ఒలింపిక్ క్రీడలు

అంతర్జాతీయ క్రీడా పోటీలు

ఒలింపిక్ క్రీడలు (English: Olympic GamesFrench: Jeux olympiques) ప్రతి నాలుగేళ్ళకొకసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు సా.శ.393 లో నిలిపి వేసారు. మళ్ళీ సా.శ. 1896లో ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ, దాదాపు నాలుగేళ్ళకోసారి (దీనికే ఒలింపియాడ్ [1] అని కూడా పేరు) ఈ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా, పునఃప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ [2] అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలువవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనా లోని బీజింగ్లో జరిగాయి. 2012లో లండనులో జరిగాయి.

ఒలింపిక్ క్రీడల చిహ్నం

ప్రాచీన ఒలింపిక్ క్రీడలు మార్చు

క్రీ.పూ. 8 వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం అనేక రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. గ్రీకు రాజ్యాల మధ్య తరుచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. శాంతి సామరస్యాలకు క్రీడలు పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీ.పూ.776 లో మొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటినుంచి సా.శ.393[3] వరకు ప్రతి నాలుగేళ్ళకోసారి ఒలింపిక్ క్రీడలు సాఫీగా నిర్వహించారు. క్రీడోత్సవాల సమయంలో యుద్ధాలు కూడా ఆపేవారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు.[4] అప్పట్లో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు జూలై నెలలో జరిగేవి. ప్రారంభంలో ఒక రోజు మాత్రమే నిర్వహించేవారు కాని కాలక్రమేణా జనాదరణ పెరగడంతో పోటీలు నిర్వహించే రోజుల సంఖ్య, క్రీడాంశాల సంఖ్య పెరుగుతూ పోయింది. ఆ రోజుల్లో క్రీడలు జరుగుతున్నన్ని రోజులు తమతమ ప్రజలు పనులు కూడా ఆపివేసి ఒలింపియా స్టేడియానికి పరుగులు పెట్టేవారు. క్రీడాంశాలలో పరుగు పందెంతో పాటు, కుస్తీ, రథాల పోటీ, బాక్సింగ్, గుర్రపు స్వారీ మున్నగు పోటీలు జరిగేవి. రోమన్ చక్రవర్తి థియోడొసియస్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి ఈ ఒలింపిక్ క్రీడలను నిషేధించాడు.[5] ఆ తరువాత ఒలింపస్ పట్టణం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది.

ఆధునిక ఒలింపిక్ క్రీడలు మార్చు

రోమన్ చక్రవర్తి థియోడొసియస్ కారణంగా మరుగున పడిన ఒలింపిక్ క్రీడలకు తిరిగి జీవం పోసిన ఘనత ఫ్రాన్సుకు చెందిన క్రీడాపండితుడు పియరీ డి కోబర్టీన్ కే దక్కుతుంది. కాబట్టి ఇతడు ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా ప్రసిద్ధి చెందినాడు. కోబర్టీన్ 1892లో ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని ప్రకటించాడు. క్రీడల పున:ప్రారంభానికి అతడు విపరీతంగా కృషి చేశాడు. అతడి పట్టుదల మూలంగా 1896లో మొదటిసారిగా ఎథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు మరుగున పడిన ప్రదేశంలోనే తొలి ఆధునిక క్రీడలు నిర్వహించుట విశేషం. ఆ తరువాత 6 ఒలింపిక్ క్రీడలు జరగగానే 1916లో బెర్లిన్లో జరగాల్సిన క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. మళ్ళీ 1940, 1944లలో జరగాల్సిన హెల్సింకీ, లండన్ ఒలింపిక్ క్రీడలు కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. తదనంతరం ఈ క్రీడలు నిరాటంకంగా జరుగుతున్ననూ రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. హంగేరీ మీద సోవియట్ యూనియన్ దాడికి నిరసనగా 1956 మెల్బోర్న్‌ ఒలింపిక్ క్రీడలను హాలెండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొదలైన దేశాలు బహిష్కరించాయి. వర్ణవివక్షత పాటిస్తున్న కారణంగా 1964 నుంచి చాలాకాలం పాటు దక్షిణాఫ్రికా ఈ క్రీడలలో పాల్గొనడాన్ని నిషేధించారు. 1976 మాంట్రియల్ ఒలింపిక్ క్రీడలను ఆఫ్రికా దేశాలు బహిష్కరించాయి. 1980 మాస్కో ఒలింపిక్ క్రీడలలో అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు పాల్గొనలేదు. తత్ఫలితంగా 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను రష్యా, దాని మిత్ర దేశాలు బహిష్కరించాయి. ఈ విధంగా దేశాల మధ్య స్నేహ సంబంధాల కోసం ప్రారంభించిన క్రీడలు అపుడప్పుడు దేశాల మధ్య వైషమ్యాలు కూడా పెంచాయి. అయినప్పటికీ ఈ క్రీడల యొక్క జనాదరణ, పాల్గొంటున్న క్రీడాకారుల ఉత్సాహం విపరీతమైనది.

