వాడుకరి:Pavan santhosh.s/నాణ్యత కలిగిన - ముఖ్యమైన వ్యాసాల అనువాదం

ఆంగ్ల వికీపీడియా విశేష వ్యాసాల సమీక్షా విధానం చాలా ఆసక్తికరంగా, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఈ పద్ధతి జర్నళ్ళలోని సమవుజ్జీ సమీక్షా విధానానికి చాలా దగ్గరిగా ఉంటుంది. తద్వారా విశేష వ్యాసాల నాణ్యత చాలా ఉన్నత స్థాయిలోనూ, సమాచార లభ్యత దాదాపు సంపూర్తిగానూ ఉంటుంది. అలానే వ్యాసం ఒకసారి ఆ హోదా సాధించాకా శాశ్వత ప్రాతిపదికన అదే హోదాలో ఉండిపోదు, ఏదైనా నాణ్యాతపరమైన, సమాచార విస్తరణపరమైన లోపాలు కనిపిస్తే దాని హోదా పోతుంది కూడాను. 55 లక్షలకు పైగా ఉన్న ఆంగ్ల వికీపీడియాలో 0.094%గా 5,247 వ్యాసాలు మాత్రమే ఈ హోదా పొందాయంటే వీటి స్థాయి, ఈ స్థాయికి విజ్ఞాన సర్వస్వ వ్యాసాన్ని విస్తరించడానికి అయ్యే కృషి అర్థంచేసుకోవచ్చు. ఇక అతిముఖ్యమైన (Importance-Top) గురించి చెప్పుకోవాలంటే, వికీప్రాజెక్టు నిర్వాహకులు ఆయా ప్రాజెక్టులకు అత్యంత ముఖ్యమైన వ్యాసాల నుంచి అంతగా ప్రాధాన్యత కాని వ్యాసాల వరకూ గుర్తిస్తూంటారు. ఉదాహరణకు వికీప్రాజెక్టు ఆసియాకు ఇండియా వ్యాసం అతిముఖ్యమైనది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంగ్ల వికీలో ఖండాల ప్రాజెక్టులకు, భారతదేశం ప్రాజెక్టుకు, ఇతర దక్షిణాసియా దేశాల ప్రాజెక్టులకు, సైన్సు ప్రాజెక్టుకు, ఇతర సంబంధిత ప్రధానమైన వికీప్రాజెక్టులకు - అత్యంత ముఖ్యమైన విశేష వ్యాసాలు అవి నాణ్యతలోనూ, ప్రాధాన్యతలోనూ అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఇప్పటివరకూ తెలుగు వికీపీడియాలో లేని అటువంటి వ్యాసాలను అనువదించడం ద్వారా అటు తెలుగు వికీపీడియాలో లేని అవసరమైన వ్యాసాలు కానీ, ఇటు ఆంగ్ల వికీపీడియాలోని అత్యున్నత నాణ్యమైన సమాచారం కానీ మనకు లభ్యమవుతుంది. వ్యక్తిగతంగా నేను ఇటువంటి వ్యాసాలు లేకపోతే తెలుగులోకి అనువదించడం (ఉదా: భారతదేశ వాతావరణం అన్నది వికీప్రాజెక్టు ఇండియా (ఆమాటకొస్తే తెలుగు వికీపీడియాకు) అత్యంత ముఖ్యమైన వ్యాసం-ఆంగ్లంలో అత్యున్నత నాణ్యత (విశేష వ్యాసం) కలిగినదీను. కాకుంటే తెలుగులో మనకి ఇప్పటిదాకా వ్యాసం లేదు. మనం సృష్టించవచ్చు), ఇప్పటికే ఏ గూగుల్-అనువాద వ్యాసాల ప్రాజెక్టో అస్తవ్యస్తంగా అనువదించివుంటే తిరగరాయడం (ఉదా: ప్రాచీన ఈజిప్టు నాగరికత ఆంగ్లంలో అత్యున్నత నాణ్యత కలిగినదీ, వికీప్రాజెక్టు ఆఫ్రికాకు అతిముఖ్యమైనది - కానీ మనకు మాత్రం గూగుల్ అనువాద వ్యాసం) వంటివి చేద్దామని ఆశిస్తున్నాను. ఇతర వికీపీడియన్లు కూడా నా ఈ స్వచ్ఛంద కృషి విషయంలో సాయం పడితే నాణ్యమైన సమాచారం లభ్యమవుతుందని ఆశ.

అనుసరిస్తున్న ప్రమాణాలు

మార్చు
  • అత్యంత నాణ్యమైన, అత్యంత ముఖ్యమైన వ్యాసాలు అనువదించడం లక్ష్యం - ప్రధానంగా పాఠకులకు వికీపీడియా పట్ల ఉన్న పర్సెప్షన్, అవసరం పెంచడం లక్ష్యం.
    • అత్యంత ముఖ్యమైనవి నాణ్యతా సమస్యలు లేకున్నా అనువదించడం సమస్య కాదు.
  • అనువదిస్తున్నప్పుడు మనకు అనేక ఎర్ర లింకులు తగులుతాయి. ఎర్రలింకులే ఆభరణాలుగా వ్యాసాన్ని వదిలివేస్తే నాణ్యత పడిపోయినట్టే (పాఠకుడు ఆయా అంశాలను సంపూర్తిగా తెలుసుకోవాలనుకున్నా, వ్యాసాలు లేకపోవడం వల్ల సాధ్యపడదు. అర్థాకలి భోజనం అవుతుంది) కాబట్టి ఎర్రలింకుల్లో మరీ ముఖ్యమైనవి కనీసం పరిచయం వరకూ అనువదించడం చేస్తున్నాను.
  • పదాలకు సరైన అనువాదం దొరకనప్పుడు ఆంధ్రభారతి వారి నిఘంటు శోధన వాడుతున్నాను (పలు నిఘంటువుల నుంచి తెచ్చిన సమాధానాలు కాబట్టి సాధారణార్థాలే కాక శాస్త్ర సాంకేతిక పరమైన విశేషార్థాలకు కూడా తెలుగు పదాలు సూచిస్తున్నాయి)

నమోదు

మార్చు
  • భారతదేశంలో కంపెనీ పాలన - ఆంగ్ల వికీపీడియా మూల వ్యాసం బి-క్లాస్ మాత్రమే సాధించినా (కొంతవరకూ నాణ్యమైనది, ఇంకా సమీక్ష జరగలేదు) భారతదేశ చరిత్రకు సంబంధించి చాలా కీలకమైన వ్యాసం కనుక అనువదిస్తున్నాను.
  • ప్రాచీన ఈజిప్టు నాగరికత - ఆంగ్ల వికీపీడియా మూల వ్యాసం విశేష వ్యాస స్థాయిలో ఉంది. అలానే ప్రపంచ చరిత్రలోనూ, ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకోవాలన్నా అతి ముఖ్యమైన వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ఆరు ప్రాచీన నాగరికతల్లో ఒకటి. గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు కింద అనువదితమైంది, శుద్ధి చేస్తున్నాను.