వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 34వ వారం

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తోలుబొమ్మల పుట్టుకమీద అనేక కథలు ఉన్నాయి. పూర్వం ఒక రాజాస్థానంలోని పండితులు తమ ప్రభువును సంతోషపెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని తోలుబొమ్మలను తయారుచేసి తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటగా ప్రదర్శించారట. ఈ ఆటలు నిజంగా పండితుల చేతనే మెరుగులు దిద్దుకున్నదని చెప్పడానికి అమరకోశంలోని శ్లోకాలు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ తోలుబొమ్మలు ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కొరింగ, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని అక్కడ జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి తెలుస్తున్నది. అదేవిధంగా అక్కడి నుండి పర్షియా, టర్కీల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించి, అక్కడ నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడినుండి ఫ్రాన్స్కు వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు. పూర్తివ్యాసం : పాతవి