంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వచన_కవిత&oldid=4232891" నుండి వెలికితీశారు