వర్గం చర్చ:యోగాచారులు

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Vmakumar

యోగాచారులు (Proposed category for deletion), యోగాచార్యులు (యోగాచారులు వర్గం లోని వ్యాసాలు ఈ వర్గం లోకి కొత్తగా చేర్చబడినవి) అనే పదాల పేర్ల అర్ధంలో సామీప్యత కనిపిస్తున్నట్లుండడంతో "యోగాచారులు" వర్గం లోని వ్యాసాలను "యోగాచార్యులు" వర్గంలోకి మళ్లించి, ఆ మీదట "యోగాచారులు" వర్గం తొలగింపుకు ప్రతిపాదన చేసి ఉండవచ్చని భావిస్తున్నాను. అందువలన "యోగాచారులు" వర్గంను కొనసాగించవలసిందిగా మరియు అందులో ఒకప్పుడు వున్న వ్యాసాల్ని తిరిగి అదే వర్గంలోనే కొనసాగించవలసిందిగా కోరుతూ నా అభిప్రాయం క్రిందివిధంగా తెలియచేస్తున్నాను.

"యోగాచారులు", "యోగాచార్యులు" ఇరువురు వేర్వేరు అర్ధాన్ని తెలియచేస్తాయి.
"యోగాచారులు" అంటే యోగాసనాలు నేర్పే గురువులు (Yoga Teachers) కారు. పతంజలి యోగ సూత్రాలకు చెందిన ఆచార్యులు కారు. ఒక విధంగా చెప్పాలంటే వీరు ఇప్పుడు మనం చూస్తున్న యోగ అభ్యాసకులు వంటి వారు కాదు. స్థూలంగా యోగాచారులు అనేవారు బౌద్ధ తత్వవేత్తలు. వారు మహాయాన బౌద్ధానికి చెందిన ఒకానొక విలక్షణ శాఖకు చెందిన తత్వవేత్తలు. కాబట్టి వారి శాఖీయత పరంగా అటువంటి బౌద్ధ తత్వవేత్తలను యోగాచారులు అనే వర్గంలోకి చేర్చడం జరిగింది.

యోగాచారులు గురించి, వారి ప్రాముఖ్యత గురించి కొంచెం వివరంగా తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. యోగాచారులు వర్గం తొలగింపు ప్రతిపాదనను విరమింప చేయడానికి ఈ వివరణ అవసరమే అనుకుంటున్నాను.

చారిత్రకంగా మహాయాన బౌద్ధం 1) మాధ్యమిక సంప్రదాయం 2) యోగాచార సంప్రదాయం గా విభజితమైంది. మాధ్యమిక సంప్రదాయాన్ని అనుసరించే వారిని మాధ్యమికులు, యోగాచార సంప్రదాయాన్ని అనుసరించే వారిని యోగాచారులు అని పిలుస్తారు. బౌద్ధులైన వీరు తమ శాఖకు యోగ అని పేరును స్వీకరించినప్పటికీ ఆ పదాన్ని భిన్న తాత్విక అర్థంలోనే ఉపయోగించారు. కనుక యోగాచారులు అంటే ఒకానొక ప్రాచీన బౌద్ధ సంప్రదాయక వర్గం వారని, మహాయాన బౌద్ధ తత్వానికి చెందిన "యోగాచారం" అనే శాఖ సంప్రదాయాలను వీరు పాటించేవారని తెలుస్తుంది.

ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక సంప్రదాయ ప్రతిష్టాపకుడు అని మనకు తెలుసు. అదేవిధంగా మైత్రేయినాధుడు (క్రీ.శ. 3 వ శతాబ్దం) యోగాచార సంప్రదాయ స్థాపకుడు. యోగాచారులు, మాధ్యమికులు ఇరువురు ప్రాధమికంగా మహాయానికులే (Followers of Mahayana) అయినప్పటికీ వారిరువురి మధ్య పోలికలే కాక అనివార్యమైన వైరుధ్యాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు మాధ్యమికులు జగత్తులో సర్వ పదార్దాలు శూన్యం అని చెపితే, యోగాచారులు ఈ బుద్ధి వలెనే జగత్తులో అన్ని పదార్ధాలు అసత్యంగా తోస్తున్నాయి కాబట్టి విజ్ఞానం (చిత్తం, మనస్సు లేక బుద్ధి) ఒక్కటే సత్యం అని అంటారు. పైగా మాధ్యమికుల శూన్యవాదాన్ని యోగాచారులు హేయంగా భావిస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే యోగాచారులకు పదార్ధం యొక్క సత్య నిర్ణయంలో జ్ఞానం మాత్రమే ప్రధానం. అందుకే యోగాచార సంప్రదాయానికి విజ్ఞానవాదం అని పేరు కూడా వుంది. అంటే యోగాచారులనే విజ్ఞాన వాదులు అని కూడా పిలుస్తారు.

నాగార్జునుని తరువాత మాధ్యమికులలో ఆర్యదేవుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు, చంద్రకీర్తి, శాంతి దేవుడు వంటి వారు తత్వవేత్తలుగా పేరు గాంచారు. అదేవిధంగా యోగాచారులు (విజ్ఞానవాదులు) లలో అసంగుడు, వసుబందు, స్థిరమతి, దిజ్ఞాగుడు, ధర్మపాలుడు, ధర్మకీర్తి, శీలభద్రుడు, రత్నకీర్తి, శాంతరక్షిత మొదలగువారు గొప్ప తత్వవేత్తలు గా ప్రసిద్ధి గాంచారు.

యోగాచారులు మన దేశంలో కన్నా విదేశాలలో ముఖ్యంగా చైనా, టిబెట్ లలో ప్రఖ్యాతి గాంచారు. వీరు రాసిన ఉత్తమ తత్వ గ్రంధాలు చైనీయ భాషలోను, టిబెటిన్ భాషలోను లభ్యం అయ్యాయి. యోగాచారులలో దిజ్ఞాగుడు, ధర్మకీర్తి, ధర్మపాలుడు మొదలైన వారు తత్వవేత్తలు గానే కాక విఖ్యాత తర్కవేత్తలుగా సైతం రాణించారు. భారతదేశంలో నిగమన తార్కిక (Deductive Logic) అభివృద్ధికి తొలి పునాదులు వేసిన దిజ్ఞాగుడు భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా గుర్తించబడ్డాడు. ఇతను రాసిన ప్రమాణ సముచ్చయం, న్యాయ ప్రవేశం వంటి ప్రామాణిక గ్రంథాలు భారతీయ తర్కశాస్త్రాన్ని సమున్నత స్థాయిలో నిలబెట్టాయని విమర్శకులు సైతం కొనియాడారు. అదేవిధంగా భారతదేశపు కాంటు (Kant of India) గా ప్రశంసించబడినవాడు, జ్ఞాన మీమాంస (ప్రమాణం) లో సాధికార తర్కవేత్త అయిన ధర్మకీర్తి రచనలు మీమాంస, న్యాయ, శైవ శాఖలకు చెందిన సనాతన ధర్మ పండితులనే కాక, జైన పండితులను సైతం ప్రభావితం చేసాయి. యోగాచారులు బౌద్ధ న్యాయ శాస్త్రానికి (తర్క శాస్త్రానికి ) చేసిన సేవ నిరుపమానమైనది. తదనంతరకాలంలో ఈ యోగాచారుల యొక్క విజ్ఞానవాదాన్ని ఇతర బౌద్ధ సంప్రదాయ దార్శనికులే గాక కుమారుల భట్టు, శంకరుడు వంటి బ్రాహ్మణ దార్శనికులు సైతం సమీక్షించడం జరిగింది.

