వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 27వ వారం
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా.
హిందూ మతంపై శంకరుని ప్రభావం అసమానమైనది. శంకరుడు సాధించిన ప్రధాన విజయాలు:
(1) బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు. (2) ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి. (3) శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి. (4) గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.
నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువు లకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరుడు జన్మించాడు. కాలడి ఇప్పటి త్రిచూర్ సమీపంలో ఉంది. తల్లి అంగీకారం తీసుకుని శంకరుడు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళాడు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులను దర్శించాడు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నాడు. తరువాత దేశమంతటా పర్యటించి పండితులను వాదనలో ఓడించి తన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడాన్ని "శంకర దిగ్విజయం" అంటారు. అనంతరం కాష్మీర దేశం శారదా మందిరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాడు.
శంకరుడు స్థాపించిన మఠాలను చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, వందల సంవత్సరాల నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఏ ప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించాడో తెలుస్తుంది. ......పూర్తివ్యాసం: పాతవి