ఒలింపిక్ క్రీడల చిహ్నం మార్చు

5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.

ఒలింపిక్ క్రీడాంశాలు మార్చు

1896లో ఏథెన్స్‌లో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలలో 9 క్రీడాంశాలు ఉన్నాయి. అవి: అథ్లెటిక్స్, సైక్లింగ్, కత్తియుద్ధం, జిమ్నాస్టిక్స్, బరువులెత్తడం, షూటింగ్, ఈతలపోటీలు, టెన్నిస్, మల్లయుద్ధం. క్రమక్రమంగా క్రీడాంశాల సంఖ్య పెరిగి, ప్రస్తుతం 28 క్రీడాంశాలకు చేరింది. (శీతాకాలపు ఒలింపిక్స్‌తో కలిపి 35 క్రీడాంశాలు).[6] ఒలింపిక్ నిబంధన 48.1 ప్రకారం వేసవి ఒలింపిక్స్‌లో క్రీడాంశాల సంఖ్య 15 కు తగ్గరాదు. 2002లో మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సమావేశమై క్రీడాంశాల గరిష్ఠ సంఖ్య 28గా నిర్ణయించింది.

ప్రముఖ ఒలింపిక్ క్రీడాకారులు మార్చు

క్రీడాకారుల దృష్టిలో ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించడమే అన్నిటి కంటే పెద్ద గౌరవం. ఒలింపిక్ చరిత్రలో అనేక స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. లారిస్సా లాటినినా అత్యధికంగా 9 స్వర్ణాలతో మొత్తం 18 ఒలింపిక్ పతకాలను సాధించగా 9 స్వర్ణాలు సాధించిన మరో ముగ్గురు క్రీడాకారులు కూడా ఉన్నారు. 1972లో స్విమ్మింగ్‌లో మార్క్ స్పిట్జ్ ఒకే ఒలింపిక్‌లో 7 స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఇంతవరకు వ్యక్తిగత పోటీలలో ఎవరూ స్వర్ణం సాధించలేదు గానీ, మిల్కాసింగ్, పి.టి.ఉషలు తృటిలో పతకాలు సాధించే అవకాశాలు పోగొట్టుకున్నారు.అభినవ్ బింద్రా 2008 లో స్వర్ణం సాధించాడు.

మార్క్ స్పిట్జ్: ఒకే ఒలింపిక్స్‌లో - ఒకటి కాదు రెండు కాదు - ఏకంగా ఏడు స్వర్ణాలు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు మార్క్ స్పిట్జ్. 1972లో మ్యూనిచ్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో స్పిట్జ్ బంగారు పంట పండించాడు. వండర్ స్విమ్మర్‌గా పేరుగాంచిన స్పిట్జ్ ఈత కొలనులో చేపపిల్లలా దూసుకుపోయి ఎనిమిది రోజుల వ్యవధిలో 7 స్వర్ణాలు సాధించాడు. తొలి పోటీలోనే (200 మీటర్ల బటర్ ఫ్లై) లోనే కొత్త ప్రపంచ రికార్డును తిరగరాశాడు. తన క్రీడాజీవితంలో మొత్తం 9 స్వర్ణాలు సాధించాడు. ఒకే ఒలింపిక్ పోటీలలో అత్యధిక స్వర్ణాలు సాధించిన రికార్డు ఇప్పటికీ మార్క్ స్పిట్జ్ పేరిటే ఉంది.

