సర్వేపల్లి రాధాకృష్ణన్
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ | |||
![]()
| |||
పదవీ కాలం 1962 మే 14 – 1967 మే 13 | |||
ప్రధాన మంత్రి | జవహర్ లాల్ నెహ్రూ గుల్జారీలాల్ నందా (తాత్కాలిక) లాల్ బహదూర్ శాస్త్రి గుల్జారీలాల్ నందా (తాత్కాలిక) ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
ఉపరాష్ట్రపతి | జాకిర్ హుస్సేన్ | ||
ముందు | బాబూ రాజేంద్ర ప్రసాద్ | ||
తరువాత | జాకిర్ హుస్సేన్ | ||
1వ భారత ఉప రాష్ట్రపతి
| |||
పదవీ కాలం 1952 జనవరి 26 – 1962 మే 12 | |||
అధ్యక్షుడు | బాబూ రాజేంద్ర ప్రసాద్ | ||
ప్రధాన మంత్రి | జవాహర్ లాల్ నెహ్రూ | ||
తరువాత | జాకిర్ హుస్సేన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుత్తణి , మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1888 సెప్టెంబరు 5||
మరణం | 1975 ఏప్రిల్ 17 మద్రాసు, తమిళనాడు, భారతదేశం | (వయసు 86)||
రాజకీయ పార్టీ | స్వతంత్రులు | ||
జీవిత భాగస్వామి | శివకామమ్మ | ||
సంతానం | 5 (కుమార్తెలు) 1 (కుమారుడు) | ||
పూర్వ విద్యార్థి | మద్రాసు విశ్వవిద్యాలయం | ||
వృత్తి |
| ||
పురస్కారాలు | ![]() |
జననం, బాల్యం , విద్యాభ్యాసంసవరించు
సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరంలో ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు[1]. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన.
వివాహం, సంతానంసవరించు
1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.
ఉద్యోగంసవరించు
21 సంవత్సరాలైనా దాటని వయసులో అతను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య రాధాకృష్ణన్ తత్వశాస్త్రంలో ప్రతిభను గుర్తించి, పిలిపించుకుని ప్రొఫెసరుగా నియమించాడు. అతను ఉపన్యాసాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. దాంతో అతను కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు అతను 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకుంది.
1931లో డా. సి.ఆర్.రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశాడు. అప్పట్లో రాధాకృష్ణన్ పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.
1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకైనాడు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకుడుగా పనిచేసాడు.. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశాడు.
1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడుగా పనిచేసాడు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు రాధాకృష్ణన్ నియమితుడైనాడు
రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు.
సర్వేపల్లి తాత్వికచింతనసవరించు
ఇతను పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించాడు. అతని దృష్టిలో తత్వం అనేది జీవితాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక మార్గం, భారతీయ తత్వాన్ని అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించాడు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకం, తర్కం ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. [2]
చేపట్టిన పదవులుసవరించు
- మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను నిర్వహించాడు
- 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసాడు.
- 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
- 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబరు 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు.
- 1929లో ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు అతనును ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు "తులనాత్మక మతం" (Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసం ఇవ్వగలిగే అవకాశం వచ్చింది.
- 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసాడు.
- 1936లో,స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగాడు.
- 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసాడు.
- 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసాడు.
- 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించాడు.
- 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
- 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.
- 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యాడు.
- 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
పొందిన గౌరవాలుసవరించు
- ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవానికిగాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజును సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
- 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది.
- 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందాడు.
- 1961లో జర్మనీ పుస్తక సదస్సు శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందాడు.
- 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు.
- ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేటులు సంపాదించాడు.
- ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.
రచనలుసవరించు
- The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు, వాటి ఉపయోగం ఒక తలంపు) (1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
- The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వం) (1918).
- The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వంపై మతం ఏలుబడి) (1920).
- Indian Philosophy (భారతీయ తత్వం) (2 సంపుటాలు) (1923, 1927).
- The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణం) (1926).
- The Religion We Need (మనకు కావలిసిన మతం) (1928).
- Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత భవిష్యత్తు) (1929).
- An Idealist View of Life (ఆదర్శవాది జీవిత ధృక్కోణం) (1932).
- East and West in Religion (ప్రాక్ పశ్చిమాలలో మతం) (1933).
- Freedom and Culture (స్వాతంత్ర్యం, సంస్కృతి) (1936).
- The Heart of Hindusthan (భారతీయ హృదయం) (1936).
- My Search for Truth (Autobiography) (నా సత్యశోధన (ఆత్మకథ)) (1937).
- Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు) (1938).
- Eastern Religions and Western Thought (తూర్పు మతాలు, పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
- Mahatma Gandhi (మహాత్మా గాంధీ) (1939).
- India and China (భారతదేశం, చైనా) (1944).
- Education, Politics and War (విద్య, రాజకీయం, యుద్ధం) (1944).
- Is this Peace (ఇది శాంతేనా) (1945).
- The Religion and Society (మతం, సంఘం) (1947).
- The Bhagwadgita (భగవధ్గీత) (1948).
- Great Indians (భారతీయ మహానీయులు) (1949).
- East and West: Some Reflections (తూర్పు, పడమర: కొన్ని చింతనలు) (1955).
- Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతం) (1967).
ఇతర విశేషాలుసవరించు
- రాధాకృష్ణన్ ది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారి వృత్తి చేయమన్నాడు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇక అప్పటినుంచీ ఇతను చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కొనలేని పరిస్థితుల్లో అతను నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
- మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరాడు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. అతను రోజులో 12 గం.పాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవాడు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశాడు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశాడు.
- అతను రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాడు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు.
- 1952లో బారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టాడు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. ఏనాడూ ఎయువంటి ఆడంబరాలకు పోలేదు.
- రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చాడు
- రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై, ప్రేమాభిమానాలు చూపేవాడు. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి, తమ గురువును కూర్చోబెట్టి, రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.
- రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
Thanks again {{
y vcgtreఉల్లేఖన లోపం: చెల్లని <ref>
ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి
}}== మూలాలు ==
- ^ liveindia.comలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి
- ^ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం Archived 2011-10-08 at the Wayback Machine
- ^ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర (సమగ్రంగా) sify.comలో
- ^ నాస్తికత్వంపైన ఉల్లేఖనాలు
- ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి
- సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతి రాత , అతను గొంతును కూడా ఇక్కడ వినవచ్చు
ఇంతకు ముందు ఉన్నవారు: రాజేంద్ర ప్రసాద్ |
భారత రాష్ట్రపతి 1962 మే 13—1967 మే 13 |
తరువాత వచ్చినవారు: జాకీర్ హుస్సేన్ |