తెలంగాణా సాయుధ పోరాటం

తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.

నేపథ్యం

మార్చు

తెలంగాణ సాయుధ పోరాటానికి మూలాలు నిజాం నిరంకుశ పాలనలో ఉందని చారిత్రికులు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజ్యంలో పాలకుడు ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్థాయి నుంచి గ్రామాల్లోని దొరల వరకూ సాగిన అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు నేపథ్యంగా నిలిచాయి. ఇవే కాక ప్రభుత్వం ప్రజలపై బలవంతులైన దొరలు, ఇతర శక్తులు దౌర్జన్యం చేయడాన్ని అడ్డుకోలేదు. 1830ల్లోనే హైదరాబాద్ రాజ్య స్థితిగతుల గురించి తన కాశీయాత్రచరిత్రలో వ్రాసిన తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ విషయాలు ప్రస్తావించారు. 1820-30ల నడుమ రెండు సార్లు హైదరాబాద్ రాజ్యాన్ని, నగరాన్ని సందర్శించిన ఆయన హైదరాబాద్ నగరంలో ఆయుధపాణులైన వ్యక్తులు మెత్తనివారిని (బలహీనులను) కొట్టి నరికే పరిస్థితి వుందని, అందుకు గాను యాత్రికులు విధిగా కొందరు బలవంతులైన ఆయుధపాణులను తీసుకునే బయట తిరగాల్సివుంటుందని వ్రాశారు. సుంకాల వసూలు వ్యవస్థ గురించి వ్రాస్తూ హైదరాబాద్ నగరంలో సుంకాలు వసూలుచేసేవారు సరిగా ఇవ్వనివారిని చంపినా అడిగే దిక్కులేదని వ్రాసుకున్నారు.[1]

వెట్టి చాకిరి సమస్య

మార్చు

గ్రామాలపై పెత్తనం వహించే దొరలకు, గ్రామాధికారులకు గ్రామాల్లోని వివిధ వృత్తులవారు వెట్టి చాకిరీ చేసే పరిస్థితులు నిజాం పాలన కాలంలో నెలకొన్నాయి. దొర ఇళ్లలో జరిగే వివిధ వేడుకలకు, శుభకార్యాలకు గ్రామంలోని అణచివేయబడ్డ కులాల వారి నుంచి మొదలుకొని వ్యాపారస్తులైన కోమట్ల వరకూ ఉచితంగా పనిచేయవలసి రావడం, డబ్బుతో పనిలేకుండా సంభారాలు సమకూర్చడం వంటివి జరిగేవి. గ్రామంలోకి పై అధికారులు వచ్చినప్పుడు జరిగే విందు వినోదాలకు ధాన్యం, మాంసం, కాయగూరలు వంటివి ఇవ్వడానికి ఊరందరికీ బాధ్యతలు పంచేవారు. వంట పని, వడ్డన పని మొదలుకొని అన్ని పనులూ పంచబడేవి. ఇదే కాక నిత్యం దళిత కులాలకు చెందిన వెట్టివారు అధికారులు, దొరల ఇళ్ళలో వెట్టిపని చేసి దయనీయంగా జీవితాన్ని గడపవలసి వచ్చేది. తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభమయ్యాకా ప్రజలను ఉత్తేజపరిచే పోరాటగీతాల్లో కూడా విరివిగా వెట్టిచాకిరీ సమస్య చోటుచేసుకుంది.

భావ వ్యక్తీకరణపై ఆంక్షలు

మార్చు

ఏడవ నిజాం పరిపాలించిన ప్రాంతంలో తెలుగువారు, కన్నడిగులు, మరాఠీ వారు, గణనీయమైన సంఖ్యలో తమిళులు ఉండగా కేవలం ఉర్దూ భాషను మాత్రమే ప్రోత్సహించి మిగిలిన భాషలను అణచివేసే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. విద్య విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోని ఉర్దూభాషకే ప్రోత్సాహం, ఆ భాషను నేర్చినవారికే అవకాశాలు దక్కుతూండేది. ఈ కారణంగా ఇతర భాషలు మాతృభాషగా కలిగినవారు ఉర్దూను నేర్చుకునేవారు. నిజానికి ఉర్దూ భాష విదేశీభాష కానీ, ఒక మతానికి చెందిన భాష కానీ కాదని అది దక్కన్ ప్రాంతంలో అభివృద్ధి చెందిన దేశీయభాషేనని ఆ ప్రాంతీయులు అభిమానించారు. ఉర్దూను ఆదరించి నేర్చి ఆ భాషలో కవిత్వం చెప్పినవారు ఉన్నారు. ఉర్దూపై వ్యతిరేకత లేకున్నా తమ మాతృభాషలను అణచివేయడం అసంతృప్తిగా మారింది. భాష, సంస్కృతుల అణచివేతను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన వివిధ సంస్థలు, భాషోద్యమం, గ్రంథాలయోద్యమాలతో ప్రజాజీవితం ప్రారంభించిన పలువురు నాయకులు సాంఘిక సమస్యలపై చివరకు రాజకీయంగా నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాల్లో కీలకపాత్ర పోషించారు. నిజాం పాలనలో చివరికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా ముందస్తు అనుమతులు అవసరమయ్యే పరిస్థితి నెలకొని ఉండేది. పత్రికలను చదవడాన్ని కూడా ఒప్పుకోని జాగీర్దారులు ఉండేవారని దాశరథి రంగాచార్యులు రచించిన మోదుగపూలు వంటి సాహిత్యాధారాలు పేర్కొంటున్నాయి.

