కుందుర్తి ఆంజనేయులు

కవి మరియు తెలుగు రచయిత.

వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడైన కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి, ప్రముఖ తెలుగు రచయిత. ఆంధ్ర ప్రాంతంలో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రగిలించే తమ కవిత్వంతో తెలంగాణా సాయుధ పోరాటానికి అజ్యం పోసిన కవులలో ప్రముఖుడు.[1]

కుందుర్తి ఆంజనేయులు
జననంకుందుర్తి ఆంజనేయులు
డిసెంబర్ 16, 1922
కోటవారి పాలెం, గుంటూరు జిల్లా
మరణం1982
ఇతర పేర్లువచన కవితా పితామహుడు
భార్య / భర్తసుందరమ్మ
Notes

జననంసవరించు

ఆంజనేయులు 1922, డిసెంబర్ 16న గుంటూరు జిల్లా కోటవారిపాలెం గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన వినుకొండలో చదువుకున్న కాలములో గుర్రం జాషువా ఈయనకు తెలుగు మాష్టారుగా ఉన్నాడు. 1936 నుండి 1941 వరకు విజయవాడ పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడే 1937లో కవిత్వం వ్రాయటం ప్రారంభించాడు. విజయవాడ ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో ఈయన విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత గుంటూరు ఆంధ్రా కైస్తవ కళాశాల నుండి బి.ఏ పట్టా పుచ్చుకున్నాడు.[2]

జీవిత విశేషాలుసవరించు

ఆంజనేయులు నరసరావుపేటలో నవ్యకళా పరిషత్తు స్థాపించాడు. ఆ కాలంలోనే ఆయన కమ్యూనిష్టు భావాలకు ఆకర్షితుడైనాడు. దేవేంద్రపాడు గ్రామములోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా, ప్రిన్సిపాలుగా పనిచేశాడు. ఆ తరువాత కొన్నాళ్ళు గుంటూరు పొగాకు మార్కెట్టులో పనిచేశాడు. 1956లో కర్నూలులో సమాచార ప్రసారశాఖలో అనువాదకునిగా చేరాడు. ఆ తరువాత హైదరాబాదుకు బదిలీ అయ్యాడు. 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించాడు.[3] 1967లో యువతలో వచన కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉత్తమ వచన కవిత్వానికి ఒక బహుమతి ప్రారంభించాడు.[4] 1977లో ఈయన ఉద్యోగ జీవితమునుండి విరమణ పొందాడు.

1944లో కందుర్తి అంజనేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసులతో కలిసి మొట్టమొదటి కవితా సంకలనం నయగారా ప్రకటించాడు. ఈ ముగ్గురూ నయగారా కవులుగా ఆధునిక తెలుగు సాహిత్యములో ప్రసిద్ధి చెందారు. అంజనేయులు సమగ్ర రచనలు 1974లో ప్రచురించబడినవి. కుందుర్తి అనేక పురస్కారాలు అందుకున్నాడు. వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు 1969లో అందుకున్న సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారము ప్రతిష్ఠాత్మకమైనవి.[5]

ఈయన రచనలలో సౌప్తికం, రసధుని, అమావాస్య, నా ప్రేయసి, నయాగరా, తెలంగాణ, దండియాత్ర, ఆషా, నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేనుకాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండా, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకు మాట మొదలైనవి ముఖ్యమైనవి. వచనాన్ని సాహిత్యముగా పరిగణించని రోజులలో కందుర్తి వచన కవిత్వాన్ని ప్రోత్సహించాడు. కవిత్వము గతమని, వచన కవిత్వము వర్తమానమని చాటాడు.

ఆయన మరణించిన తరువాత ప్రముఖ సాహితీ సమితి రంజని ఆయన పేరిట 1984 నుంచి ఇప్పటి వరకు ఏటేటా వచన కవితల పోటీలు నిర్వహించి అవార్డులు ప్రకటిస్తూ ఉంది. మరణించిన తరువాత కూడా ఆయన యువ కవులకు ఈ విధంగా స్ఫూర్తిని ఇస్తూ ఉన్నాడు.

మూలాలుసవరించు

  1. Handbook of Twentieth-Century Literatures of India By Nalini Natarajan, Emmanuel Sampath Nelson పేజీ.312 [1]
  2. http://www.vedah.net/manasanskriti/Kundurti.html
  3. http://www.kritya.in/08/En/name_of_poetry1.html
  4. Encyclopaedia of Indian literature vol. 1 By various పేజీ.4451
  5. Modern Indian Literature: An Anthology By K. M. George, Sahitya Akademi పేజీ.1119 [2]