అందువలనే దిజ్ఞాగుడు, ధర్మపాలుడు, ధర్మకీర్తి , స్థిరమతి, జ్ఞానశ్రీమిత్ర లాంటి యోగాచార (విజ్ఞానవాద) తత్వవేత్తలను "యోగాచారులు" అనే వర్గంలో చేర్చడం సముచితంగా ఉంటుందని భావించి "యోగాచారులు" అనే వర్గాన్ని సృష్టించడం జరిగింది. ఆ విధంగానే దిజ్ఞాగుడు, ధర్మపాలుడు, ధర్మకీర్తి, స్థిరమతి, జ్ఞానశ్రీమిత్ర లాంటి వారిని అలా సృష్టించిన "యోగాచారులు" వర్గంలో చేర్చడం కూడా జరిగింది. ఇక్కడివరకూ సరిగానే జరిగిందని భావిస్తున్నాను.

"యోగాచారులు" వర్గం లోని వ్యాసాలు "యోగాచార్యులు" వర్గంలోకి మళ్ళింపు
చరిత్రలో వీరు యోగాచారులు గానే పిలువబడ్డారు. ఆ విధంగా వారిని యోగాచారులు గానే పేర్కొనడం సమంజసం. అందువలనే వారిని "యోగాచారులు" వర్గం గానే సృష్టించబడటం జరిగింది. అంతేతప్ప వీరిని "యోగాచార్యులు" అని పేర్కొనడం సమర్ధనీయం కాదు. అయితే ఎందుకనో "యోగాచారులు" వర్గం లోని వ్యాసాలు "యోగాచార్యులు" అనే మరొక వర్గానికి పొరపాటున మళ్ళించబడ్డాయి. ఎవరో పొరపాటున యోగాచారులు అంటే యోగాచార్యులు (Yoga Teachers) అనే అర్ధంలో భావించుకోవడం వల్లన కావచ్చు "యోగాచార్యులు" మరియు దానికి సంబందించిన "భారతీయ యోగాచార్యులు" అనే ఉప వర్గంలో ‎ధర్మకీర్తి, స్థిరమతి, జ్ఞానశ్రీమిత్ర లను చేర్చివేసినట్లు తెలుస్తున్నది. ఆ విధంగానే తమిళ ప్రాంతానికి చెందిన కారణంగా ధర్మపాలుడు, దిజ్ఞాగుడు వంటివారిని "తమిళనాడు యోగాచార్యులు" అనే ఉప వర్గంలో చేర్చారు. ఈ విధంగా యోగాచారులు వర్గం ఖాళీ అయిపోయి చివరకు తొలగింపు ప్రతిపాదనకు వచ్చి ఉండవచ్చు. ఇది యోగాచారులు గురించి మరి కొద్దిగా తెలిసిఉంటే ఈ పొరపాటు జరిగి ఉండదు అనుకొంటున్నాను. అందుకే యోగాచారులు గురించి పైన తెలిసిన విధంగా కొంచెం దీర్ఘంగా తెలియ చేయవలసి వచ్చింది.

యోగాచార్యులు వర్గం గురించి
ఇకపోతే "యోగాచార్యుల" వర్గంలో ఏ ఏ వ్యాసాలు వున్నాయి అని చూస్తే అక్కడ వి.నానమ్మల్, మేడపాటి వెంకటరెడ్డి వంటి యోగ గురువులు, యోగ నిష్ణాతులు, యోగాభ్యాసకులకు సంబందించిన వ్యాసాలు వున్నాయి. వీటికి అదనంగా "యోగాచారులు' వర్గంలో ఉండాల్సిన కొన్ని వ్యాసాలు (ధర్మపాలుడు, దిజ్ఞాగుడు, ‎ధర్మకీర్తి లాంటివి) "యోగాచార్యులు" వర్గంలోనికి వచ్చాయి. ఇంగ్లీష్ వికీ ప్రకారం చెప్పాల్సి వస్తే "Yogacara " category లో ఉండాల్సిన వ్యాసాలు "Yoga Teachers" అనే వర్గం లోనికి వచ్చాయని తెలుస్తున్నది.

