వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 06వ వారం

ఒలంపిక్ క్రీడల చిహ్నం
ఒలంపిక్ క్రీడల చిహ్నం

ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్ళకొకసారి ప్రపంచ దేశాలన్నీ పోటీపడే ప్రతిష్టాత్మక క్రీడలు. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీ.శ.393 లో నిలిపి వేసారు. మళ్ళీ క్రీ.శ. 1896లో ఏథెన్స్ లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ దాదాపు నాలుగేళ్ళకోసారి (దీనికే ఒలింపియాడ్ అని కూడా పేరు) ఈ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా, పున:ప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలకు వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలువవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనా లోని బీజింగ్ లో జరిగాయి.

రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.

క్రీడాకారుల దృష్టిలో ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించడమే అన్నిటి కంటే పెద్ద గౌరవం. ఒలింపిక్ చరిత్రలో అనేక స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. లారిస్సా లాటినినా అత్యధికంగా 9 స్వర్ణాలతో మొత్తం 18 ఒలింపిక్ పతకాలను సాధించగా 9 స్వర్ణాలు సాధించిన మరో ముగ్గురు క్రీడాకారులు కూడా ఉన్నారు. 1972లో స్విమ్మింగ్‌లో మార్క్ స్పిట్జ్ ఒకే ఒలింపిక్‌లో 7 స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఇంతవరకు వ్యక్తిగత పోటీలలో స్వర్ణం సాధించింది అభినవ్ బింద్రా.

.....పూర్తివ్యాసం: పాతవి