వయ్య రాజారాం
వయ్య రాజారాం తెలంగాణ దళిత కవి[1]. అతను నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన పోలీసు చర్యనూ విమర్శిస్తూ గళమెత్తాడు. 'రంగు రంగుల మారి నెవురయ్యా - నీ రంగు బైరంగమాయే నెవురయ్యా - కుడిన టాటాగాళ్ళు ఎడమ బిర్లాగాళ్ళు - నడినెత్తిన ట్రామసయ్య నెక్కించుక - సోషలిజమంటావు నెవురయ్యా - నీ వేషమంత దెలిసింది నెవురయ్యా' అని నిలదీశాడు[2]. ఇతని తమ్ముడు వయ్యా సామేలు కూడా రచయితగా, తెలంగాణ సాయుధ పోరాట యోధునిగా తన సేవలనందించాడు[3].
జీవిత విశేషాలు
మార్చువయ్య రాజారాం జనగామ జిల్లా దేవరుప్పల గ్రామంలో జన్మించాడు. బాల్యంలో తల్లిదండ్రుల చెంత పెరిగినా కౌమర దశలో ఉద్యమ బాట పట్టాడు. 14 సంవత్సరాలకే ఆంధ్ర మహాసభలకి మారుపేరైన "సంగం"లో సభ్యునిగా చేరాడు. ఆ సభ్యత్వంకోసం అణా పైసలు సంపాదించడానికి కొన్ని రోజులు కూలీగా పనిచేశాడు. అప్పటికే అతని తండ్రి వయ్య ముత్తయ్య కూడా సంగం సభ్యునిగా ఉండేవాడు. ఐతే ఇద్దరి దారులు వేరువేరు. ఒకరు బాలసంఘం సభ్యులు. మరొకరు పార్టీ సభ్యులు. ఐనా రాజారాం పిల్లవాడిగా ఉంటూనే పెద్దలతోపాటుగా పనులు చేశాడు. ఆ ప్రాంతంలో విసునూరి దొరవారి ఆగడాలు మితిమీరిపోయాయి. దొరవారి కొడుకు బాబు దొర బయటికి వచ్చాడంటే క్రూరంగా ప్రవర్తించేవాడు. కనుపించిన ప్రతీవారి శరీరంపై బెత్తం దెబ్బలు, అతనికి వంగి దండం పెట్టకుంటే వాడిపై రాతి బరువులు వేసి శిక్షించడం, సంగంలో చేరిన వారిపై వీపు దెబ్బలు వంటి అకృత్యాలకు పాల్పడేవాడు. ఈ కారణంగా రాజారాం ఊరు విడిచిపెట్టి కొంతకాలం రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. ప్రజల బాధలు చూసి విపరీతంగా చలించిపోయి వారికి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. తెగింపు లేకుండా ప్రజలను కాపాడలేమని భావించాడు. శ్రమజీవి వర్గాలపైన దొరల ఆగడాలు పెరిగిపోయాయి. మంగలివాడైన దొడ్డి కొమురయ్య విసునూరి దొర తల్లి జానకమ్మ పెట్టే బాధలు తాళలేకపోయాడు. ఆమె బంట్లుఅయిన కృష్ణారెడ్డి, మసికినలి ప్రజలతో వెట్టి చాకిరి చేయించారు. అదనపు శిస్తులు వేసి డబ్బులు కట్టాలని వేధించారు. గత్యంతరం లేక అందుకు ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపారు. కళ్లతో ఆ దృశ్యాల్ని చూసిన రాజారాం పళ్లు కొరికాడు. ప్రజలను పీడించే దొరల భరతం పట్టాలని పిడికిళ్లు బిగించాడు.
కాసం నారాయణ, ఎలమరెడ్డి మోహనరెడ్డి, గోలి బాల కృష్ణారెడ్డి, నీలారపు ఎల్లయ్య, జాటోతు థాను వంటివారితో కలసి పనిచేశాడు. కాలక్రమంలో వారే ఒక దళంగా ఏర్పడ్డారు. ధర్మారంలో జాటోతు థానుని పోలీసులు కాల్చి చంపారు. ఐనా రాజారాం భయపడలేదు.[4]
రైతాంగ పోరాట యోధునిగా
మార్చుతెలంగాణ రైతాంగ పోరాటంలోని ప్రతి దశలో వెలువడిన పాటలు ప్రజలను అక్కున చేర్చుకున్నాయి. అవి వారి విశ్వాసాన్ని పెంచిన విషయాన్ని అతను గుర్తించాడు. అంతే తాను కవి అయ్యాడు. ఆనాటి పరిస్థితుల్లో కేవలం పాటలొక్కటే సరిపోవడంలేదు. విసునూరి పెట్టిన కష్టాలు, ప్రజల ప్రతిఘటన, పోరాటం వంటి అంశాలు చెప్పడానికి కథ కావాలి. పాట పెరిగి బుర్రకథ అయింది. ఒగ్గుకథ అయ్యింది. పది నిముషాల పాట మూడు గంటల ప్రదర్శన అయ్యింది. రాజారాం ఇద్దరు వ్యక్తులతో బుర్రకథ దళం ఏర్పాటు చేశాడు. అతని ప్రదర్శనలు తెలంగాణ అంతటా మారుమోగాయి. కానీ ఆహార్యం, సంగీత వాద్యాలు వేదిక వంటివి దొరకని నేపథ్యంలో ఒగ్గుకథని బుర్రకథకి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సి వచ్చింది. ఒగ్గుకథ రాజారాంకి మారుపేరైంది. వందలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ఐతే తన రహస్య జీవితానికి కళా ప్రదర్శనని తోడు చేసుకున్నాడు. ప్రజలకు ఆనాటి, తక్షణ శిక్షణలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శన ఉండాలని భావించాడు. ప్రతి ప్రదర్శనని ఒక శిక్షణ తరగతిగా మార్చిన ఘనత రాజారాందే.
‘పోతుందీ దోపిడి రాజ్యం/వస్తుంది పేదోల్ల రాజ్యం’ అని పదహారో ఏట పాటపాడి ప్రజారాజ్య పోరాటానికి తన గళాన్ని అంకితం చేసాడు. అలాంటి రాజారాంకి వయసులేదని పార్టీ సభ్యత్వం నిరాకరించింది. కాని మిర్జా ఇస్మాయిల్ ఆర్డర్‌తో పిన్న వాడైన రాజారాంని చంచల్‌గూడ జైలుకి పంపారు. ఆ తర్వాత మూడేళ్లు, జాల్నా (మహారాష్ట్ర) జైలు పాలు చేశారు. అందరికన్నా చివరన 1954లో విడుదలయ్యాడు. బయటవుంటే పసివాడని చూడకుండా దొర గుండాలు నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవారు. పాట, శ్రమ జీవుల అండ ఉన్న రాజారాం ఒక మందు పాతర. అలాంటి కవి రహస్య జీవితం గడుపుతూ ఇంటికి వచ్చి అర్ధరాత్రి తల్లి ఇచ్చే జొన్న రొట్టె తిని కడుపు నింపుకున్నాడు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చాకే, పోరాటం మధ్యలో ఆపేశాక అంతకు ముందు ఏదో విధంగా నడిచిన సంసారం ఇప్పుడు దారిద్య్రంతో బాధపడింది. పేదల రాజ్యం కోసం పోరాడిన రాజారాం మరింత పేదగా జీవితం గడపవలసి వచ్చింది[5].
మూలాలు
మార్చు- ↑ krishna (2016-07-04). "సాయుధ పోరులో భూమిపుత్రుల సాహిత్యం". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-01-14.[permanent dead link]
- ↑ "జన హితమే సాహిత్యం.. ఇదే చారిత్రిక సత్యం | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2019-01-14.[permanent dead link]
- ↑ "సాయుధ పోరాట 'బాల కొరియర్' ఇకలేరు". www.andhrajyothy.com. 2019-01-11. Retrieved 2019-01-14.[permanent dead link]
- ↑ తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజాసాహిత్యం-జయధీర్ తిరుమలరావు. సాహితి సర్కిల్, 1988. 1988. p. 272.
- ↑ "Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". isonymic2.rssing.com. Retrieved 2019-01-14.