వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 50వ వారం

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

తెలుగు వికీపీడియా 11 వజన్మదినం 10 డిసెంబర్ 2013 న జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా తెలుగులో విజ్ఞానసర్వస్వ తయారీకి నడుం కట్టిన కొమర్రాజు లక్ష్మణరావు కృషికి వందేళ్ల పండగ. ఆ సందర్భంగా కొమర్రాజు లక్ష్మణరావు వ్యాసం మరల మొదటి పేజీలో ప్రదర్శితమవుతున్నది. ఈ ప్రత్యేక శుభసందర్భంగా తెలుగు వికీపీడియా మరియు సోదర తెలుగు వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన వందలాది మంది తెలుగు వారు, లక్షలమంది సహ వికీ సభ్యులకు అభినందనలు. తెలుగు వికీపీడియా కు సంబంధించి మీ అనుభవాలను మరియు వికీపీడియా భవిష్యత్తు గురించిన ఆలోచనలను అభిప్రాయాల పేజీలోని విభాగం లో తెలియచేయండి.

తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు . తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు మరియు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అనే నలుగురు మహానుభావులు తెలుగు భాషను, తెలుగు జాతిని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని తెలుగువారికి అందించిన నవయుగ వైతాళికులు వారు. 1877 మే 18 న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాధమిక విద్యను భువనగిరి లో పూర్తిచేశాడు.లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు నాగపూరు (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు.

(ఇంకా…)