వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 30వ వారం
సింహాచలము విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
ఇంకా... పూర్తివ్యాసం పాతవి