వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 49వ వారం

మస్జిద్

మస్జిద్ లేక మసీదు : ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మస్జిద్ అరబ్బీ పేరు, (مسجد), బహువచనం మసాజిద్ (مساجد). సాధారణ మస్జిద్ కు, చిన్న మస్జిద్ కు మస్జిద్ అని, పెద్ద మస్జిద్ కు జామా మస్జిద్ (جامع), లేక మస్జిద్-ఎ-జామి అని అంటారు. ప్రాథమికంగా మస్జిద్ అనగా ప్రార్థనా స్థలము. ప్రస్తుతం ప్రపంచంలో మస్జిద్ లు సర్వసాధారణం. ముస్లింసమాజపు ప్రాముఖ్యాన్నిబట్టి మస్జిద్ లు తమ నిర్మాణశైలులు పొందియున్నాయి. ఇవి మస్జిద్-ఎ-ఖుబా మరియు మస్జిద్-ఎ-నబవి 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఆధారంగా నిర్మింపబడుచున్నవి. అరబ్బీ లో మస్జిద్ అనగా సజ్దా (మోకరిల్లడం) చేయు ప్రదేశం. సజ్దా లేక సజద పదానికి మూలం 'సజ్ద్' అనగా మోకరిల్లడం (క్రియ). సాజిద్ (కర్త) అనగా సజ్దా చేయువాడు లేక మోకరిల్లువాడు. 'మస్జూద్' (కర్మ) అనగా సజ్దా చేయించుకొన్నవాడు (అల్లాహ్). 'మస్జిద్' అనగా సజ్దా చేయు ప్రదేశం.మస్జిద్ అనేపదము ఖురాన్ లో ప్రస్తావించబడినది. ఎక్కువసార్లు మక్కా నగరంలోని కాబా ప్రస్తావింపబడినది. ఖురాన్ మస్జిద్ ను ప్రార్థనాప్రదేశంగా వర్ణిస్తుంది. హదీసులు లో గూడా మస్జిద్ ప్రార్థనాలయం. ఇస్లాం ఆవిర్భవించిన మొదటలో మస్జిద్ లు విశాలమైన హాలులలో నిర్వహింపబడేవి. రాను రాను మస్జిద్ ల నిర్మాణశైలిలో ఎత్తైన మీనార్లు చోటు చేసుకొన్నవి. ఇస్లామీయ ప్రథమ 3 మస్జిద్ లు సాదాసీదా మస్జిద్ లు. తరువాతి 1000 సంవత్సరాలకాలంలో నిర్మింపబడిన మస్జిద్ లు ఇస్లామీయ నిర్మాణ శైలులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నిర్మాణ శైలులతో మిళితమై నిర్మింపబడినవి.ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం ఆదమ్ ప్రవక్త మక్కా లోని కాబా గృహాన్ని నిర్మించి ప్రథమ మస్జిద్ గా ఉపయోగించాడు.


(ఇంకా…)