వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 47వ వారం

ఆళ్వారులు శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ ఆళువారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాధలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. మొత్తం పన్నెండుమంది ఆళ్వారులలో పొయ్‌గయాళ్వార్ (సరోయోగి), పూదత్తాళ్వార్ (భూతయోగి) మరియు పేయాళ్వార్ (మహాయోగి) - ఈముగ్గురూ ప్రధములు. కనుక వారిని ముదలాళ్వారులు అంటారు. ఆళ్వారుల జీవిత కాలాల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు అందడంలేదు. ముదళాల్వారులు ద్వాపర యుగాంతంలో ఉద్భవించారని సంప్రదాయ గాధలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. ఆళ్వారుల జీవిత విశేషాలగురించి కూడా అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.

ఆళ్వారులలో మొదటివాడు పొయ్‌గాళ్వార్. సరసునందు అవతరించినందువలన 'పొయ్‌కై ఆళ్వార్' అని పిలువబడెను. కాసార యోగి, సరోయోగి అనునవి ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు శంఖమైన పాంచజన్యమునకు ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

ఆల్వారులలో రెండవవాడు పూదత్తాళ్వార్. తన పాశురాలలో యదార్ధమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి 'పూదత్తాళ్వార్' అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన కౌమోదకికి ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

ఆళ్వారులలో మూడవవాడు పేయాళ్వార్. భగవధ్యానములో మైమరచి పిచ్చివానివలే సంచరించినందున ఇతనికి 'పేయ్' (పిచ్చి) ఆళ్వార్ అనే పేరు వచ్చింది. మహదాహ్వయుడనీ, మైలాపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు ఖడ్గమైన నందకమునకు ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి