వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 36వ వారం

స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌కు చైర్మెన్ మరియు CEO. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. ఇతను 1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఒక వీడియో గేమ్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు.


1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల 1985లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. అప్పుడు NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు.


ఆపిల్ డైరక్టర్లు NeXTను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అప్పటి ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000లో పూర్తిస్థాయి CEO అయ్యాడు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగాడు.


1986లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. పిక్సర్-డిస్నీ సహయత్నంగా మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ గొప్ప లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి. ......పూర్తివ్యాసం: పాతవి