సెర్గీ బుబ్కా: ఉక్రెయిన్‌కు చెందిన బుబ్కా పోలోవాల్ట్ క్రీడలో లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు సృష్టించాడు. పోలోవాల్ట్‌లో మకుటం లేని మహారాజుగా అవతరించాడు. కాని ఒలింపిక్ క్రీడలలో మాత్రం ఇతడు సాధించినది ఒకే ఒక్క స్వర్ణం. ప్రతీసారి ఏదో ఒక కారణం వల్ల అవకాశం చేజార్చుకున్నాడు. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను రష్యా బహిష్కరించటంతో పాల్గొనే అవకాశంతో పాటు కచ్చితంగా గెలిచే స్వర్ణం చేజారింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కూడా పాదం గాయం కారణంగా వైగొలిగినాడు. చివరిసారిగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అర్హత సాధించలేకపోయాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సెర్గీ బుబ్కాకు ఒలింపిక్స్‌లో ఒకే స్వర్ణం సాధించినప్పటికీ ప్రముఖ ఒలింపిక్ క్రీడాకారుడిగా కీర్తి గడించాడు.

క్రీడాకారుడు దేశం క్రీడ సంవత్సరం స్వర్ణ రజత కాంస్య మొత్తం
లారిసా లాటినినా   URS జిమ్నాస్టిక్ 1956–1964 9 5 4 18
నికోలాయ్ ఆండ్రియనోవ్   URS జిమ్నాస్టిక్ 1972–1980 7 5 3 15
పావో నుర్మి   FIN అథ్లెటిక్స్ 1920–1928 9 3 0 12
మార్క్ స్పిట్జ్   USA స్విమ్మింగ్ 1968–1972 9 1 1 11
కార్ల్ లూయీస్   USA అథ్లెటిక్స్ 1984–1996 9 1 0 10
జార్న్ దాహ్లీ   NOR స్కీయింగ్ 1992–1998 8 4 0 12
బిర్గిట్ ఫిషర్   GDR /   GER కనోయింగ్) 1980–2004 8 4 0 12
సావో కాటో   JPN జిమ్నాస్టిక్ 1968–1976 8 3 1 12
జెన్నీ థాంప్సన్   USA స్విమ్మింగ్ 1992–2004 8 3 1 12
మాట్ బియోండీ   USA స్విమ్మింగ్ 1984–1992 8 2 1 11
రే ఎవ్రీ   USA అథ్లెటిక్స్ 1900–1908 8 0 0 8

వేసవి ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన నగరాలు మార్చు

# సంవత్సరం వేదిక
1 1896 ఏథెన్స్
2 1900 పారిస్
3 1904 సెయింట్ లూయిస్
4 1908 లండన్
5 1912 స్టాక్‌హోమ్
6 1916 బెర్లిన్ మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు అయింది
7 1920 ఆంట్‌వెర్ఫ్
8 1924 పారిస్
9 1928 ఆంస్టర్‌డాం
10 1932 లాస్‌ఏంజిల్స్
11 1936 బెర్లిన్
12 1940 హెల్సింకీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు అయింది
13 1944 లండన్ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు అయింది
14 1948 లండన్
15 1952 హెల్సింకీ
16 1956 మెల్బోర్న్
17 1960 రోమ్
18 1964 టోక్యో
19 1968 మెక్సికో సిటీ
20 1972 మ్యూనిచ్
21 1976 మాంట్రియల్
22 1980 మాస్కో
23 1984 లాస్ ఏంజిల్స్
24 1988 సియోల్
25 1992 బార్సిలోనా
26 1996 అట్లాంటా
27 2000 సిడ్నీ
28 2004 ఏథెన్స్
29 2008 బీజింగ్
30 2012 లండన్
31 2016 రియో
32 2020 టోక్యో

ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ క్రీడలు మార్చు

  • 1896 ఎథెన్స్ ఒలింపిక్స్ : 1896లో తొలి ఒలీమ్పిక్ క్రీడలు గ్రీసు పట్టణమైన ఎథెన్స్‌లో జరిగాయి. సుమారు 1500 సంవత్సరాల అనంతరం ఒలింపిక్ క్రీడలకు జీవం పోసిన ఘనత ఫ్రాన్సుకు చెందిన పియరీ డి క్యుబర్టీన్‌కు దక్కింది. తొలి క్రీడలు ఫ్రాన్సులో జరగాలని క్యుబర్టీన్ పట్టుపట్టిననూ ప్రాచీన ఒలింపిక్ క్రీడలు జరిగిన గ్రీసులోనే జరగాలని వత్తిడి రావడంతో అతని కోరిక నెరవేరలేదు. ఏప్రిల్ 6, 1896న జార్జియస్ ఎవెరాఫ్ విగ్రహాన్ని గ్రీసుకు చెందిన రాజు కింగ్‌జార్జి-1 ఆవిష్కరించడంతో క్రీడోత్సవాలకు ప్రారంభమయ్యాయి. ఇందులో 311 అథ్లెట్లు పాల్గొన్నారు. అందులో 230 క్రీడాకారులు గ్రీసుకు చెందినవారే. కాని విజయాలలో అమెరికా పైచేయి సాధించింది.
  • 1900 పారిస్ ఒలింపిక్స్ : ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడైన క్యూబర్టీన్ స్వంతదేశంలో ఈ క్రీడలు జరిగిననూ నిర్వహణపరమైన లోపాలు తలెత్తాయి. భవిష్యత్తు క్రీడలన్నీ ఎథెన్స్‌లోనే జరగాలని గ్రీసు రాజు అభిలషించిననూ క్యూబర్టీన్ చొరవతో పారిస్ వేదికగా నిలిచింది. అంతేకాకుండా 1897లో టర్కీతో యుద్ధం, ఆర్థిక సంక్షోభం వల్ల కూడా గ్రీసు ఈ క్రీడల పట్ల అశక్తత చూపింది. దీంతో ఫ్రాన్సుకు మార్గం సుగమమయింది. 1900, మే 20న పారిస్‌లో రెండో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి.
  • 1904 సెయింట్ లూయీస్ ఒలింపిక్స్ : మొదటి ఒలింపిక్ క్రీడలు జరగడానికి ముందే మూడో ఒలింపిక్స్ అమెరికాలో జరగాలని నిర్ణయించారు. వేదిక మాత్రం 1901లో ఖరారైంది. ఇవి పేరుకు ఒలింపిక్ క్రీడలైననూ అమెరికా జాతీయ క్రీడలు మాదిరిగా జరిగాయి. పాల్గొన్న 625 క్రీడాకారులలో 533 మంది అమెరికా దేశస్థులే. మిగిలిన వారిలో అత్యధికులు పొరుగున ఉన్న కెనడా దేశస్థులు. సహజంగానే దీనిలోనూ అమెరికా ఆధిపత్యం కొనసాగింది.
  • 1908 లండన్ ఒలింపిక్స్ : ఈ ఒలింపిక్ క్రీడలు ఇటలీ రాజధాని నగరం రోంలో జరగాల్సి ఉన్ననూ వెసూవియన్ అగ్నిపర్వతం బద్దలై విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో ఇటలీ రంగం నుంచి తప్పించుకుంది. బ్రిటన్ ముందుకు రావడంతో 1908 ఒలింపిక్స్ కు వేదికగా లండన్ ఖరారైంది. ఈ ఒలింపిక్స్ లోనే మొదటిసారిగా ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు స్వర్ణ పతకాలు ప్రధానం చేశారు.
  • 1912 స్టాక్‌హోం ఒలింపిక్స్ :1912, జూలై 6న స్టాక్‌హోం ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవం సందర్భంగా స్కాండివేనియన్ జిమ్నాస్టులు చేసిన అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
  • 1920 ఆంట్‌వెర్ఫ్ ఒలింపిక్స్ : మొదటి ప్రపంచ యుద్ధం వల్ల 1916 ఒలింపిక్స్ రద్దు కాగా తదుపరి ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యతను ఆంట్‌వెర్ఫ్ చేపట్టింది. ఈ ఒలింపిక్స్ లో కూడా పరుగుపందేలలో అమెరికానే ఆధిపత్యం చెలాయించింది. బ్రిటన్‌కు చెందిన ఆల్బర్ట్ హిల్ల్ 800 మీ, 1500 మీటర్ల పరుగులో రెండు స్వర్ణాలు సాధించాడు.
  • 1924 పారిస్ ఒలింపిక్స్ : ఒలింపిక్ క్రీడల పితామహుడైన క్యూబర్టీన్ కోరికపై మళ్ళీ రెండవ సారి పారిస్ ఒలింపిక్ క్రీడలకు వేదికగా నిల్చింది. 1900 ఒలింపిక్ క్రీడల నిర్వహణ సమయంలో పడిన మచ్చను తొలిగించుకోవడానికి క్యూబర్టీన్ దీన్ని అవకాశంగా తీసుకున్నాడు. దీనితో రెండో పర్యాయం ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన తొలి నగరంగా పారిస్ రికార్డులలో స్థానం సంపాదించింది.
