వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 10వ వారం

ఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి వార పత్రికలో. ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడ తన బాధ్యతలను నిర్వహిస్తూనే, ఈ శీర్షికను కూడ విజయవంతంగా కొనసాగించారు.

ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి (చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) హాస్యభరితంగా, ఆహ్లాదకరంగా వ్రాస్తూనే అవసరమైనప్పుడు, అవసరమైనంతవరకు సునిసితమైన విమర్శదగ్గర నుండి, కత్తుల్లాంటి మాటలతో తీవ్ర విమర్శకూడా చేస్తూండేవారు. చక్కటి పొందికతో, ఎక్కడా కూడ తూకం చెడకుండా, ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.

వ్యాసరచన ఎక్కువ భాగం స్వగతంలోనే జరిగింది. కొన్ని కొన్ని వ్యాసాలలో "పురాణం సీత" తన భర్తతో మా(పో)ట్లాడుతున్నట్టు వ్రాయటం జరిగింది. వార పత్రికలలో, వ్యాసాలను స్వగతంగాను లేదా ఏక వ్యక్తి సంభాషణ రూపంలో, కధలాగ చెప్పే పద్ధతి, ఈ వ్యాస శీర్షికతోనే మొదలు. వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికి భాషలో అవసరమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ, సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్టకు చేరుకున్నట్టుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపని వేగం ఉన్నది. పాఠకుల ఆసక్తికి కారణం, కొంతవరకు వ్యాసంలో చర్చించబడ్డ ఆ కాలపు సామాజిక సమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి అయినప్పటికి, వ్యాస శైలి అటువంటి ఆసక్తిని ఎక్కువగా నిలపగలిగిందని చెప్పక తప్పదు. వ్యాసాలన్నీ కూడ హాస్యభరితంగా ఉంటాయి. ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఈ విధంగా వ్రాయటమేమీ తేలిక కాదని, తేలికని ఊహిస్తున్నవారు ప్రయత్నించి చూడవచ్చని సవాలు చేసి, ఈ శీర్షిక శైలిని కొనియాడారు

ఇంకా....పూర్తివ్యాసం పాతవి