నంబూరి నా ఇంటిపేరు. నా స్నేహితులు ఇంటిపేరుతో పిలవడం అలవాటైపోవడంతో ఇక్కడా అదే వాడుతున్నాను. ఇకపోతే నా గురించి కొన్ని సంగతులు. పుట్టిన ఊరు మదనపల్లె (చిత్తూరు జిల్లా). ప్రస్తుతం ఉంటున్నది అమెరికాలో. చిన్నప్పట్నుంచీ మా నాన్న చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బాలమిత్ర వగైరా పుస్తకాలు క్రమం తప్పకుండా తేవడం, అవి చదువుతూ పెరగడం వల్ల తెలుగు బాగానే వంటబట్టింది. తెలుగుభాషపై అభిమానమూ పెరిగింది.

కానీ పదో తరగతి తరువాత తెలుగు వ్రాయడం, చదవడం క్రమంగా తగ్గిపోయింది. అమెరికాకి వచ్చాక అప్పుడప్పుడూ ఈనాడు చదవడం తప్ప తెలుగు భాషతో సాన్నిహిత్యం లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు అవసరార్థం ఆంగ్లంలోనే సంభాషించడం, వ్రాయడం అందరూ చేసే పనే. తెలుగులో మాట్లాడటమే తప్ప, వ్రాయడానికీ, తెలుగు సాహిత్యం చదవడానికీ మనకు అవసరంగానీ, అవకాశంగానీ దొరకట్లేదు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటని అప్పుడప్పుడూ అనిపించేది. మన పరిస్థితే ఇలా ఉంటే రేపు మనపిల్లల పరిస్థితేంటని కించిత్ ఆందోళన కలుగుతుంది. ఈ సమస్యలన్నింటికీ తెవికీ సమాధానం కాగలదని నా అభిప్రాయం. సభ్యులందరూ తీరిక సమయాల్లో తమకు ఆసక్తి ఉన్న విషయంపై నాలుగు వాక్యాలు తెవికీకి సమర్పించినా చాలు.

దేశభాషలందు తెలుగు లెస్స