వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 40వ వారం
పచ్చబొట్లు (Tattoos) చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనే గుర్తులు. జంతువులలో వీనిని ఎక్కువగా గుర్తించడానికి వీలుగా పెంచుకోనేవారు వేయిస్తారు.
పచ్చబొట్లు పొడిపించుకోవడం అత్యంత పురాతనమైన కళ . ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు.
ప్రేమికులు తమ శరీరాలపై వాళ్ళ వాళ్ళ పేర్లు పొడిపించుకునేవారు. జనసమ్మర్ధం కల సంతలలో, సభలలో, గుంపులలో తమ బిడ్డలు తప్పిపోయినట్లైతే సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా జాగ్రత్త కల తల్లిదండ్రులు తమ బిడ్డల చేతులపై పేర్లు పచ్చబొట్టుగా పొడిపించేవారు. స్త్రీలు ఈ పచ్చబొట్ల కళను ఉపయొగైంచుకుని తమ సౌందర్యాభివృద్ధి కోసం గడ్డాలపైన, బుగ్గలపైన సుకుమారమైన చుక్కలు పెట్టించుకునేవారు. భారతదేశంలోని కొండ జాతి ప్రజలలో పచ్చబొట్లు అత్యంత ఆదరణ పాత్రమయ్యాయి. గిరిజన స్త్రీలు తమ శరీరంలోని ముంజేతులు, హస్తాలు, చెవులు, భుజాలు, పాదాలు, బుగ్గలు, గడ్డాలు, నుదురు మొదలైన భాగాలలో పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఈ రూపాలు సాధారణంగా గీతలు, వంపులు, వలయాలు మరియు చుక్కలుగా ఉంటాయి.
ఇంకా... పూర్తివ్యాసం పాతవి