ఆర్థిక కారణాలు

మార్చు

అధికవడ్డీలతో దోపిడీచేసి భూవసతి దోచుకోవడం, ఎక్కువ భూములు కొందరు భూస్వాముల వద్దే ఉండిపోయి సామాన్య రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి స్థితిగతులు ఈ పోరాటానికి మూలకారణమని పలువురు కమ్యూనిస్టు చరిత్రకారులు, ఉద్యమకారులు పేర్కొన్నారు. ఈ వాదన ప్రకారం తెలంగాణా సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం సామాన్యుల తిరుగుబాటు. ప్రపంచంలోని రైతుల తిరుగుబాట్లన్నిటిలోకీ అగ్రస్థానం పొందిందనీ తెలంగాణా సాయుధ పోరాటం చూసి ప్రపంచమే విస్తుపోయిందనీ పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నేతలు పేర్కొన్నారు. ఆర్థికపరమైన విషయాలే సాయుధపోరాటానికి ముఖ్యమైన కారణాలని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

మతపరమైన స్థితిగతులు

మార్చు

తొలిదశ

మార్చు

1921 నవంబరు 12న హైదరాబాద్‌లోని టేక్‌మాల్ రంగారావు ఇంట్లో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకునే లక్ష్యంతో ఆంధ్ర జనసంఘం ఏర్పాటుచేశారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ముందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు, రామస్వామి నాయుడు, టేక్‌మాల్ రంగారావు తదితర 11మంది యువకులతో ఆ సంఘం ఏర్పాటైంది. తెలుగు భాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది. వెట్టిచాకిరీ నిర్మూలన వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం వంటివి ప్రారంభించింది. ఆ సంస్థ 1930కల్లా ఆంధ్రమహాసభగా రూపుదిద్దుకుంది.[2]

రెండవ దశ

మార్చు

దొడ్డి కొమరయ్య మరణం

మార్చు

నైజాం అల్లరి మూకలు, విసునూర్‌ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమరయ్య.

1946 జూలై 4న విసునూర్‌ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వాచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గుతుపలు అందుకుని విసునూర్‌, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, విసునూర్‌ దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేస్తూ మరింత ముందుకు సాగుతున్నారు. అశేష ప్రజానీకమంతా ధైర్య సహాసాలతో ప్రాణాలకు బరితెగించి రజాకర్లను ఎదుర్కోవడనికి బోడ్రాయి వరకు చేరుకున్నారు.

అప్పటికే అక్కడ కాపు కాసిన నైజాం అల్లరి మూకలు ఎకపక్షంగా కాల్పులు జరిపారు. ఊరేగింపులోఅగ్ర భాగంగా ఉన్న దొడ్డి కొమరయ్యకు తుపాకి తూటాలు కడుపులో దిగడంతో కమ్యూనిస్టుపార్టీ వర్ధిల్లాలి, జౌ ఆంధ్ర మహాసభ అంటూ కుప్పకూలినాడు దొడ్డి కొమరయ్య . తోటి కార్యకర్తలు నైజాం అల్లరి మూకలపై దాడులకు పూనుకుంటున్నారు. భూస్వామి విసునూర్‌లకపై అణిగిమనిగిఉన్న ప్రజల కోపం కట్టలుతెచ్చుకుంది. ప్రజలంతా మూకుమ్మడిగా విసునూర్‌ భూస్వాముల గడీలపై దాడులు చేసి రజాకార్ల గుండాలను తరిమి తరిమి కొట్టారు.

దొడ్డి కొమురయ్య వీర మరణంతో సాయుధ పోరాటం మరింత పోరాట రూపం దాల్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయములో చదువుతున్న పానుగంటి సీతారామారావు, అనిరెడ్డి రామిరెడ్డి, చలసాని శ్రీనివాసరావు, గాది మధన్‌రనెడ్డి, గంగసాని చేరి తిరుమలరెడ్డి సాయుధ పోరాటం చేసి ఆయుధాలు ధరించారు. వందలాదిమంది విద్యార్థులు పోరాటంలో చేరి ఆయుధాలు ధరిచారు. వందలాది మంది విద్యార్థులు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ తెలంగాణ ప్రజానికానికి అండై నిలిచారు. శత్రుదాడులను ఎదుర్కునేందుకు ప్రజలు ఎప్పుడు తమ చేతుల్లో కారంపొడి రోకలిబండలు, కర్రలు పట్టుకుని సిద్దంగా ఉండేవారు. దొడ్డి కొమరయ్య నాయకత్వం వహిస్తే దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో వేలాది మంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలారు. నాలుగువేల ఐదొందలమంది నేలరాలారు.

సాయుధ పోరాటం

మార్చు

కమ్యూనిస్టుల నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో సోవియట్ యూనియన్ తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి 'ఆంధ్ర మహాసభ' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలో మగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, హసన్ నాసిర్, మల్లు వెంకట నరసింహారెడ్డి[3]లు ముఖ్యులు.

 
మగ్దూం మొహియుద్దీన్

పోరాట ఉధృతి

అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరులో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది. అయితే

రజాకారు సేనను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబరు 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 1948 సెప్టెంబరు 17 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామాలు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబరు 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలతో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబరు దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు. 1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.[4]

పోరాట ఫలితం

మార్చు

కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1948, సెప్టెంబరు 17న హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని 1948 సెప్టెంబరు 17న విరమించలేదు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. బండెనక బండికట్టి:వాసిరెడ్డి నవీన్:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2012
  3. ప్రజాశక్తి, మార్క్సిస్టు (3 November 2016). "విప్లవ యోధుడు మల్లు వెంకట నరసింహారెడ్డి". యు. రామకృష్ణ. Archived from the original on 29 అక్టోబరు 2017. Retrieved 8 November 2017.
  4. http://discover-telangana.org/wp/?p=235&cp=1[dead link]

బయటి లింకులు

మార్చు