  • 1928 ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ : 46 దేశాలు పాల్గొన్న ఈ ఒలింపిక్ క్రీడలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే ట్రాక్ అండ్ ఫీల్డ్ రంగంలో మహిళలకు కూడా అనుమతించినది ఈ ఒలింపిక్స్ లోనే. అప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) ఈ క్రీడలను బహిష్కరించింది. తొలిసారిగా అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ రంగంలో తన ఆధిపత్యాన్ని కోల్పోయింది.
  • 1932 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ : ఈ నగరంలో ఒలింపిక్ క్రీడలను నిర్వహించుటకుగాను 1920లోనే దరఖాస్తు అంఫగా 12 సంవత్సరాల అనంతరం క్రీడలను నిర్వహించే భాగ్యం లభించింది. ఒలింపిక్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఒలింపిక్ నిర్వహణలోనే ప్రత్యేకంగా ఒలింపిక్ గ్రామాన్ని నిర్మించారు. క్రీడల నిర్వహణ, ఫలితాల వెల్లడి, సమాచారం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో అమెరికా మళ్ళీ తన స్థానాన్ని పునరుద్ధరించుకుంది.
  • 1936 బెర్లిన్ ఒలింపిక్స్ : రెండవ ప్రపంచ యుద్ధం వాతావరణం అలముకున్న దశలో ఈ క్రీడలు జరిగాయి. జర్మనీ నియంత హిట్లర్ ఈ క్రీడలను తనకు మద్దతుగా రాజకీయ ప్రయోజనాలకై వాడుకోవడానికి ప్రయత్నించాడు. క్రీడా గ్రామం అంతటా నాజీ గుర్తు స్వస్తిక్ మార్క్‌లు పెట్టించాడు. అయిననూ జెస్సీ ఓవెన్స్ లాంటి అమెరికన్ నలజాతి అథ్లెట్లు మంచి ప్రతిభ ప్రదర్శించి హిట్లర్‌కు తిరుగులేని సమాధానమిచ్చారు.
  • 1948 లండన్ ఒలింపిక్స్ : 1940లో టోక్యోలో, 1944లో లండన్లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. 1944 ఒలింపిక్స్‌ను నిర్వహించాల్సిన లండన్ నగరానికే 1948 ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 1948, జూలై 29న బ్రిటన్ రాజు కింగ్ జార్జి 6 ఈ క్రీడలకు ప్రారంభోత్సవం చేసాడు.
  • 1952 హెల్సింకీ ఒలింపిక్స్ : రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 7 సంవత్సరాలు గడిచిననూ అమెరికా, రష్యాల మధ్య ఉన్న ప్రచ్ఛన్నయుద్ధం ఛాయల వల్ల ఈ క్రీడలలో ఆ రెండు దేశాల మధ్య పోటా-పోటీగా జరిగాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో మాత్రం అమెరికా ముందజవేసింది. భార్యాభర్తలయిన ఎమిల్ జటోపెక్, డానా జటోపెక్లు స్వర్ణాలు సాధించడం ఈ ఒలింపిక్స్ విశేషం.
  • 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్ : భూమధ్య రేఖకు దిగువన ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన తొలి నగరంగా ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ చరిత్ర పుటల్లో స్థానం పొందినది. యుద్ధ ఛాయలు ఈ క్రీడల మీద పడ్డాయి. కొన్ని దేశాలు క్రీడలను బహిష్కరించాయి కూడా. అయిననూ 71 దేశాల నుంచి సుమారు మూడు వేల క్రీడాకారులు పాల్గొని మొత్తంపై ఈ క్రీడలను జయప్రదం చేసారు.
  • 1960 రోం ఒలింపిక్స్ : ఇటలీ రాజధాని నగరం రోంలో జరిగిన 1960 ఒలింపిక్స్‌లో 83 దేశాలకు చెందిన సుమారు 5000 క్రీడాకారులు పాల్గొన్నారు. నేషనలిస్ట్ చైనా ఫార్మోసా పేరుతో ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్నది. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసి ఈ ఒలింపిక్స్‌కు ఉమ్మడి జట్టును పంపారు. స్ప్రింట్‌లో అమెరికాకు పరాభవం ఎదురైంది.
  • 1964 టోక్యో ఒలింపిక్స్ : 94 దేశాల నుంచి 5000 క్రీడాకారులు పాల్గొన్న 1964 ఒలింపిక్ క్రీడలు జపాన్ రాజధాని నగరమైన టోక్యోలో అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 24 వరకు జరిగాయి. హీరోషిమా పై అమెరికా బాంబు దాడులు వేసిన 1945, ఆగస్టు 6 రోజు జన్మించిన అథ్లెట్ యషినోరోసాకీ ఒలింపిక్ జ్యోతిని స్టేడియానికి తీసుకొని రావడం ఈ ఒలింపిక్స్ విశేషం. వర్ణవివక్షత పాటించిన దక్షిణాఫ్రికాను క్రీడలనుంచి బహిష్కరించుటతో ఆ దేశం తొలిసారి దూరమైంది.[7]
  • 1968 మెక్సికో సిటీ ఒలింపిక్స్ : మహిళా క్రీడాకారిణి ఎన్రికెటా బసీలియో ఒలింపిక్ జ్యోతిని వెలిగించుట ఈ ఒలింపిక్స్ విశేషం. అక్టోబర్ 12న ప్రారంభమైన ఈ క్రీడలలో 112 దేశాల నుంచి సుమారు 5530 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 800 మహిళలు ఉన్నారు. 20 క్రీడాంశలలో 172 ఈవెంట్లలో పోటీలు జరిగాయి. పతకాల పట్టికలో అమెరికా, సోవియట్ యూనియన్లు ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచాయి.
  • 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ : ఈ ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఇజ్రాయెల్ క్రీడాకారులపై అరబ్ టెర్రరిస్టులు జరిపిన ఊచకోత ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే అత్యంత నీచమైన దుర్ఘటన. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరిగిన ఈ ఒలింపిక్స్‌లో 122 దేశాల నుంచి 7170 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 1095 మంది మహిళలు. ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్స్ స్పిట్జ్ ఈతకొలనులో 7 స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించినది ఈ ఒలింపిక్స్ లోనే.
  • 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ : జూలై 17 నుంచి ఆగస్టు 1 వరకు కెనడా లోని మాంట్రియల్ పట్టణంలో 1976 ఒలింపిక్ క్రీడలు జరిగాయి. వీటిలో 92 దేశాలకు చెందిన సుమారు 6000 క్రీడాకారులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల రుమేనియా బాలిక నాడియా కొమనెసి జిమ్నాస్టిక్స్లో 7 పర్‌ఫెక్ట్ టెన్ లతో మూడు స్వర్ణాలు సాధించుట ఈ ఒలింపిక్స్ విశేషం.
  • 1980 మాస్కో ఒలింపిక్స్ : సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) రాజధాని నగరమైన మాస్కోలో జూలై 19 నుంచి ఆగస్టు 3 వరకు జరిగిన 1980 ఒలింపిక్ క్రీడలపై బహిష్కరణ ప్రభావం విపరీతంగా చూపింది. సోవియట్ యీనియన్ అఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ చేసినందుకు నిరసనగా అమెరికా, పశ్చిమ జర్మనీ, జపాన్, కెనడా, ఇజ్రాయెల్ లతో సహా 62 దేశాలు బహిష్కరించుటతో క్రీడలలో పోటీ తత్వం తగ్గిపోయింది. అయిననూ పాల్గొన్న దేశాల సంఖ్య 80 కు చేరింది.[8] సుమారు వెయ్యి మంది మహిళలతో సహా 4000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మైదాన హాకీలో భారత్కు స్వర్ణం లభించింది.
