వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 36వ వారం

సర్వేపల్లి రాధాకృష్ణన్

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, పాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు. 21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది.

(ఇంకా…)