ఆంగ్ల వికీ లో ఈ వర్గాలు వున్న తీరు
ఆంగ్ల వికీ లో కూడా" Yogacara" అనే వర్గం వుంది. దానిలో కూడా అసంగుడు, వసుబందు, దిజ్ఞాగుడు, ధర్మపాలుడు, ధర్మకీర్తి, స్థిరమతి, రత్నకీర్తి, శాంతరక్షిత, శీలభద్రుడు, హరిభద్రుడు లాంటి యోగాచార బౌద్ధ తత్వవేత్తల వ్యాసాలతో పాటు యోగాచారుల యొక్క ప్రముఖ గ్రంధాలు, యోగాచార బౌద్ధ తత్వాన్ని వివరించే అనేక వ్యాసాలు కూడా ఉండటం చూడవచ్చు. అంతే తప్ప దానిలో yoga teachers ల యొక్క వ్యాసాలూ ఏవీ లేవని కూడా తెలియవస్తుంది.

అదేవిధంగా ఆంగ్ల వికీలో "Yoga teachers" అనే మరో కేటగిరీ వుంది. దానిలో V. Nanammal లాంటి వ్యాసాలున్నాయి. మన తెలుగులో కనిపిస్తున్న వి.నానమ్మల్ , మేడపాటి వెంకటరెడ్డి లాంటి వారి వ్యాసాలు ఈ కేటగిరీ క్రింద మాత్రమే ఉంచాల్సి వస్తుంది. దానికోసం Yoga teachers కు సరి సమానంగా తెలుగులో ఒక కొత్త వర్గం సృష్టించాల్సి ఉంటుంది. Yoga teachers కు అనువాదంగా "యోగాచార్యులు" కన్నా "యోగ గురువు" అనే పదం సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే 1.) "యోగాచారులు" (బౌద్ధ తత్వవేత్తలు), "యోగాచార్యులు" (Yoga Teachers) తెలుగు పదాలు దగ్గరదగ్గరగా వుండి ఆచార్యులు అనే అర్ధంతో స్ఫురిస్తున్నట్లుండి readers లకు వాటి మధ్య భేదం అంత త్వరగా గుర్తించ లేకపోవచ్చు. 2.) చరిత్ర పుస్తకాలలోనూ, ఆంగ్ల వికీలోవున్న ప్రామాణికంగా వున్న Yogacara వర్గం పేరు తెలుగులో "యోగాచార" అవుతుంది. అయితే మాధ్యమిక followers లను "మాధ్యమికులు", జైన followers లను జైనులు అని పిలుస్తున్నట్లుగానే యోగాచార followers లను "యోగాచారులు" గా పిలవవలసి ఉంటుంది. పాఠ్య పుస్తకాలలో కూడా యోగాచారులు గానే వ్యవహరిస్తున్నారు. కనుక యోగాచారులు అనే పేరుతొ ఒక వర్గం ఉనికి ఆవశ్యకం అవుతుంది. అటువంటప్పుడు yoga teachers లను confusion కి తావిచ్చే "యోగాచార్యులు" గా కాకుండా "యోగ గురువులు" గా అనువదించడమే మంచిదనుకొంటున్నాను.