  • 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ : 23వ ఒలింపిక్ క్రీడలు 1984, జూలై 28 నుంచి ఆగస్టు 12 వరకు అమెరికా లోని లాస్ ఏంజిల్స్లో జరిగాయి. లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్ క్రీడలు జరగడం ఇది రెండో పర్యాయం. ఇంతకు క్రితం 1932లో ఇదే నగరంలో ఈ క్రీడలు జరిగాయి. 1980 మాస్కో ఒలింపిక్స్‌కు అమెరికా, దాని మిత్రదేశాలు బహిష్కరించడంతో, ఈ ఒలింపిక్స్‌ను రష్యా దాని మిత్రదేశాలు బహిష్కరించాయి. అయిననూ పాల్గొన్న దేశాల సంఖ్య 140, క్రీడాకారుల సంఖ్య 6797 కు చేరింది. ఈ ఒలింపిక్స్‌లో అమెరికాకు తిరుగులేకపోయింది. 83 స్వర్ణాలతో పాటు మొత్తం 174 పతకాలు సాధించింది.
  • 1988 సియోల్ ఒలింపిక్స్ : దక్షిణ కొరియాలోని సొయోల్లో 1988, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన ఒలింపిక్ క్రీడలలో 160 దేశాల నుంచి 8391 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఒలింపిక్ క్రీడలలో అతి పెద్ద సంచలనం బెన్ జాన్సన్ ఉదంతం. 100 మీటర్ల పరుగులో వాయువేగంతో పరుగెత్తి ప్రపంచ రికార్డు సృష్టించిన బెన్ జాన్సన్ చివరకు డ్రగ్స్ సేవించినట్లు తేలడంతో పతకం కోల్పోయాడు. మహిళల పరుగులో అమెరికాకు చెందిన ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్‌నర్ 3 స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.
  • 1992 బార్సిలోనా ఒలింపిక్స్ : ఈ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 169 దేశాలు పాల్గొన్నాయి. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన ఈ ఒలింపిక్స్‌1992, జూలై 25న ప్రారంభం అయ్యాయి. సోవియట్ యూనియన్ 15 ముక్కలై విడిపోయిననూ అన్ని దేశాలు కల్సి ఒకే జట్టుగా పాల్గొని అమెరికాను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సంపాదించాయి. స్పెయిన్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చి 13 బంగారు పతకాలను చేజిక్కించుకున్నారు. ఈ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాలలో మొత్తం 286 ఈవెంట్లలో పోటీ జరిగింది.
  • 1996 అట్లాంటా ఒలింపిక్స్ : 26 వ ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని అట్లాంటాలో జూలై 19, 1996న ప్రారంభమయ్యాయి. ఈ ఒలింపిక్స్‌లో 197 దేశాల నుంచి 10320 క్రీడాకారులు హాజరయ్యారు. ఇవి ఒలింపిక్ క్రీడల శతవార్శికోత్సవ క్రీడలు కావడం విశేషం. అమెరికా, రష్యాలు ఈ ఒలింపిక్స్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందాయి. పురుషుల టెన్నిస్ పోటీలలో భారత్కు చెందిన లియాండర్ పేస్ కాంస్యం సాధించాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇదే భారత్‌కు ఏకైక పతకం. మొత్తంపై భారత్ 71 వ స్థానంలో నిలిచింది.
  • 2000 సిడ్నీ ఒలింపిక్స్ : 27 వ ఒలింపిక్ క్రీడలు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2000, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగాయి. 1993లో ఈ ఒలింపిక్ క్రీడల వేదికపై పోటీ జరుగగా సిడ్నీతో తీర్వంగా పోటీపడిన బీజింగ్ మూడో రౌండ్ వరకు ముందంజలోనే ఉన్ననూ నాల్గవ రౌండ్‌లో కేవలం 2 ఓట్లతో బీజింగ్ గెలిచింది. ఈ ఒలింపిక్స్‌లోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు అమెరికా, రష్యాలు పొందగా నిర్వాహక ఆస్త్రేలియా చైనా తరువాత నాల్గవ స్థానం పొందినది. తెలుగు అమ్మాయి కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో కాంస్యం గెలిచి భారత్‌కు ఏకైక పతకం సాధించిపెట్టినది.
