వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 02వ వారం
నక్సలైటు లేదా నక్సలిజం భారత కమ్యూనిష్టు ఉద్యమములో వచ్చిన 'సైనో-సోవియట్ చీలిక'తో ఉద్భవించిన తీవ్రవాద, తరచూ హింసాత్మక, విప్లవాత్మక కమ్యూనిష్టు వర్గాల యొక్క వ్యవహారిక నామము. సైద్ధాంతికంగా వీరు అనేక అనేక రకాల మావోయిజానికి చెందుతారు. తొలుత, ఈ ఉద్యమం పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైనది. తరువాత కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) వంటి గొరిల్లా అండర్ గ్రౌండు వర్గాల యొక్క కార్యకలాపాలతో, ఉద్యమం ఛత్తీస్‌ఘడ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ వంటి అంతగా అభివృద్ధి చెందని మధ్య మరియు తూర్పు భారతదేశ గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది.
నక్సలైటు అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో నక్సల్‌బరి అనే ఒక చిన్న గ్రామము పేరు మీదుగా వచ్చింది. 1967లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సి.పి.ఐ (ఎం)) లోని ఒక వర్గము, అధికారిక సిపిఐ (ఎం) నాయకత్వానికి వ్యతిరేకముగా విప్లవాత్మక విపక్షాన్ని అభివృద్ధి పరచే ప్రయత్నంగా, చారు మజుందార్ మరియు కానూ సన్యాల్ నేతృత్వంలో ఒక హింసాయుత పోరాటం ప్రారంభించింది. ఈ తిరుగుబాటు మే 25, 1967న నక్సల్‌బరి గ్రామములో స్థానిక అధికారులు ఒక భూమి సమస్య విషయమై ఒక గిరిజనునిపై దాడి చేయడంతో ప్రారంభమైంది. 1970లలో ఉద్యమము అనేక పరస్పరం విభేదించే చిన్న వర్గాలుగా చీలిపోయినది. 1980 నాటికి దాదాపు 30 క్రియాశీలక నక్సలైటు వర్గాలు మొత్తం 30,000 మంది సభ్యులతో పనిచేస్తున్నవని అంచనా. గతకొద్ది సంవత్సరాలలో తిరుగుబాటుదారులు నక్సల్ ప్రభావాన్ని తొమ్మిది రాష్ట్రాలలోని 76 జిల్లాల నుండి 12 రాష్ట్రాలలో 118 జిల్లాలకు వ్యాపింపజేశారు. రెండు ప్రముఖ నక్సలైటు వర్గాలైన 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్ వార్'(పి.డబ్లు.జి) మరియు 'మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా' (ఎం.సి.సి.ఐ) ఏకమై సెప్టెంబరు 21, 2004న 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)' ఏర్పడింది....పూర్తివ్యాసం: పాతవి