వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి

వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి (1869 - 1910) తెలుగు రచయిత, తిరుపతి సంస్కృత కళాశాల ప్రధానాధ్యాపకునిగా పనిచేసాడు. అతను సర్వతంత్ర స్వతంత్ర, తర్కాలంకార వాగీశ, కవికుల చూడామణి బిరుదాంకితుడు.

జీవిత విశేషాలు

మార్చు

వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి న్యాయ శాస్త్రమునకు చెందిన పండిత వంశములో చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకాలోని కార్వేటి నగర సమీపమున సావన కుశస్థల నదీతీరమునున్న కత్తెరపల్లి గ్రామములో 1869 లో జన్మించాడు. అతను కాశ్యప గోత్రమునకు చెందిన ములకనాటి బ్రాహ్మణులు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలోని వట్టిపల్లి గ్రామమును అతని పూర్వీకులలో ఒకరికి కర్నూలు నవాబు దానమునిచ్చిరి. అప్పటి నుండి ఈ వంశమువారందరికిని వట్టిపల్లి వారని పేరువచ్చెను. అతని వంశీయులందరు అహోబిలం నరసింహస్వామి భక్తులు. అతి ప్రాచీనులైన వీరి పూర్వీకులలో సమస్త శాస్త్ర పండితులైన వీరరాఘభట్టాచార్యుల వారు కాశీకి వెళ్ళి, అచట విద్యాభ్యాసము చేసి కాశీరాజు ఆస్థానమున పండితునిగా చేరెను. అతనికి భట్టాచార్య అని బిరుదును కూడా కాశీరాజు ఇచ్చాడు. భట్టాచార్యులకు నలుగురు కుమారులు. వారిలో మొదటివాడు కాశీనాధశాస్త్రి తర్కాలంకారవాగీశ బిరుదాంకితుడు. రెండవ పుత్రుడు సాంబశివశాస్త్రి కూడా సకల శాస్త్ర పారంగతుడు. ఇతని కుమారుడే వేరేశ్వర శాస్త్రి. వేరేశ్వర శాస్త్రి కుమారుడు సాంబశివశాస్త్రి సాహితీవేత్త . సాంబశివశాస్త్రి భార్య వేంకటలక్ష్మి. వీరిద్దరికి జన్మించిన పుత్రుడే నరకంఠీరవ శాస్త్రి. ఈ విషయములన్నింటిని శాస్త్రిగారు తమ అభినవవాసవదత్తలో పేర్కొన్నాడు.

శాస్త్రిగారు తమ స్వగ్రామములో శ్రీ ఆలూరి శేషశాస్త్రి వద్ద కొంత విద్యనభ్యసించి పిదప తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత పాఠశాలలో చదువుచు తమ మేనమామ అగు శ్రీ సాధు వేంకటరాయ శాస్త్రి గారి పోషణలో నుండిరి. కళాశాలలో సుప్రసిద్ధ తర్కశాస్త్ర పండితులగు మహామహోపాధ్యాయ శ్రీ కపిస్థలం దేశికాచార్యులవద్ద తర్కశాస్త్రమును క్షుణ్ణముగా చదివిరి. ఆకాలములో తిరుపతిలో వ్యాకరణ శాస్త్రములో మహాపండితులని పేరుగాంచిన శ్రీ ముష్ణం సుబ్బరాయాచార్యులవద్ద వ్యాకరణమును చదివిరి.

శాస్త్రిగారికి త్రిపురసుందరి అను కన్యతో వివాహము జరిగెను. కాని ఆమె 1893-94 ప్రాంతములో మరణించగా సుబ్బలక్ష్మి అను ఆమెను ద్వితీయ వివాహము చేసుకొనెను. వారికి మొదటి భార్య వలన నరహరి అని కుమారుడు, రెండవ భార్య యందు కాశీనాధశాస్త్రి అను కుమారుడు జన్మించెను. శాస్త్రిగారు కాళహస్తిలో శ్రీ కురువాడ రాఘవయ్య ఆద్వర్యమున అద్వైత సభలో శాస్త్ర చర్చలలో పాల్గొని సువర్ణ కంకణమును బడసిరి. శాస్త్రిగారు భరతనాట్యమును చక్కగా అభ్యసించి శ్రీ కాళహస్తి సంస్థానము పారితోషకమును కూడా పొందిరి.

శాస్త్రిగారి అలంకార శాస్త్రమునందు మిక్కిలి అభిమానము. కావున వారు సుమారు 22సం.లు విద్యార్ధుల అలంకార శాస్త్రము, న్యాయ శాస్త్రము బోధించిరి. ఒక్కోదొనమున ఒక్కో వృత్తమునందు పాఠములను బోధించెడివారు.

రచనలు

మార్చు

అపార శాస్త్ర వైదుష్యము కల్గిన శాస్త్రిగారు పెక్కు గ్రంధములను రచించిరి. వీరి రచనలలో కొన్ని స్వతంత్రములు, మరికొన్ని పరిష్కరణలు, పీఠికా రచనలు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

  • కావ్య లక్షణవాదము
  • రసలక్షణవాదము
అలంకార గ్రంధములు
  • అద్వైత చంద్రోదయము
  • నయమంజరీ
  • అద్వైత మంజరీ
  • కర్మందీ
అద్వైత గ్రంధములు
  • అభినవ వాసవదత్త
పద్య కవ్యము
  • శ్రీ జ్ఞానప్రసూనాంబికా నవరత్నమాలికాస్తుతి
  • యతిసార్వ భౌమోహారము
  • శ్రీ వేంకటేశ్వరాష్టకం
  • శ్రీ వేంకటేశ్వరస్తుతి
  • శ్రీ కపిలేశ్వరస్తుతి
స్తుతులు
  • ధూమశకటం (తెలుగు)
  • మహాకావ్య రత్నావళి కి పీఠిక
  • శ్రీ వ్యాస తాత్పర్య నిర్ణయం (పీఠిక)
  • తత్త్వ చంద్రిక కు (పీఠిక)

వీరు జీవితకాలమంతయు అనారోగ్యముతో బాధపడుచుండేవారు. శ్రీ శాస్త్రిగారు అజీర్ణవ్యాధితో బాధపడుతూ తమ 41వయేట 1910లో తిరుపతిలో మరణించాడు.

మూలాలు

మార్చు
  • 1978 భారతి మాసపత్రిక. వ్యాసము: అపరమమ్మట శ్రీ వట్టిపల్లి నరకంఠీరవ శాస్త్రి. వ్యాసకర్త: డాక్టర్ కాశీభట్ట సేతురామేశ్వరదత్త.