విజ్ణప్తి

  • కాబట్టి ప్రస్తుతం వున్న "యోగాచార్యులు" వర్గంలోను దానికి సంబందించిన ఉపవర్గాలైన "భారతీయ యోగాచార్యులు", "తమిళనాడు యోగాచార్యులు" లలో ధర్మకీర్తి, స్థిరమతి, జ్ఞానశ్రీమిత్ర, ధర్మపాలుడు, దిజ్ఞాగుడు వ్యాసాలూ తొలగించవల్సిందిగా కోరుతున్నాను.
  • అదే విధంగా "యోగాచారులు" వర్గంను పునః ప్రారంభించి, ఆవర్గం లోకి ఇదివరకున్నట్లుగానే ‎ధర్మకీర్తి, స్థిరమతి, జ్ఞానశ్రీమిత్ర, ధర్మపాలుడు, దిజ్ఞాగుడు లను చేర్చవలసిందిగా కోరుతున్నాను. ఉపవర్గాలు కూడా కావాలంటే "తమిళనాడు యోగాచారులు" అనేది కొత్తగా సృష్టించి ఆ ఉపవర్గంలో ధర్మపాలుడు, దిజ్ఞాగుడు లను చక్కగా చేర్చవచ్చు.
  • Yoga teachers కు సరి సమానంగా తెలుగులో "యోగ గురువులు" అనే పేరుతొ ఒక కొత్త వర్గం ను సృష్టించుకొంటే దానికి అనుబంధగా "తమిళనాడు యోగ గురువులు" అనే కొత్త ఉప వర్గంలో వి.నానమ్మల్ వ్యాసాన్ని చేర్చవచ్చు. అదేవిధంగా "ఆంధ్రప్రదేశ్ యోగ గురువులు" కొత్త వర్గంలో "తూర్పు గోదావరి జిల్లా యోగ గురువులు " ఉపవర్గంలో మేడపాటి వెంకటరెడ్డి వ్యాసాన్ని చేర్చడం సముచితంగా ఉంటుంది అని భావిస్తున్నాను.

కొత్తగా ఒక వర్గం పేరును సృష్టించడం కాకుండా ప్రస్తుతం కొనసాగుతూ వున్న "యోగాచార్యులు" వర్గంను "యోగ గురువులు" వర్గం గాను, "తమిళనాడు యోగాచార్యులు" వర్గంను "తమిళనాడు యోగ గురువులు" వర్గం గాను, "తూర్పు గోదావరి జిల్లా యోగాచార్యులు" వర్గంను "తూర్పు గోదావరి జిల్లా యోగ గురువులు" వర్గం గాను పేరు మార్చినా సరిపోతుంది. అయితే అటువంటి పేరు మార్పు చేసిన వర్గం (యోగ గురువులు వర్గం) నుంచి ధర్మకీర్తి, స్థిరమతి, జ్ఞానశ్రీమిత్ర, ధర్మపాలుడు, దిజ్ఞాగుడు వ్యాసాలను తొలగించాల్సి ఉంటుంది.

అలాకాదు Yoga teachers కు సరైన పదం "యోగాచార్యులు" అనే పదాన్ని మాత్రమే తీసుకొందామంటే ఏం పరవాలేదు. అయితే అటువంటి వర్గం (యోగాచార్యులు వర్గం) నుంచి ముందు చెప్పినట్లుగానే ధర్మకీర్తి, స్థిరమతి, జ్ఞానశ్రీమిత్ర, ధర్మపాలుడు, దిజ్ఞాగుడు వ్యాసాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం confuse పడడానికి అవకాశం ఉన్నట్లుగానే సామాన్య పాఠకులకి కూడా 'యోగాచారులు', 'యోగాచార్యులు' అనే రెండు వర్గాల మధ్య భేదం స్ఫూరించే అవకాశం చాలా కొద్దిగ వుంటుంది.

Vmakumar గారూ, మీరు తెలియజేసిన అంశాలను ఆధారం చేసుకుని వర్గం:యోగాచారులు మరియు వర్గం:యోగాచార్యులు అనే రెండు వర్గాలు ఉండటం సముచితమని అనిపిస్తుంది. కనుక ఈ వర్గంలోని తొలగింపు మూసను తొలగిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 15:55, 28 జూన్ 2019 (UTC)Reply

కృతజ్ఞతలు కె.వెంకటరమణ గారు. --Vmakumar (చర్చ) 09:25, 29 జూన్ 2019 (UTC)Reply

Return to "యోగాచారులు" page.