  • 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ : స్వర్ణోత్సవ ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తామని పట్టుపడిన ఎథెన్స్‌కు చివరికి 2004లో ఒలింపిక్ క్రీడల నిర్వహణ భాగ్యం లభించింది. 201 దేశాల నుంచి 10625 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. పాల్గొన్న దేశాల సంఖ్య మొదటిసారిగా 200 దాటినది. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 29 వరకు జరిగిన ఈ క్రీడలలో ప్రథమ స్థానంలో అమెరికా పొందగా, చైనా రెండో స్థానానికి ఎదిగింది. మూడవ, నాలుగవ స్థానాలను రష్యా, ఆస్ట్రేలియాలు పొందాయి. రాజ్యవర్థన్ సింగ్ షూటింగ్లో భారత్కు రజతపతకం సాధించిపెట్టాడు.
  • 2008 బీజింగ్ ఒలింపిక్స్ :8,ఆగష్టు 2008 వ సంవత్సరం, (8-8-08) శుక్రవారం రాత్రి 8.08 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.40 గంటలు) బీజింగ్‌లోని పిట్టగూడు (బర్డ్‌నెస్ట్‌) జాతీయ క్రీడా ప్రాంగణంలో మైదానం మధ్యలో భూగోళంలా ఏర్పాటుచేసిన తాత్కాలిక వేదికపై చైనా గాయకుడు లియూ హువాన్‌, బ్రిటన్‌ గాయని సారా బ్రిగామ్‌ కలిసి క్రీడల సందేశ గీతాన్ని ఆలాపించిన తరువాత క్రీడలను ప్రారంభిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు హు జింటావో ప్రకటించారు.16 రోజుల పాటు జరిగే క్రీడల్లో మొత్తం 906 పతకాల కోసం 205 దేశాలకు చెందిన 10,500 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు.
  • 2012 లండన్ ఒలింపిక్స్: 30వ ఒలింపిక్ క్రీడలు లండన్లో 2012, జూలై 22 నుండి ఆగస్టు 12 వరకు జరిగాయి. ఈ క్రీడలలో 205 దేశాలకు చెందిన 10,700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఒలింపిక్స్‌లో 8 క్రీడలలో 32 ప్రపంచ రికార్డులు సృష్టించబడ్డాయి. ఈ క్రీడలలో అమెరికా 46 స్వర్ణపతకాలతో ప్రథమస్థానం సంపాదించగా, చైనా, బ్రిటన్, రష్యాలు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో నిలిచాయి. భారతదేశం 2 రజత, 4 కాంస్యపతకాలతో 56వ స్థానంలో నిలిచింది.
  • 2016 రియో ఒలింపిక్స్: 31వ ఒలింపిక్ క్రీడలు బ్రెజిల్ దేశానికి చెందిన రియో డి జనీరోలో 2016, ఆగస్టు 5వ తేదీన ప్రారంభమైంది. ఈ క్రీడలలో 206 దేశాలు పాల్గొనుచుండగా భారత దేశం నుండి 118 మంది క్రీడాకారులు (అందులో 54 మంది మహిళా క్రీడాకారులు) 68 ఈవెంట్లలో పాల్గొంటున్నారు.
  • 2020 టోక్యో ఒలింపిక్స్: 32వ ఒలింపిక్ క్రీడలు, ఈ క్రీడలకు జపాన్ దేశం ఆతిధ్యమిచ్చింది. ఈ పోటీలలో భారతదేశంనుండి మొత్తం 124 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీటిలో భారత ఆటగాళ్లు 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలు సాధించారు.

ఇతర లింకులు మార్చు

బయటి లింకులు మార్చు

అధికారిక వెబ్‌సైట్లు
ఇతర లింకులు

మూలాలు మార్చు

  1. http://multimedia.olympic.org/pdf/en_report_668.pdf
  2. http://www.olympic.org/uk/games/index_uk.asp |title=Olympic Games |publisher = International Olympic Committee |accessdate = 2006-12-27
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-05-04. Retrieved 2008-01-16.
  4. http://www.olympic.org/uk/games/ancient/history_uk.asp
  5. http://www.olympic.org/uk/games/ancient/index_uk.asp
  6. http://olympic.org/uk/sports/index_uk.asp |title=Sports |publisher=International Olympic Committee |accessdate=2007-03-18
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-03-17. Retrieved 2008-01-21.
  8. Moscow 1980