వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 02వ వారం
ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణము. మద్రాసు - కలకత్తా జాతీయ రహదారి (NH5) లో ఏలూరు పట్టణం విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు పట్టణాల మధ్య ఉంది. జిల్లా కేంద్రమైనందున ప్రభుత్వ కార్యాలయాల కేంద్రంగాను మరియు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వ్యాపార, వైద్య, విద్య, రవాణా అవసరాల కేంద్రంగా ఉంటున్నది. వరి, కూరగాయలు, పొగాకు వర్తకం, చేపల ఎగుమతి, సి.ఆర్.రెడ్డి కాలేజి, అంబికా దర్బార్ బత్తి, జూట్ మిల్లు, తమ్మిలేరు, కృష్ణ కాలువ, సమీపంలో కొల్లేరు సరస్సు - ఇవి ఏలూరు గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా ప్రస్తావించ దగిన అంశాలు.
ఏలూరు ఒక మునిసిపల్ కార్పొరేషన్. 2001 జనాభా లెక్కలు ప్రకారం ఏలూరు పట్టణ జనాభా 1,89,772. పరిసర ప్రాంతాలతో కలిపి (agglomeration) జనాభా 215,343. ఏలూరును సంస్కృతీకరించి హేలాపురి అని పిలుస్తారు. ఏలూరు పట్టణానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది.
మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర రెండు గా చీలుతుంది(అశోక్ నగర్ వద్ద). ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు పట్టణం వుంటుంది. కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణ కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కలిసి కొల్లేరులో కలవడానికి సాగుతాయి.
పరిశ్రమల పరంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదనే అనవచ్చును. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండి ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి.
ఇంకా....పూర్తివ్యాసం పాతవి