వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 14వ వారం

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. ఈ స్తోత్రం మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.

యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము. విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో పూర్వ పీఠిక, సంకల్పము, ధ్యానము, స్తోత్రము, ఉత్తర పీఠిక, ఫలశృతి వంటి విభాగాలున్నాయి.

ఈ పారాయణకు కుల, మత పట్టింపులు లేవు. పారాయణకు పెద్దగా శక్తి సామర్థ్యాలు, ఖర్చు అవసరం లేదు. శ్రద్ధ ఉంటే చాలును. ఫలశృతిలో చెప్పిన విషయాలు విశ్వాసాన్ని పెంచుతున్నాయి. పేరుమోసిన పండితులు ఈ స్తోత్రానికి వ్యాఖ్యలు రచించి, ప్రజల విశ్వాసాన్ని ఇనుమడింపజేశారు. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం గృహస్తులకు అనుకూలమైన పూజా విధానం.. ....పూర్తివ్యాసం: పాతవి